చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థి!... ఎక్క‌డా క‌నిపించ‌లేదే!

Update: 2019-04-20 04:06 GMT
ఏపీలో ఉత్కంఠ‌భ‌రితంగా సాగిన ఎన్నిక‌లు ముగిశాయి. ఈ నెల 11న జ‌రిగిన పోలింగ్ లో ఓట‌ర్లు పోలింగ్ బూత్ ల‌కు క్యూ క‌ట్టారు. ఫ‌లితంగా రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం న‌మోదైంది. ఇటు అధికార టీడీపీతో పాటు అటు విప‌క్ష వైసీపీకి కూడా ప్ర‌తిష్ఠాత్మ‌క ఎన్నిక‌లుగా విశ్లేష‌కులు అభివ‌ర్ణించిన ఈ ఎన్నిక‌ల్లో చాలా చిత్రాలు - విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఆ విచిత్రాలన్నింటినీ జ‌నం చూశారు గానీ... ఓ ముఖ్య ఘ‌ట‌నను మాత్రం మనం పెద్దగా పట్టించుకోనే లేదు. అదేంటంటే... టీడీపీ అధినేత - ఏపీ ఆప‌ద్ధర్మ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబునాయుడు సొంత నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో ఆయ‌న‌కు ప్ర‌త్య‌ర్థిగా వైసీపీ బ‌రిలోకి దించిన నేత గుర్తున్నారా. చంద్ర‌మౌళి అనే ఈయ‌న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. 2014 ఎన్నిక‌ల్లోనూ చంద్ర‌బాబుపై చంద్ర‌మౌళే పోటీ చేశారు.

అప్ప‌టిదాకా చంద్ర‌బాబుకు ప్ర‌త్య‌ర్థులుగా బ‌రిలోకి దిగిన వారంద‌రి కంటే కూడా చంద్ర‌మౌళి ఎక్కువ ఓట్లు సాధించి ఔరా అనిపించారు. చంద్ర‌బాబును ఓడించేంత స‌త్తా లేకున్నా... బ‌ల‌మైన పోటీ ఇస్తార‌న్న భావ‌న‌తోనే వైసీపీ త‌ర‌ఫున చంద్ర‌మౌళి అభ్యర్థిత్వానికే ఈ సారి కూడా జ‌గ‌న్ ప్రాధాన్యం ఇచ్చారు. స‌రే బాగానే ఉంది... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఓ మోస్త‌రుగానే ఓట్ల‌ను సాధించిన చంద్ర‌మౌళి ఈ సారి కూడా చంద్ర‌బాబును ఓడించ‌లేకున్నా... మెజారిటీని బాగానే త‌గ్గిస్తార‌న్న విశ్లేష‌ణ‌లు వినిపించాయి. అయితే ఎన్నిక‌ల ప్ర‌చారంలో చంద్ర‌మౌళి అడ్ర‌స్సే క‌నిపించ లేదు. కుప్పం ప‌ర్య‌ట‌న‌కు జ‌గ‌న్ వెళ్లినా కూడా చంద్ర‌మౌళి క‌నిపించ‌లేదు. చంద్ర‌మౌళి త‌ర‌ఫున ఆయ‌న స‌తీమ‌ణి - పిల్ల‌లు మాత్రం నియోజ‌క‌వ‌ర్గాన్ని చుట్టేశారు. అదేంటీ.... అభ్య‌ర్థి చంద్ర‌మౌళి అయితే... ఆయ‌న క‌నిపించ‌కుండా - ఆయ‌న కుటుంబం ఎందుకు క‌నిపించిన‌ట్టు? అస‌లు చంద్ర‌మౌళికి ఏమైంది? ఎక్క‌డ ఉన్నారు? అన్న విష‌యాల‌పై పెద్ద‌గా దృష్టి సారించే అవ‌కాశం రాలేదు. ఎందుకంటే... రాజ‌కీయ పార్టీల మ‌ధ్య నిత్యం పేలుతున్న మాట‌ల తూటాల‌పైనే ఆస‌క్తిని ప్ర‌ద‌ర్శించిన మ‌నం... ఇలాంటి విష‌యాల‌ను అంత‌గా ప‌ట్టించుకోం క‌దా.

అయినా చంద్ర‌మౌళి ఏమ‌య్యార‌న్న విష‌యానికి వ‌స్తే... ఎన్నికలు స‌మీపించే దాకా బాగానే ఉన్న చంద్ర‌మౌళి నామినేష‌న్ల ఘ‌ట్టం ప్రారంభం కావ‌డంతోనే అనారోగ్యానికి గుర‌య్యార‌ట‌. ఆ అనారోగ్యం త‌గ్గేందుకు చికిత్స తీసుకున్న చంద్ర‌మౌళి... అనారోగ్యం నుంచి కోలుకోవ‌డానికి బ‌దులుగా మ‌రింత‌గా అనారోగ్యానికి గుర‌య్యారట‌. ఈ కార‌ణంగా అస‌లు బ‌య‌ట‌కే రాలేని ప‌రిస్థితిలో చంద్ర‌మౌళి ఉంటే... ఆయ‌న త‌ర‌ఫున ఆయ‌న కుటుంబం ప్ర‌చారంలో పాల్గొంద‌ట‌. ఎన్నిక‌ల సంద‌డి ముగిసింది క‌దా... త‌న పార్టీ నేత‌ - కీల‌క స్థానంలో పోటీ చేసిన నేత ఆరోగ్యం ఎలా ఉందోన‌ని తెలుసుకునేందుకు శుక్ర‌వారం వైఎస్ జ‌గ‌న్ నేరుగా అపోలో ఆసుప‌త్రికి వెళ్లారు. ఆసుప‌త్రిలో ఉన్న చంద్ర‌మౌళి ఆరోగ్యంపై వైద్యులు - చంద్ర‌మౌళి కుటుంబ స‌భ్యుల‌ను వాక‌బు చేశారు. అంటే... అనారోగ్యం కార‌ణంగా చంద్ర‌బాబు ప్ర‌త్య‌ర్థి అయిన చంద్ర‌మౌళి ఈ ఎన్నికల ప్ర‌చారంలో అస్స‌లు క‌నిపించ‌లేద‌న్న మాట‌.


Tags:    

Similar News