వైసీపీ, టీఆర్ఎస్‌ లో మ‌ళ్లీ ఎంపీల పండ‌గ‌!

Update: 2022-01-06 10:30 GMT
ఈ ఏడాది మొత్తం 77 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఉన్నారు. ఆ వివరాలను రాజ్యసభ సచివాలయం వెల్లడించింది. జూన్‌ 21 నాటికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి సురేష్‌ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌, విజయసాయిరెడ్డి, తెలంగాణ నుంచి లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీకాలం ముగియనుంది.

ప్రస్తుతం ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఈ స్థానాలన్నీ రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న వైసీపీ, టీఆర్ల ఎస్‌ల‌కే దక్కనున్నాయి. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి యథాతథంగా కొనసాగే సూచనలున్నాయి. మరో మూడు స్థానాల్లో కొత్తవారు రానున్నారు. టీఆర్ ఎస్‌పై అలిగి, ఆ పార్టీకి దూరంగా ఉన్న దృష్ట్యా తెలంగాణలో డి.శ్రీనివాస్‌ను కొనసాగించే అవకాశం లేదు.

ఇక‌, వయసురీత్యా లక్ష్మీకాంతరావుకు టీఆర్ ఎస్‌ మళ్లీ అవకాశం ఇవ్వకపోవచ్చు. దీంతో ఆయా స్థానాల‌కు ఎవ‌రిని ఎంపిక చేస్తార‌నేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, జాతీయ స్థాయిలో చూస్తే.. ఇప్పుడున్న సంఖ్యాబలం ప్రకారం రాజ్యసభలో బీజేపీకి 97, కాంగ్రెస్‌కు 34 మంది సభ్యులు ఉన్నారు. బీజేపీ 6 సీట్లు అటూ ఇటుగా తన బలాన్ని నిలబెట్టుకునే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్‌దీ ఇదే పరిస్థితి క‌నిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల్లో డీఎంకే, వైసీపీ బలం పెరగనుంది.

ఇతర రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేసే ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌(కర్ణాటక), ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ(జార్ఖండ్‌), పీయూష్‌ గోయల్‌(మహారాష్ట్ర), కాంగ్రెస్‌ నుంచి ఆనంద్‌ శర్మ (హిమాచల్‌ప్రదేశ్‌), జైరాం రమేశ్‌(కర్ణాటక), ఏకే ఆంటోనీ(కేరళ), పి.చిదంబరం(మహారాష్ట్ర), అంబికా సోనీ (పంజాబ్‌), కపిల్‌ సిబల్‌(ఉత్తర్‌ప్రదేశ్‌) ఉన్నారు. ఇందులో కేంద్ర మంత్రులు మళ్లీ ఏదో ఒక రాష్ట్రం నుంచి ఎన్నికవడం ఖాయంగానే కనిపిస్తోంది.

కాంగ్రెస్‌ నేతల్లో ఒకరిద్దరు మినహాయించి మిగిలిన వారంతా పెద్దల సభలో అడుగుపెట్టడానికి అవకాశాలున్నాయి. ఈసారి ఉత్తర్‌ప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలు జరిగిన అనంతరం కొత్త రాజ్యసభ సభ్యుల ఎంపిక జరిగే అవకాశం ఉంది. అందులో పార్టీలు గెలుచుకునే అసెంబ్లీ సీట్ల ఆధారంగా ప్రస్తుతం పదవీ విరమణ చేసే 11 సీట్లలో ఏ పార్టీకి ఎన్ని దక్కుతాయన్నది తెలుస్తుంది.

జార్ఖండ్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలోనూ బీజేపీకి ఇదివరికటి కంటే సీట్లు తగ్గే అవకాశాలున్నాయి. సీపీఎం కేరళలో బలాన్ని పెంచుకుని, త్రిపురలోని సీటును కోల్పోనుంది. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌లలో అసెంబ్లీ ఎన్నికల తర్వాత రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టి అక్కడ ఈ సీట్లు తారుమారయ్యే అవకాశం ఉంటుందని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.


Tags:    

Similar News