‘సీఎం’ కుర్చీ రేటు.. వెయ్యి కోట్లట

Update: 2017-02-14 06:26 GMT
పదవుల్ని నోట్ల కట్టలతో కొనే తంతు కొత్తేం కాదు. కాకుంటే.. సర్పంచ్ పదవికో.. ఎమ్మెల్యే పదవికోసం ఎంత ఖర్చు పెడతారన్న దాని మీద కాసింత లెక్కలున్నాయి. చిన్న చిన్న పదవులకే రేటు ఉన్నప్పుడు సీఎం పదవిని చేపట్టేందుకు సైతం ఖర్చు లెక్క ఉండదా? అన్న డౌట్ చాలామందిలో వచ్చినా.. దాని సోర్స్ తెలీక ఇన్నాళ్లు కామ్ గా ఉండిపోయారు. ఇకపై.. అలాంటి అవకాశం లేనట్లే. సీఎం కుర్చీ కోసం ఎంత ఖర్చు పెట్టాలన్న లెక్కపై ఒక ఐడియా వచ్చేసినట్లే.

ఈ మధ్యన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మీద భారీ ఆరోపణే చేశారు.. అదే రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నేత.. మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప. సీఎం కుర్చీ కోసం వెయ్యి కోట్ల కప్పాన్ని కాంగ్రెస్ పార్టీకి చెల్లించినట్లుగా సిద్ధరామయ్య మీద ఆరోపణ చేశారు. దీనిపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. తమను దెబ్బ తీయటానికే ఇలాంటి విమర్శలు చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు.

మాటలతో మరకేయటం అంత ఈజీ కాదన్న విషయంపై ఐడియా ఉండటంతో.. మంచి ఆధారం ఒకటి సంపాదించాలన్న తపనతో.. ఎట్టకేలకు ఒక ఆడియో క్ప్ ను బయటకు తీసుకొచ్చేశారు. ఇరువురు బీజేపీ నేతల మధ్య నడిచిన సంభాషణల్ని సీడీల రూపంలో తీసుకొచ్చేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. కాంగ్రెస్ మీదా.. సిద్ధరామయ్య మీద  యాడ్యురప్ప ఏ తరహా విమర్శలు చేశారో.. ఇంచుమించు అదే తీరులో యాడ్యూరప్ప సంభాషణలు ఉండటం గమనార్హం. ఏ వెయ్యి కోట్ల మరకను సిద్ధరామయ్య మీద వేశారో.. తాను సైతం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అంతే మొత్తాన్ని చెల్లించినట్లుగా ఈ సీడీల్లో ఉండటం విశేషంగా చెప్పాలి.

ఈ సీడీలోని సంభాషణలు చూస్తే.. సిద్ధరామయ్య వెయ్యి కోట్లు ఇచ్చాడు.. మనమూ ఇచ్చామని అనంతకుమార్ వ్యాఖ్యానించినట్లుగా కనిపిస్తుంది. ‘మీరు అప్పుడు ఇచ్చారు. సిద్ధూ ఇప్పుడు ఇచ్చాడు. అయినా.. ముఖ్యమంత్రి వెయ్యి కోట్లు ఇవ్వలేదంటే ఎవరూ నమ్మరు’ అని అనంతకుమార్ వ్యాఖ్యానించటం గమనార్హం. బురదలో రాయేస్తే మరకలు అంటుకుంటాయని యడ్యూరప్పకు బీజేపీ నేత అనగా.. దానికి ఆయన నవ్వు స్పందనగా ఉండటం గమనార్హం. ఇలా.. సిద్ధరామయ్య మీద వెయ్యి కోట్ల రచ్చఒక కొలిక్కి రాక ముందే.. బీజేపీ నేతలు సైతం.. తాము సీఎంగా ఉన్నప్పుడు అధినాయకత్వానికి వెయ్యి కోట్ల కప్పాన్ని చెల్లించిన వైనం బయటకు వచ్చినట్లే. సర్పంచ్ కుర్చీకే కాదు.. సీఎం కుర్చీకి రేటు ఉందన్న లెక్కపై తాజా ఉదంతం కాస్తంత క్లారిటీ ఇచ్చిందనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News