యాకూబ్ ను గంట ముందే ఉరి తీశారా?

Update: 2015-07-30 02:06 GMT
ఒకరు కాదు.. ఇద్దరు కాదు. మొత్తం 257 మంది అమాయకుల మరణానికి కారణమైన వారిలో ఒకరైన యాకూబ్ మెమన్ ను ఉరి తీశారు. అప్పుడప్పుడో ముంబయిలో చోటు చేసుకున్న బాంబు పేలుళ్లలో నిందితుడైన యాకూబ్ మెమన్ దోషి అని తేలిన తర్వాత అతని ఉరిశిక్ష అమలు కోసం ఎంతో కసరత్తు జరిగింది.

గురువారం ఉదయం 7 గంటల సమయంలో యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేస్తారన్న మాట వినిపించింది. నిబంధనల ప్రకారం చూస్తే.. ఉరిశిక్ష అమలు చేయాలన్న రోజు మొదలైన (అర్థరాత్రి 12 గంటలు దాటిన తర్వాత నుంచి) నుంచి ఎప్పుడైనా ఉరి తీసే వీలుంది.

అయితే.. యాకూబ్ మెమన్ విషయంలో ఉదయం 7 గంటలకు ఉరి అని చెప్పినప్పటికీ.. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఉదయం ఐదు గంటల నుంచే తుది చర్యలు మొదలయ్యాయని చెబుతున్నారు. అనూహ్య పరిణామంగా సుప్రీం కోర్టు యాకూబ్ ఉరిశిక్ష పై చివరి క్షణంలో నమోదైన దరఖాస్తును విచారించేందుకు తెల్లవారుజామున 3 గంటలకు విచారించి.. 4.30 గంటలకు తిరస్కరించిన తర్వాతే ఉరిశిక్ష అమలు ప్రక్రియ వేగం పుంజుకుందని చెబుతున్నారు.

ముందుగా అనుకున్న దాని కంటే దాదాపు గంట ముందే ఉరి తీసినట్లుగా చెబుతున్నారు. ఉరి శిక్ష అమలు 6.50 గంటలకు బయటకు వచ్చినా.. 6.30 గంటల సమయానికే ఉరి తీసినట్లుగా సమాచారం బయటకు పొక్కింది. మొత్తంగా చూస్తే అనుకున్న సమయానికి గంట ముందే అనే కంటే.. అరగంట ముందే ఉరి తీసినట్లుగా చెబుతున్నారు. 23 ఏళ్ల కిందట 257 మంది మరణానికి కారణమైన యాకూబ్ మెమన్ జీవితం నాగపూర్ జైల్లోనే అంతమైంది.
Tags:    

Similar News