వైసీపీ ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన వైసీపీ జ‌డ్పీటీసీ

Update: 2022-01-05 09:30 GMT
సాధార‌ణంగా అధికారంలో ఉన్న పార్టీ నేత‌లు... ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన నేత‌ల‌ను టార్గెట్ చేస్తుంటారు. వారిని కేంద్రంగా చేసుకుని విమ‌ర్శ‌లు గుప్పిస్తారు. నిత్యం మీడియాముందుకు వ‌చ్చి తిట్టి పోస్తారు. కానీ, వైసీపీలో ఇప్పుడు ఈ వ్య‌వ‌హారం `రివ‌ర్స్` అయింది. వైసీపీ నేత‌ల‌ను వైసీపీ నేత‌లే టార్గెట్ చేసే ప‌రిస్థితి వ‌చ్చింది. అది కూడా పెద్ద‌గా స్థాయిలేని నేత ఒక‌రు.. ఏకంగా ఎమ్మెల్యేను టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాం శంగా మారింది. ఒక వైసీపీ జ‌డ్పీటీసీ స‌భ్యుడు ఏకంగా సొంత పార్టీ ఎమ్మెల్యేను ఏకిపారేశారు. మ‌రి ఈ రేంజ్‌లో విమ‌ర్శ‌లు గుప్పించ‌డానికి, టార్గెట్ చేయ‌డానికి పెద్ద రీజ‌న్ ఉండాల్సిందే క‌దా!

ఉంది! పెద్ద‌రీజ‌నే ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. స‌ద‌రు ఎమ్మెల్యే చేస్తున్న అవినీతితో విసిగిపోయిన ఆ జ‌డ్పీటీసీ.. స‌ద‌రు ఎమ్మెల్యేను టార్గెట్ చేశారు. ప్ర‌కాశం జిల్లా క‌నిగిరి ఎమ్మెల్యే బుర్రా మ‌ధుసూద‌న్ యాద‌వ్‌ను ఇదే జిల్లాకు చెందిన హ‌నుమంతునిపాడు జిల్లా ప‌రిష‌త్ స‌భ్యుడు దుద్ద‌ల నారాయ‌ణ‌ భారీ ఎత్తున టార్గెట్ చేశారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని నాశ‌నం చేస్తున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించారు. పార్టీ అధిష్టానం దృష్టి సారించ‌క‌పోతే.. భారీ మూల్యం చెల్లించుకోక త‌ప్ప‌ద‌ని నిప్పులు చెరిగారు. స‌రే.. ఇంత‌కీ జ‌డ్పీటీసీ స‌భ్యుడు ఇంత ఆగ్ర‌హానికి లోను అవ‌డం వెనుక రీజ‌నేంటి? అనేచూస్తే..

స్థానికంగా హ‌నుమంతునిపాడు మండ‌లంలో రెండో వైస్ ఎంపీపీ ఎన్నిక జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి సంబంధించి ప్రొటోకాల్ ప్ర‌కారం.. దుద్ద‌ల నారాయ‌ణ‌ను ఆహ్వానించి ఉండాల్సింది. కానీ, ఎవ‌రూ ఆయ‌న‌ను పిల‌వ‌లేదు. దీంతో ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన నారాయ‌ణ‌.. ఇదంతా స్థానిక ఎమ్మెల్యే వైఖ‌రి కార‌ణంగానే జ‌రిగింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రెండో వైస్ ఎంపీపీ అభ్య‌ర్థిని నిర్ణ‌యించేప్పుడు కానీ.. బీఫారాలు ఇచ్చే స‌మ‌యంలో కానీ.. త‌న‌కు క‌నీసం స‌మాచారం ఇవ్వ‌లేద‌ని.. నారాయ‌ణ పేర్కొన్నారు.

``జ‌డ్పీటీసీ స‌భ్యుడైన త‌న‌కే ఇలా జ‌రిగితే.. పార్టీ శ్రేణుల ప‌రిస్థితి ఏవిధంగా ఉంటుందో చెప్ప‌నక్క‌ర‌లేదు. ప‌ద‌వులు అలంకార‌ప్రాయ‌మే`` అని నారాయ‌ణ నిప్పులు చెరిగారు. నాయ‌కులు, పార్టీ శ్రేణుల‌కు త‌గిన గుర్తింపు, గౌర‌వం ఉండేలా పార్టీ అధిష్టానం ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని ఆయ‌న కోరారు. ఇదిలావుంటే, మ‌రోవైపు.. క‌నిగిరి నియోజ‌క‌వ‌ర్గంలోని పీసీ ప‌ల్లి, సీఎస్ పురం మండ‌లాల్లోనూ వైసీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు బ‌య‌ట‌ప‌డ్డాయి.

పీసీ ప‌ల్లి మండ‌లంలో తాము చెప్పిన వారికి రెండో వైస్ ప్రెసిడెంట్ ప‌ద‌వి ఇవ్వ‌లేద‌ని పేర్కొంటూ..ఏకంగా జ‌డ్పీటీసీలు, ఎంపీటీసీలు కొంద‌రు మండ‌ల క‌న్వీన‌ర్ ఏర్పాటు చేసిన స‌మావేశానికి డుమ్మా కొట్టారు. సో.. మొత్తంగా చూస్తే.. వైసీపీ ప‌రిస్థితి మేడి పండు మాదిరిగా ఉంద‌ని.. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. విభేదాల‌తో పార్టీ నేత‌లు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకోవ‌డం ద్వారా పార్టీని బ‌ల‌హీన‌ప‌రుస్తున్నార‌ని అంటున్నారు. మ‌రి ఇప్ప‌టికైనా అధిష్టానం దృష్టి పెడుతుందా? లేదా? అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది.


Tags:    

Similar News