దేశ‌మంతా ఒకే భాష.. త‌లైవా కౌంట‌ర్

Update: 2019-09-18 10:42 GMT
దేశ‌మంతా ఒకే భాష అనే నినాదం మాటున హిందీని ద‌క్షిణాది రాష్ట్రాల‌పై రుద్దాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నాలు మొద‌లుపెట్టిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల హిందీ భాషా దినోత్స‌వం సంద‌ర్భంగా కేంద్ర హోమ్ మినిస్ట‌ర్ అమిత్ షా దేశ వ్యాప్తంగా హిందీ భాష‌ను క‌చ్చితంగా మాట్లాడాల్సిందే అంటూ వ్యాఖ్య‌లు చేశారు. ఒక‌వేళ ఇదే ఆచ‌ర‌ణ‌లోకి వ‌స్తే.. ద‌క్షిణాదిపై అది తీవ్ర ప్ర‌భావాన్ని చూపించ‌బోతోంది. దీంతో రాజ‌కీయ‌వ‌ర్గాల‌తో పాటు సెల‌బ్రిటీల నుంచి తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మవుతోంది.

బ‌ల‌వంతంగా ద‌క్షిణాది రాష్ట్రాల‌పై హిందీని రుద్దాల‌ని చూస్తున్నార‌ని.. ద‌క్షిణాదిపై ఉత్త‌రాది ఆధిప‌త్యం కోస‌మే ఇలాంటి నినాదానికి తెర‌లేపార‌ని ద‌క్షిణాది ప్ర‌ముఖుల నుంచి బ‌ల‌మైన వ్య‌తిరేక‌ స్వ‌రం వినిపిస్తోంది. ముఖ్యంగా స్థానిక‌త‌కు ప‌ట్టంగ‌ట్టే త‌మిళ‌నాడుకు చెందిన రాజ‌కీయ పార్టీలు.. ప్ర‌జా సంఘాలు అమిత్‌ షాపై తీవ్రంగా విరుచుకుప‌డుతున్నాయి. ప‌లువురు కోలీవుడ్ స్టార్లు దీనిపై స్పందిస్తున్నారు.

ఇటీవ‌ల స్టాలిన్ తో పాటు న‌టుడు క‌మ‌ల్‌ హాస‌న్ కూడా అమిత్ షాపై సెటైర్లు వేసి అగ్గి రాజేశారు. కేంద్రానికి వ్య‌తిరేకంగా స్థానికుల‌కు మ‌ద్ద‌తుగా ఈ రోజు త‌మిళ‌ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ చేసిన వ్యాఖ్య‌ మ‌రింత ఆజ్యం పోసింది. ``బలవంతంగా ఎవ‌రూ భాష‌ను ప్ర‌జ‌ల‌పై రుద్ద‌లేరు. `ఒకే దేశం ఒకే భాష` అనే నినాదం లౌకిక‌వాద దేశంలో సాధ్యం కాదు. మిగ‌తా దేశాల్లో ఒకే దేశం ఒకే భాష అన్న‌ది సాధ్య‌మే కానీ మ‌న ద‌గ్గ‌ర సాధ్య‌ప‌డ‌దు. కాబ‌ట్టి బ‌ల‌వంతంగా మాతృ భాష‌ల్ని ప‌క్క‌న పెట్టి హిందీని ప్ర‌జ‌ల‌పై రుద్దాల‌నుకోవ‌డం మంచి ప‌ద్ద‌తి కాదు. హిందీని బ‌ల‌వంతంగా రుద్ద‌డం త‌మిళ‌నాడుతో పాటు ద‌క్షిణాది రాష్ట్రాలు ఎట్టిప‌రిస్థితుల్లోనూ అంగీక‌రించ‌వు`` అని ర‌జ‌నీ వ్యాఖ్యానించారు. సూప‌ర్ స్టార్ స్వ‌యంగా ఇలా ఘాటుగా బీజేపీ ఛీఫ్ అమిత్ షాకు కౌంట‌ర్ ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

   

Tags:    

Similar News