యాదాద్రి మహాయాగం వాయిదా.. అసలు కారణం ఇదేనా?

Update: 2022-02-19 06:31 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకసారి డిసైడ్ అయ్యాక వెనక్కి తగ్గటం అనేది ఉండదు. అదేమైనా.. అదెంత క్లిష్టమైన.. కష్టమైనదైనా? అలాంటి మైండ్ సెట్ ఉన్న ఆయన.. తన కలల పంటగా అభివర్ణించే యాదాద్రిలో నిర్వహించాలని తలపెట్టిన శ్రీ సుదర్శన నారసింహ మహాయాగం వాయిదా వేస్తున్నట్లుగా బయటకు వచ్చిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. వచ్చే నెల 21నుంచి శ్రీసుదర్శన నారసింహ మహాయాగాన్ని నిర్వహించాలని నిర్ణయించారు.

ఇందుకోసం భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్యనే సీఎం కేసీఆర్ యాదాద్రికి వచ్చి.. దాదాపు ఆరేడు గంటల పాటు ఆలయం చుట్టూ తిరుగుతూ.. ఏర్పాట్లు.. యాగానికి జరగాల్సిన పనుల గురించి సంబంధిత వర్గాలతో చర్చించారు.

అనుకున్న సమయానికి పనులు పూర్తి అవుతాయా? అంటే.. అవుతాయని చెప్పటం తెలిసిందే. స్వయంగా సీఎం సీన్లోకి వచ్చి.. కమిట్ మెంట్ తీసుకున్న తర్వాత పనులు పూర్తికాని కారణంగా భారీ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించటం చూస్తే.. ఆశ్చర్యానికి గురి కాక మానదు. తాజా వాయిదా ప్రకటన వెనుక అసలు కారణం వేరేగా ఉన్నాయని చెబుతున్నారు. వాస్తవానికి శ్రీ సుదర్శన యాగానికి ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని గతంలో నిర్ణయించటం తెలిసిందే.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మోడీని పిలిచే పరిస్థితుల్లో కేసీఆర్ లేరు. అలా అని పిలకుండా కార్యక్రమాన్ని నిర్వహించటం బాగోదు. అందుకే.. మధ్యే మార్గంగా యాగాన్ని వాయిదా వేసేసి.. మూలవరుల దర్శనం మాత్రం గతంలో డిసైడ్ చేసినట్లుగా మార్చి 28 నుంచి ఉండేలా ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం భక్తులకు అందుతున్న పంచనారసింహుల ప్రతిష్ఠామూర్తుల దర్శనాలు.. బాలాలయాన్ని మార్చి 27 వరకు కొనసాగించనున్నారు. మరో వైపు మహాయాగానికి సంబంధించిన ఏర్పాట్లలో కీలకంగా వ్యవహరించాల్సిన చినజీయర్ స్వామితోనూ విభేదాలు ఉన్నాయన్న వార్తలు వస్తున్న వేళ.. వాయిదా నిర్ణయం ఆసక్తికరంగా మారింది.

శుక్రవారం మీడియా ప్రతినిధులను పిలిపించుకున్న చినజీయర్ స్వామి మాట్లాడుతూ.. తమకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు మధ్య దూరం పెరిగిందన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అన్నీ అబద్ధాలుగా కొట్టేయటం తెలిసిందే. ఒకవైపు చినజీయర్ స్వామి విభేదాలు లేవు.. దూరం లేదని చెప్పేస్తున్న వేళ.. అందుకు భిన్నంగా ప్రభుత్వ నిర్ణయం ఉండటం గమనార్హం.
Tags:    

Similar News