ప్రస్తుతం కర్ణాటకలో రాజకీయ పరిస్థితులు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలదన్నే రీతిలో గంట గంటకు మారిపోతున్నాయి. ఏ పార్టీకీ ప్రభుత్వం ఏర్పాటు చేసేంత మెజారిటీ రాకపోవడంతో హంగ్ అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఓ పక్క కాంగ్రెస్ కు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు జేడీఎస్ ఎమ్మెల్యే కుమార స్వామి సిద్ధమవగా....మరోపక్క జేడీఎస్ లో చీలిక తెచ్చేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. దేవెగౌడ పెద్దకుమారుడు రేవణ్ణ సహా ఆయన వెంట ఉన్న 12 మంది ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టి సర్కార్ ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. తాను రేపు ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నట్లు యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి రేవణ్ణ షాక్ ఇచ్చారు. తమ పార్టీలో చీలికలేమీ లేవని - తాను ఎవరికీ మద్దతివ్వడం లేదని రేవణ్ణ క్లారిటీ ఇచ్చారు. జేడీఎస్ శాసనసభాపక్షనేతగా కుమారస్వామిగౌడను తమ పార్టీ ఎమ్మెల్యేలంతా ఎన్నుకున్నామని స్పష్టం చేశారు. కుమారస్వామితో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేవణ్ణ ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను జేడీఎస్ నుంచి బయటకు వస్తున్న వార్తలను రేవణ్ణ ఖండించారు. పార్టీలో ఎటువంటి చీలికా లేదని - తనపై వస్తున్న వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. జేడీఎస్ - కాంగ్రెస్ కూటమి కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. జేడీఎస్ ఎల్పీ నేతగా ఎన్నికైన కుమారస్వామిని రేవణ్ణ మీడియాముఖంగా అభినందించారు. మరోవైపు - కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు తాను సీఎంగా ప్రమాణం స్వీకారం చేయబోతున్నట్లు బీజేపీ శాసనసభా పక్ష నేత యడ్యూరప్ప షాకింగ్ కామెంట్స్ చేశారు. అంతేకాకుండా, ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాలు కూడా హాజరుకాబోతున్నట్లు వెల్లడించారు. అయితే, యడ్యూరప్ప మాత్రం అడపాదడపా....ఇటవంటి సంచలన ప్రకటనలు చేసి జేడీఎస్, కాంగ్రెస్ లపై మాటల దాడి చేస్తున్నారు. ప్రస్తుతం జేడీఎస్ - కాంగ్రెస్, బీజేపీలు తమ ఎమ్మెల్యేలు గోడ దూకకుండా...గట్టిగా క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు.మరోవైపు, కర్ణాటక గవర్నర్ వజుభాయ్ గుజరాత్ కు చెందిన వాడు కావడంతో కన్నడనాట యడ్యూరప్ప సీఎం కాబోతున్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఆ కాన్ఫిడెన్స్ తోనే యడ్యూరప్ప ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.