ఆ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌కూ నిమ్మ‌గ‌డ్డే కావాల‌ట‌.. కోరుకుంటున్న వైసీపీ నేత‌లు!

Update: 2021-03-14 16:30 GMT
అవును.. మీరు చ‌దివిన హెడ్డింగ్ క‌ర‌క్టే..! తాను ప‌ద‌వి నుంచి దిగిపోయేలోగా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిపించే వెళ్తాన‌న్న‌ట్టుగా ప‌ట్టుబ‌ట్టారు ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్. ఆయ‌న ఉన్నంత వ‌ర‌కూ ఎన్నిక‌లు జ‌ర‌పకూడ‌ద‌న్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించింది ప్ర‌భుత్వం. కానీ.. ఇప్పుడు మిగిలిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను కూడా నిమ్మ‌గ‌డ్డే నిర్వ‌హించాల‌ని కోరుకుంటున్నార‌ట వైసీపీ కార్య‌క‌ర్త‌లు!

పంతాలు-ప‌ట్టింపుల మ‌ధ్య‌ పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఆ ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అఖండ విజ‌యం సాధించింది. రాష్ట్రంలోని పంచాయ‌తీల్లో దాదాపు 85 శాతం వ‌ర‌కు వైసీపీ ఖాతాలో ప‌డ్డాయి. ఇక‌, ఇప్పుడు మునిసిప‌ల్ ఎన్నిక‌ల ఫ‌లితాల్లోనూ ఇదే పున‌రావృతం అవుతోంది. దాదాపు తొంభై శాతానికి పైగా వార్డులు, మునిసిపాలిటీల‌ను జ‌గ‌న్ పార్టీ కైవ‌సం చేసుకుంటోంది.

చంద్ర‌బాబు నాయుడికి అనుకూలంగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ ప‌నిచేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు ఆరోప‌ణ‌లు చేసిన విష‌యం తెలిసిందే. ఈ కార‌ణం వ‌ల్లే.. ప్ర‌భుత్వం వ‌ద్దంటున్నా ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని ర‌మేష్ కుమార్‌ పట్టుబ‌డుతున్నార‌ని, ఆయ‌న‌ చంద్ర‌బాబు డైర‌క్ష‌న్లో న‌డుస్తున్నార‌ని ఆరోపించారు. ఈ విష‌య‌మై ఎన్నిక‌లు ఆపాలంటూ కోర్టు మెట్లు కూడా ఎక్కారు.

అయితే.. మొత్తానికి నిమ్మ‌గ‌డ్డ పంతం నెగ్గించుకుని ఎన్నిక‌లు పూర్తిచేశారు. కానీ.. టీడీపీ ఆశించిన‌ట్టుగా ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు రాక‌పోగా.. వైసీపీ బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీని తెచ్చిపెట్టాయి. దీంతో.. ఇదేఊపులో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల తంతు కూడా జ‌రిపించి, వైసీపీ ఘ‌న‌త‌ను రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు చాటేలా చేసిన త‌ర్వాత నిమ్మ‌గ‌డ్డ వెళ్లిపోతే బాగుంటుంద‌ని కోరుకుంటున్నారట వైసీపీ కార్య‌క‌ర్త‌లు!

ఈ నెలాఖ‌రుతో నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. కాబ‌ట్టి.. ఈ గ్యాప్ లోనే నోటిఫికేష‌న్ ఇచ్చేసి, ఆ ఎన్నిక‌ల‌ను కూడా నిర్వ‌హించాల‌ని కోరుతున్నార‌ట‌! భ‌లే వింత‌గా ఉంది క‌దూ.. ఈ ప‌రిస్థితి!




Tags:    

Similar News