జగన్ దీక్షకు ఎత్తేసే టైం వచ్చేసిందంట?

Update: 2015-10-10 05:32 GMT
ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్న ఆయన ముఖం కళ తప్పటమే కాదు.. నీరసించిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.

ప్రత్యేక హోదాపై కేంద్రం తీరును నిరసిస్తూ జగన్ నిరవధిక దీక్షను ఏపీలోని గుంటూరు దగ్గరి నల్లపాడులో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక హోదాపై ఏదో ఒక సానుకూల ప్రకటన వస్తుందన్ననమ్మకం లేకున్నా.. తాను అనుకున్నట్లుగా దీక్షను విజయవంతంగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరోవైపు.. జగన్ దీక్షను అడ్డుకోవటం ద్వారా ఏపీ సర్కారు మరింత ఇబ్బంది అవుతుందన్న ఆలోచనతో ఏపీ అధికారపక్షం ఉన్నట్లు కనిపిస్తోంది.

తొలుత.. జగన్ దీక్షపై తీవ్రస్థాయిలో ఏపీ తమ్ముళ్లు విరుచుకుపడినా.. రెండు రోజులు గడిచేసరికి.. విమర్శల తీవ్రత తగ్గించటమే దీనికి నిదర్శనం. ఏపీ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన పనుల్లో ఊపిరి సలపనంత బిజీగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. జగన్ దీక్ష గురించి పెద్దగా స్పందించకుండా.. అసలేమీ జరగటం లేదన్నట్లుగా వ్యవహరించటం గమనార్హం.

ఇక.. జగన్ ఆరోగ్య పరిస్థితి చూస్తే ఆయన మరింత నీరసించిపోతున్నారు. దీక్ష నాలుగో రోజుకు చేరటంతో ఆయనలో బీపీ పడిపోతోంది. షుగర్ లెవల్స్ తరిగిపోతున్నాయి.  తాజాగా ఆయనకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. జగన్ బాగా నీరసించిపోయారని.. ఆయన పల్స్ రేట్ గంట.. గంటకూ పడిపోతున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో.. శనివారం అర్థరాత్రి లోపు ఆయన దీక్షను భగ్నం చేసి.. బలవంతంగా ఆసుపత్రికి తీసుకెళ్లి.. ఫ్లూయిడ్స్ ఎక్కించే అవకాశమే ఎక్కువగా ఉందన్న మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
Tags:    

Similar News