ఇన్నేళ్ల తర్వాత అమెరికాలో ఆ మహిళకు మరణశిక్ష అమలు

Update: 2021-01-14 03:40 GMT
ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికాలో మరణశిక్ష అంత త్వరగా విధించరు. ఎంతో దారుణ నేరానికి పాల్పడితే తప్పించి మరణశిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకోరు. తాజాగా.. ఒక మహిళా నేరస్తురాలికి మరణశిక్షను అమలు చేశారు. మరో వారంలో అమెరికా అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సిన ట్రంప్.. ఆమె మరణ శిక్షకు మినహాయింపు ఇచ్చేందుకు నో చెప్పారు. దీంతో.. సుదీర్ఘకాలం తర్వాత సదరు మహిళకు మరణశిక్షను అమలు చేశారు.

పదిహేనేళ్ల క్రితం ఉన్మాదంగా వ్యవహరించిన  లీసా మాంట్ గొమెరీ అనే మహిళను విష ఇంజెక్షన్ ఇవ్వటం ద్వారా మరణశిక్షను అమలు చేశారు. 1953 తర్వాత అమెరికాలో ఈ తరహాలో ఒక మహిళకు మరణశిక్షను అమలు చేయటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 1.31 గంటలకు ఆమె తుదిశ్వాస విడిచినట్లుగా అధికారులు పేర్కొన్నారు.

2004 డిసెంబరులో ఇంటర్నెట్ లో కుక్క పిల్లలు అమ్మకానికి ఉన్నాయన్న ప్రకటన చూసిన లీసా.. ఆ యాడ్ ఇచ్చిన బాబీ అనే 23 ఏళ్ల మహిళను కాంటాక్ట్ చేసింది. వారింటికి వెళ్లిన ఆమె.. అనూహ్యంగా ఉన్మాదంతో ప్రవర్తించింది. అప్పటికే ఎనిమిదినెలల గర్భిణీ అయిన ఆమె మెడకు తాడు బిగించి దారుణంగా చంపేసింది. అనంతరం మరింత ఉన్మాదంతో.. కత్తిని తీసుకొచ్చి ఆమె గర్భాన్ని చీల్చి.. అందులోని శిశువును అపహరించింది.

ఈ నేరానికి శిక్షగా ఆమెకు మరణశిక్షను విధించారు. తాజాగా ఈ శిక్షను అమలు చేసే సమయంలో.. ఏదైనా చెప్పాల్సింది ఉందా? అని అడిగితే నో చెప్పినట్లుగా  అధికారులు చెబుతున్నారు. ఆమెకు మరణశిక్ష అమలు చేయాలా? వద్దా? అన్న అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. క్షమాభిక్ష ఇవ్వాలని కోరినా ట్రంప్ అందుకు అంగీకరించలేదు. దీంతో.. ఆమె మరణశిక్ష అమలుకు సాధ్యమైంది.
Tags:    

Similar News