ఈ జగన్ ఆ జగన్‌ను ఒప్పించగలరా.... ?

Update: 2021-08-23 15:30 GMT
రెండు ప్రభావవంతమైన రంగాలల్లో ఇద్దరు జగన్లు ఉన్నారు. సినీ రంగంలో డేషింగ్ డైరెక్టర్ పూరీ జగన్ ఉంటే రాజకీయాల్లో వైఎస్ డేరింగ్ లీడర్ జగన్ ఉన్నారు. మరి ఈ ఇద్దరు జగన్ ల మధ్య పోలిక ఏంటి, బంధం ఏంటి అంటే ఆసక్తికరమైన అంశమే అది అవుతుంది. పూరీ జగన్ సినిమాల్లో తనదైన విలక్షణతను చాటుకున్నారు. ఆయన తన భావాలను చెప్పేందుకు ఎక్కడా వెనక్కు తగ్గరు అని అంటారు. ఇక ఆయనకు నేరుగా వైసీపీ రాజకీయాలతో సంబంధాలు లేవు కానీ ఆయన సోదరుడు పెట్ల ఉమా శంకర్ గణేష్ విశాఖ జిల్లా నర్శీపట్నం ఎమ్మెల్యే, అలా ఆయనకు ఒక కనెక్షన్ అయితే ఉంది. ఇక ఉమా శంకర్ గణేష్ మొదట మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి అనుచరుడే. తరువాత వైసీపీలో చేరి డైనమిక్ లీడర్ గా ఎదిగారు.

ఇక 2019లో జరిగిన ఎన్నికల్లో ఆయన మాజీ మంత్రి అయ్యన్న మీద ఏకంగా పాతిక వేల ఓట్ల తేడాతో గెలిచి సత్తా చాటారు. ఇక గత రెండున్నరేళ్ళలో ఆయన అయ్యన్న ఇలాకాలో రాజకీయంగా గట్టిగానే జెండా పాతేశారు. అయ్యన్న లాంటి మాస్ లీడర్ సైతం ఇపుడు ఉనికి పోరాటం చేయాల్సి వస్తోంది. మాటకు మాట ఎత్తుకు ఎత్తు అంటూ అయ్యన్నను మించి ఉమా శంకర్ దూసుకుపోతున్నారు. ఈ టైమ్ లో ఆయనకు కనుక మంత్రి పదవి అప్పగిస్తే విశాఖ రూరల్ జిల్లాలో పార్టీని పరుగులు పెట్టిస్తారు అంటున్నారు. అంతే కాదు అయ్యన్న రాజకీయ జీవితం కూడా ముగుస్తుందని అంచనా వేస్తున్నారు.

గతంలో చంద్రబాబు విశాఖ జిల్లా నుంచి వెలమలకు ప్రాముఖ్యత ఇచ్చేవారు. జగన్ మాత్రం శ్రీకాకుళానికి చెందిన ధర్మాన కృష్ణ దాస్ కి మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు. దాంతో బాబుకు కుడి భుజం లాంటి అయ్యన్నను పొలిటికల్ గా గట్టిగా ఢీ కొట్టాలీ అంటే ఉమా శంకర్ కి పదవి ఇవ్వడం అవసరమన్న మాట ఉంది. రూరల్ జిల్లాలో అధిక సంఖ్యాకులుగా ఉన్న వెలమలకు కూడా వైసీపీ వైపు తిప్పుకున్నట్లుగా అవుతుందని కూడా చెబుతున్నారు.

ఇక తమ్ముడికి మంత్రి పదవి కోసం పూరీ జగన్ కూడా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆయన కనుక జగన్ తో రాయబేరాలు జరిగితే నర్శీపట్నం నుంచి మంత్రి గా ఉమా శంకర్ అవడం ఖాయమనే అంటున్నారు. వైఎస్ జగన్ కూడా సినీ మద్దతు కోరుకుంటున్నారు. అందువల్ల పూరీ జగన్ మాట ఆయన కాదనరు అన్న టాక్ కూడా ఉంది. చూడాలి మరి ఈ ఇద్దరు జగన్లూ చేతులు కలిపితే రచ్చ రచ్చే అంటున్నారు.





Tags:    

Similar News