వలంటీర్ల‌పై కేతిరెడ్డి కామెంట్లు విన్నారా?

Update: 2021-08-25 16:30 GMT
వ‌లంటీర్ల వ్య‌వ‌స్థ‌ను ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఉదాత్త‌మమైన‌దిగా ప‌రిగ‌ణిస్తారు. ప్ర‌భుత్వం, ప్ర‌జ‌ల మ‌ధ్య అనుసంధాన‌కర్త‌గా ఆయ‌న ఈ వ్య‌వ‌స్థ‌ను కీర్తిస్తారు. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను వ‌లంటీర్లే నేరుగా ల‌బ్ధిదారుల‌కు చేర‌వేసేందుకే తానీ వ్య‌వ‌స్థ‌ను ప్రారంభించాన‌ని కూడా జ‌గ‌న్ చెప్పారు. ఇలాంటి వ్య‌వ‌స్థ‌పై జ‌గ‌న్ పార్టీకి చెందిన కీల‌క నేత‌, అనంత‌పురం జిల్లా ధ‌ర్మ‌వ‌రం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంక‌ట‌రామిరెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ వ్య‌వ‌స్థ‌లోని వ‌లంటీర్లు అవినీతిప‌రులుగా మారిపోయార‌ని, లంచాల‌కు మ‌రిగిపోయార‌ని కేతిరెడ్డి ఆరోపించారు. ఇలా త‌న ఒక్క నియోజ‌క‌వ‌ర్గంలోనే అవినీతికి పాల్ప‌డ్డ 267 మంది వ‌లంటీర్ల‌ను విధుల్లో నుంచి తొల‌గించామ‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు.

వలంటీర్ వ్య‌వ‌స్థ అంటే జ‌గ‌న్ కు ఇప్ప‌టికీ న‌మ్మ‌క‌మేన‌ని చెప్పాలి. అయితే వ్య‌వ‌స్థ అన్నాక కొన్ని పొర‌పాట్లు కూడా జ‌రుగుతుంటాయి క‌దా. వ‌లంటీర్ల‌తో ప‌నిచేయించుకోవాల్సిన బాధ్య‌త వైసీపీ నేత‌ల‌పైనా ఉంది క‌దా. క‌రోనా నేప‌థ్యంలో రాజ‌కీయ నేత‌లంతా ఇళ్ల‌ల్లో కూర్చున్నార‌ట‌. అదే అద‌నుగా వ‌లంటీర్లు అవినీతికి తెర తీశార‌ట‌. ఈ విష‌యాన్ని కూడా కేతిరెడ్డే స్వ‌యంగా వెల్ల‌డించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించేందుకు నియ‌మితులైన వలంటీర్ల‌లో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని.. కరోనా సమయంలో ప్రజా ప్రతినిధులు బయటకు రాకపోవడాన్ని అలుసుగా చేసుకొని అవినీతికి పాల్పడ్డారని కేతిరెడ్డి చెప్పుకొచ్చారు.

వ‌లంటీర్ వ్య‌వ‌స్థ‌పై కేతిరెడ్డి ఇంకా ఏమ‌న్నారంటే.. ''వాలంటీర్లపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. కొంతమంది పనికిమాలినవాళ్లు డబ్బులు అడిగారు. కరోనా కారణంగా ప్రజా ప్రతినిధుల దగ్గరకు జనాలు వెళ్లడం లేదు. వాలంటీర్లు దీన్ని అనుకూలంగా మార్చుకున్నారు. కాల్ సెంటర్ల నుంచి ఫోన్ చేసి పథకాలపై ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం. రెండేళ్లైనా మారకపోవడంతో ముగ్గురిపై క్రిమినల్ కేసులు పెట్టాం. సచివాలయ సిబ్బందిలో కూడా ఓ 10మందికి ఛార్జ్ మెమోలు ఇచ్చాం. కొంతమందిని సస్పెండ్ చేశాం. ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యవస్థపై నమ్మకంతో పథకాల విషయంలో రాజకీయ ప్రమేయం ఉండకూడదని భావించారు. కానీ కొంతమంది మాత్రం అవినీతి చేస్తున్నారు. పథకాలకు డబ్బులు అడుగుతున్నారని తెలిస్తే వాళ్లను జైలుకు పంపిస్తున్నాం. ఎవరికైనా ఇష్టం లేకపోతే రాజీనామా చేసి వెళ్లొచ్చు. ప్రజల్ని పీడించే కార్యక్రమం చేయకూడదు. జన్మభూమి కమిటీలు చేసిన త‌ప్పే  చేయకూడదన్నారు. రాష్ట్రంలో అర్హత ఉంటే ఎవరికైనా పథకం వచ్చేస్తుంది. అనర్హత ఉంటేనే లంచం అడుగుతారు. ఎవరు తప్పు చేసినా వదిలేది లేదు. ఎవరైనా డబ్బులు అడిగితే చెప్పండి'' అని కేతిరెడ్డి తనదైన శైలిలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News