పాకిస్తాన్ క్రికెట్ లో ముసలం

Update: 2021-06-23 00:30 GMT
అస్థిరతకు మారుపేరైన పాకిస్తాన్ క్రికెట్ లో మరో ముసలం మొదలైంది. జట్టు ఎంపికలో అవకతవకలు జరిగాయని చాలా సార్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడూ మరోసారి అలాంటి ఆరోపణలే చేశారు ఆ జట్టు ప్రధాన బ్యాటింగ్ కోచ్.

జట్టు ఎంపిక విషయంలో తనను సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తూ జట్టు ప్రధాన బ్యాటింగ్ కోచ్ పదవికి దిగ్గజ ఆటగాడు యూనిస్ ఖాన్ రాజీనామా చేశాడు. అయితే కోచ్ పదవి నుంచి తప్పుకోవడానికి గల కారణాలను అధికారికంగా వెల్లడించేందుకు ఆయన మొగ్గుచూపలేదు.

పాకిస్తాన్ జట్టు త్వరలో ఇంగ్లండ్, వెస్టిండీస్ లలో పర్యటించనుంది.  ఈ నేపథ్యంలో యూనిస్ ఖాన్ కోచ్ పదవికి రాజీనామా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.యూనిస్ ఖాన్ రాజీనామా చేయడంతో  బ్యాటింగ్ కోచ్ లేకుండానే పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్, విండీస్ పర్యటనలకు వెళ్లనున్నట్టు ఆ దేశ క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది.

ఇక యూనిస్ ఖాన్ రాజీనామాపై ఆ దేశ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ వాసిమ్ ఖాన్  స్పందించారు. యూనిస్ లాంటి దిగ్గజ ఆటగాడి సేవలను కోల్పోవడం పాకిస్తాన్ కు పెద్ద లోటు అని తెలిపాడు.యూనిస్ ఖాన్ పాకిస్తాన్ తరుఫున 118 టెస్టులు, 265 వన్డేలు, 25 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఏకంగా 41 సెంచరీలు, 81 అర్థసెంచరీలు చేశాడు. దాదాపు 18000 పరుగులను సాధించాడు. యూనిస్ ఖాన్ ఖాతాలో ఓ ట్రిపుల్ సెంచరీ కూడా ఉంది.

పాకిస్తాన్ జట్టు ఈనెల 25వ తేదీ నుంచి ఇంగ్లండ్ లో పర్యటించనుంది. జూలై 20 వరకు సాగే ఈ పర్యటనలో పాకిస్తాన్ , ఇంగ్లండ్ తో మూడు వన్డేలు , మూడు టీ20లు ఆడనుంది. అనంతరం అక్కడి నుంచే నేరుగా వెస్టిండ్ సపర్యటకు బయలు దేరుతుంది.
Tags:    

Similar News