మరో కొత్త పార్టీ.. ‘స్వరాజ్‌ ఇండియా’

Update: 2016-10-03 09:38 GMT
దేశంలో మరో కొత్త పార్టీ ప్రారంభమైంది.. మొన్నటికి మొన్న పంజాబ్ ఎన్నికల కోసం మాజీ క్రికెటర్ సిద్ధూ ఓ పార్టీ ప్రారంభించగా.. తాజాగా ఢిల్లీ కేంద్రంగా మరో పార్టీ ప్రారంభమైంది. ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేతలంతా కలిసి ఈ పార్టీని స్థాపించారు. స్వరాజ్ ఇండియా పేరుతో ప్రారంభమైన ఈ పార్టీలో సామాజిక ఉద్యమకారులు, పేరుమోసిన న్యాయవాదులు ఉండడంతో దీన్నేమీ తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదన్న అంచనాలు మొదలయ్యాయి.

ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మాజీ నేతలు ప్రశాంత్‌ భూషణ్‌ - యోగేంద్ర యాదవ్‌ లు స్వరాజ్‌ ఇండియా పార్టీని ప్రారంభించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 400 మంది ప్రతినిధుల సమక్షంలో నూతన పార్టీ ఆవిర్భవించింది. పార్టీ అధ్యక్షుడిగా యోగేంద్ర యాదవ్‌ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అజిత్‌ ఝా జాతీయ ప్రధాన కార్యదర్శిగా - ప్రొఫెసర్‌ ఆనంద్‌ కుమార్‌ సలహాదారుగా ఎంపికయ్యారు. కాగా ఒకప్పుడు ఆప్ కూడా ప్రారంభమైన కొత్తలో ఎవరి అంచనాలకు అందలేదు. పుబ్బలో పుట్టి మఖలో పోయే పార్టీగానే అంతా భావించారు. అయితే.. ఉవ్వెత్తున వచ్చిన ఆ పార్టీ ఢిల్లీలో అధికారం చేపట్టి అంతలోనే వదులుకుంది. కానీ.. మళ్లీ వెంటనే జరిగిన ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడం తో పాటు ఇప్పుడు దేశ వ్యాప్త విస్తరణకు అడుగులు వేస్తోంది.  ముఖ్యంగా పంజాబ్ లో ఆ పార్టీ కీలకంగా ఎదుగుతోంది. గోవాలోనూ సై అంటోంది. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇలా ఆప్ ఇప్పుడు జాతీయ పార్టీగా మారేందుకు శర వేగంగా కదులుతోంది.

అలాంటి ఆప్ నుంచి వచ్చిన నేతలు పెట్టిన పార్టీ కావడంతో ఆప్ పొరపాట్ల నుంచి వీరు గుణపాఠాలు నేర్చుకుంటారని.. అక్కడ జరిగిన తప్పులు తాము చేయకుండా అడుగులు వేస్తారని భావిస్తున్నారు. దీంతో స్వరాజ్ పార్టీ వచ్చే ఎన్నికల నాటికి ఏ స్థాయికి ఎదుగుతుందన్నది ఇప్పుడే చెప్పలేకపోయినా తక్కువగా అంచనా వేయడానికి వీల్లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News