జగన్‌ నోట.. ముగ్గురు మహాకవుల మాట, పాట!

Update: 2022-11-12 10:30 GMT
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు రోజుల విశాఖపట్నం పర్యటనలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభలో ప్రసంగించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ దేశ ప్రగతి రథసారథి ప్రధాని మోడీ అని కొనియాడారు. సహృదయంతో ఏపీని అన్ని విధాలా ఆదుకోవాలని ప్రధానిని కోరారు.

విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్సిటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మోడీతో పాటు జగన్‌ వేదికను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన జగన్‌ విశాఖలో జనసముద్రం కనిపిస్తోందన్నారు. దేశ ప్రగతి సారథి ప్రధాని నరేంద్ర మోదీగారికి స్వాగతం పలుకుతున్నానన్నారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కెరటాల్లా జనం ఇక్కడికి తరలి వచ్చారని చెప్పారు. మిమ్మల్నిందరిని చూస్తుంటే ప్రజా కవి, శ్రీకాకుళం వాసి, గాయకుడు వంగపాడు పాడిన పాట... 'ఏం పిల్లడో ఎల్దామొస్తవా..' అనే పాట గుర్తుకు వస్తుందని చెప్పారు.

ఇదే చోట నడయాడిన మహాకవి శ్రీశ్రీ మాటల్లో చెప్పాలంటే.. వస్తున్నాయ్‌.. వస్తున్నాయ్‌.. జగన్నాథ రథచక్రాలు' మాదిరిగా ఇక్కడకు ప్రజలు తరలివచ్చారని ప్రశంసించారు. అలాగే దేశమంటే మట్టి కాదోయ్‌.. దేశమంటే మనుషులోయ్‌ అని చెప్పిన విజయనగరం మహాకవి గురజాడ అప్పారావు మాటలు కర్తవ్య బోధ చేస్తున్నాయన్నారు. ఇక్కడకు వచ్చిన జనసంద్రాన్ని చూస్తుంటే మహాకవి మాటలు గుర్తొస్తున్నాయన్నారు.

దాదాపు పది వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులు ప్రారంభిస్తున్న ప్రధాని మోదీకి.. రాష్ట్ర ప్రభుత్వం, అశేష జనం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.

ఈ మూడున్నరేళ్లలో ఏపీ సంక్షేమం, అభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని జగన్‌ చెప్పారు. విద్య, వైద్యం, సాగు, సామాజిక న్యాయం, మహిళా సంక్షేమం, అభివృద్ధి, సంక్షేమం, గడప వద్దకే పరిపాలన తమ ప్రాధాన్యతలుగా మారాయన్నారు. ప్రతి కుటుంబం నిలదొక్కుకునేందుకు తమ ఆర్థిక వ్యవస్థలో ప్రతీ రూపాయి ఖర్చు పెట్టామన్నారు. వికేంద్రీకరణ, పారదర్శకతతో కూడిన పాలన కొనసాగిస్తున్నామని చెప్పారు.

 కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం రాజకీయాలకు అతీతమని వెల్లడించారు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం సహాయ సహకారాలు మరింత కావాలని ప్రధాని మోడీని కోరారు. ఎనిమిదేళ్ల కిందటినాటి రాష్ట్ర విభజన గాయం నుంచి ఏపీ ఇంకా కోలుకోలేదన్నారు. విభజన హామీలైన పోలవం, రైల్వేజోన్, విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి.. ప్రత్యేక హోదా వరకు అన్ని హామీలు అమలు చేయాలని కోరారు.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News