క్రీడలపై జగన్ సంచలన నిర్ణయం...

Update: 2019-08-28 01:30 GMT
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకి సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పాలనను తనదైన శైలిలో పరుగులు పెట్టిస్తున్నారు. ఈ పరుగులు పెట్టించడంలో కొన్ని సంచలన నిర్ణయాలు కూడా తీసుకుంటూ... దాదాపుగా ఏ ఒక్క రంగాన్ని కూడా మరిచిపోని విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇలాంటి చర్యల్లో భాగంగా తాజాగా జగన్ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. క్రీడలకు గతంలో ఏ ఒక్క ప్రభుత్వం ఇవ్వని ప్రాధాన్యాన్ని ఇచ్చేందుకు నిర్ణయించిన జగన్... రాష్ట్రంలో క్రీడలకు కొత్త శోభను తీసుకొచ్చే దిశగా పయనిస్తున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో మరింత మంది క్రీడాకారులు రాష్ట్ర కీర్తిని విశ్వవ్యాప్తంగా చాటడం ఖాయమేనన్న వాదన వినిపిస్తోంది.

తన ట్విట్టర్ వేదికగా క్రీడలకు సంబంధించి ఆయన పోస్ట్ చేసిన ట్వీట్ ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంతో క్రీడాకారులు పులకించిపోవడం ఖాయమేనని చెప్పక తప్పదు. అంతేకాకుండా కొత్తగా క్రీడల్లో ప్రవేశించే పిల్లలకు కూడా ఈ నిర్ణయం ఎంతగానో ప్రోత్సాహం ఇస్తుందన్న వాదన కూడా వినిపిస్తోంది. ఇంతగా అందరినీ ఆకట్టుకునేలా క్రీడలకు సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయం ఏమిటన్న విషయానికి వస్తే... ఈ నెల 29న నిర్వహించనున్న క్రీడా దినోత్సవంలో భాగంగా ఇప్పటిదాకా క్రీడల్లో సత్తా చాటిన క్రీడాకారులకు నగదు నజరానాలు అందించనున్నట్లుగా జగన్ ప్రకటించారు. నవ్యాంధ్ర ఏర్పడ్డ నాటి నుంచి అంటే... 2014 నుంచి క్రీడల్లో సత్తా చాటిన వారందరికీ ఈ ప్రోత్సాహకాలు అందిస్తామని జగన్ పేర్కొన్నారు.

అంతేకాకుండా ఏటా ఈ తరహా కార్యక్రమాన్ని చేపడతామని, నగదు పురస్కారాలు, ప్రోత్సాహకాలు కూడా ఏటా క్రమం తప్పకుండా అందిస్తామని కూడా జగన్ పేర్కొన్నారు. నగదు పురస్కారాలతో పాటు క్రీడల్లో తమదైన శైలి సత్తా చాటిన రాష్ట్ర క్రీడాకారులను ఘనంగా సత్కరిస్తామని కూడా జగన్ ప్రకటించారు. మొత్తంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో క్రీడలకు కొత్త శోభ వచ్చినట్టేనన్న వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం నుంచి ఈ తరహా సహకారం ఉంటే... రాష్ట్రం నుంచి ఇంకెంత మంది పీవీ సింధులు, సాయి ప్రణీత్ లు తయారవుతారోనన్న ఆసక్తికర చర్చ కూడా సాగుతోంది.
Tags:    

Similar News