అందుకు ఒప్పుకోని వైసీపీ, టీడీపీ నేతలు!

Update: 2022-12-26 05:56 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇప్పటికే అధికార వైసీపీ.. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ప్రతి ఇంటికి వెళ్తోంది. ఇక ప్రతిపక్ష టీడీపీ.. బాదుడే బాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి వంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇక జనసేన.. కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి వంటి వాటితో ముందుకు కదులుతోంది.

ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో ఆయా పార్టీలు అభ్యర్థులను మార్చుతాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారిని ఎంపీలుగా, అలాగే ఎంపీలుగా ఉన్నవారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే యోచనలో వైసీపీ, టీడీపీ ఉన్నాయని టాక్‌ నడుస్తోంది. అలాగే ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్న కొంతమంది అభ్యర్థుల స్థానాలను సైతం మార్చుతారని ప్రచారం జరుగుతోంది.

ఈ కోవలో వైసీపీలో మంత్రులుగా ఉన్న అంబటి రాంబాబు.. ప్రస్తుతం ఉన్న సత్తెనపల్లి నుంచి అవనిగడ్డకు, ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి సత్తెనపల్లికి, మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ అనకాపల్లి నుంచి యలమంచిలి, చీరాల మాజీ ఎమ్మెల్యే అమంచి కృష్ణమోహన్‌.. చీరాల నుంచి పర్చూరుకు ఇలా పలు మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతోంది.

ఇక టీడీపీలో గద్దె రామ్మోహన్‌రావు ప్రస్తుతం విజయవాడ తూర్పు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను విజయవాడ ఎంపీగా లేదా గన్నవరం ఎమ్మెల్యేగా పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం సూచిస్తున్నట్టు టాక్‌. అలాగే కేశినేని నాని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. విజయవాడ ఎంపీగా టీడీపీ తరపున లగడపాటి రాజగోపాల్‌ ను పోటీ చేయించాలనే యోచనలో టీడీపీ అధిష్టానం ఉందని అంటున్నారు.

లగడపాటి రాజగోపాల్‌ గతంలో రెండు పర్యాయాలు విజయవాడ ఎంపీగా గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో ఆయన టీడీపీలోకి వస్తారని.. టీడీపీ నుంచి విజయవాడ నుంచి పోటీ చేస్తారని టాక్‌ నడుస్తోంది. అలాగే బందరు టీడీపీ ఎంపీగా రెండు పర్యాయాలు పనిచేసిన కొనకళ్ల నారాయణను పెడన నుంచి పోటీ చేయాలని చంద్రబాబు ఆదేశించినట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ మార్పులకు రెండు పార్టీల్లోనూ నేతలు ఒప్పుకోవడం లేదని చెబుతున్నారు. గత ఐదేళ్లుగా తాము ఒకే చోట రాజకీయాలు చేస్తున్నామని.. కష్టపడి ద్వితీయ శ్రేణి నేతలను, కార్యకర్తలను, సోషల్‌ మీడియా వారియర్స్‌ను తయారు చేసుకున్నామని.. ఈ సమయంలో తమను వేరే నియోజకవర్గాల్లోకి వెళ్లమంటే కష్టమని చెబుతున్నట్టు తెలుస్తోంది.

ఇంకా సార్వత్రిక ఎన్నికలకు కేవలం ఏడాదికిపైగా సమయం మాత్రమే ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో వేరే నియోజకవర్గాల్లో తమను పోటీ చేయమంటే తమకు ఇబ్బందులు తప్పవని వాపోతున్నట్టు సమాచారం. ప్రస్తుతం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లోనే తాము బరిలోకి దిగుతామని ఆయా పార్టీల అధిష్టానాలకు తేల్చిచెబుతున్నట్టు తెలుస్తోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News