క‌లెక్ష‌న్ కింగ్ జోస్యం!... జ‌గ‌న్ సీఎం కావడం ప‌క్కా!

Update: 2019-03-26 10:39 GMT
టాలీవుడ్ లో క‌లెక్ష‌న్ కింగ్ గా ప్ర‌సిద్ధికెక్కిన ప్ర‌ముఖ సినీ న‌టుడు, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు మంచు మోహ‌న్ బాబు... తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌రామారావుకు అత్యంత స‌న్నిహితంగా మెల‌గిన మోహ‌న్ బాబు... గ‌తంలో టీడీపీ త‌ర‌ఫున‌నే రాజ్య‌స‌భ స‌భ్యుడిగా కొన‌సాగారు. ఆ త‌ర్వాత రాజ‌కీయాల‌కు పూర్తిగా దూరం జ‌రిగిన మోహ‌న్ బాబు... సినిమాల‌తోనే కాలం గ‌డిపేస్తున్నారు. అయితే అనూహ్యంగా ఏపీలో ఎన్నిక‌ల‌కు రంగం సిద్ధ‌మైన వేళ మోహ‌న్ బాబు తిరిగి రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించారు. నేటి ఉద‌యం హైద‌రాబాదులోని లోట‌స్ పాండ్ కు వెళ్లిన మోహ‌న్ బాబు... వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డితో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. రాజ‌కీయాల్లోకి తిరిగి రావాల‌నుకుంటున్నాన‌ని, వైసీపీలోకి చేరేందుకే వ‌చ్చాన‌ని చెప్పిన మోహ‌న్ బాబుకు సాద‌రంగా ఆహ్వానం ప‌లికిన జ‌గ‌న్‌.. పార్టీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఆ త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన మోహ‌న్ బాబు... మీడియాతో మాట్లాడారు. 20 ఏళ్ల త‌ర్వాత తాను తిరిగి రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన‌ట్టుగా ప్ర‌క‌టించారు. అయితే 20 ఏళ్ల త‌ర్వాత రాజ‌కీయాల్లోకి రావ‌డానికి కార‌ణం త‌న‌కు ఓ ఎమ్మెల్యే సీటో, ఎంపీ సీటు కోస‌మో కాద‌ని తేల్చి చెప్పారు. ఇదే విష‌యాన్ని జ‌గ‌న్‌కు కూడా స్ప‌ష్టం చేసిన‌ట్టుగా చెప్పారు. త‌న స్వార్థం కోస‌మే అయితే మూడేళ్ల నాడే తాను వైసీపీలో చేరిపోయి ఉండేవాడిన‌ని కూడా మోహ‌న్ బాబు చెప్పుకొచ్చారు. మూడేళ్ల నాడు పార్టీలోకి రావాల‌ని స్వ‌యంగా జ‌గ‌నే త‌న‌కు ఆహ్వానం ప‌లికిన విష‌యాన్ని కూడా మోహ‌న్ బాబు పేర్కొన్నారు.

ఇక వైసీపీ గెలుపు అవ‌కాశాల‌పై కూడా మాట్లాడిన మోహ‌న్ బాబు.. ఈ ద‌ఫా ఏపీ ఎన్నిక‌ల్లో వైసీపీ ఘ‌న విజ‌యం సాధిస్తుంద‌ని ఆయ‌న జోస్యం చెప్పారు. వైసీపీ ఘ‌న విజ‌యం సాధించ‌డం, జ‌గ‌న్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని కూడా ఆయ‌న చెప్పారు. గ‌తంలో అన్న‌గారి పార్టీ టీడీపీ విజ‌యం సాధిస్తుంద‌ని, అన్న‌గారు సీఎం అవుతార‌ని తాను చెప్పిన‌ట్టే జ‌రిగింద‌న్న విష‌యాన్ని గుర్తు చేసిన మోహ‌న్ బాబు... ఈ సారి కూడా త‌న మాట ప్ర‌కార‌మే వైసీపీ విజ‌యం సాదించ‌డం, జ‌గ‌న్ సీఎం కావ‌డం కూడా త‌థ్య‌మేన‌ని చెప్పారు. ఈ విష‌యాన్ని రాసిపెట్టుకోవ‌చ్చు అంటూ మీడియాకు తెలిపారు.

ఇక టీడీపీ స‌ర్కారుతో ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ పై నెల‌కొన్న వివాదంపైనా మోహ‌న్ బాబు చాలా క్లారిటీగా స్పందించార‌ని చెప్పాలి. ప్ర‌స్తుతం ఏపీ ప్ర‌భుత్వం త‌న క‌ళాశాల‌కు ఏకంగా రూ.19 కోట్ల మేర బ‌కాయి ప‌డింద‌ని మోహ‌న్ బాబు చెప్పారు. ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ల విడుద‌ల‌పై గ‌తంలోనూ చంద్ర‌బాబుతో చాలా సార్లు సంప్ర‌దించాన‌ని, ప్ర‌తిసారీ సానుకూలంగానే స్పందించిన చంద్ర‌బాబు... ఈ ద‌ఫా మాత్రం అస‌లు త‌మ ఆవేద‌న‌ను ప‌ట్టించుకోలేద‌న్నారు. సీఎం కార్యాల‌యానికి స‌వివ‌రంగా లేఖ రాసినా... క‌నీసం దానికి స‌మాధానం కూడా రాలేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి నేప‌థ్యంలో నిర‌స‌న బాట ప‌ట్ట‌క త‌ప్ప‌లేద‌ని కూడా మోహ‌న్ బాబు చెప్పుకొచ్చారు.
    

Tags:    

Similar News