జ‌గ‌న్ మాట!... టీడీపీ విజ‌యం గెలుపే కాదు!

Update: 2017-08-28 12:54 GMT
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌లు... న‌వ్యాంధ్ర‌లో 2019లో జ‌రగ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్సేన‌న్న వాద‌న వినిపించింది. అందుకేనేమో అటు అధికార టీడీపీతో పాటు విప‌క్ష వైసీపీ కూడా స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డాయ‌నే చెప్పాలి. మూడేళ్ల దాకా అస‌లు నంద్యాల అభివృద్ధిని ప‌ట్టించుకోని చంద్ర‌బాబు స‌ర్కారు... ఉప ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా నంద్యాల‌లో వంద‌ల కోట్ల విలువ చేసే అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టింది. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ ఇవ్వ‌డానికి ముందే అక్క‌డ రెండు ప‌ర్యాయాలు ప‌ర్య‌టించిన సీఎం చంద్ర‌బాబు... ఎన్నిక‌ల్లో ఎలా గెలవాల‌న్న కోణంపై స‌మీక్ష‌ల మీద స‌మీక్ష‌లు జ‌రిపారు. నంద్యాల ప్ర‌జ‌లు అడిగిన వాటితో పాటు అడ‌గ‌ని వాటికి కూడా నిధులు అక్క‌డిక‌క్క‌డే మంజూరు చేయాల‌ని ఆయ‌న అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఆ వెంట‌నే నంద్యాల‌కు నిధుల వ‌ర‌ద పారింది.

ఇక విప‌క్షంలో ఉన్న వైసీపీ అధికార పార్టీ వైఫ‌ల్యాలే అస్త్రాలుగా చేసుకుని పోరు సాగించింది. ఏదైతేనేం... ఉప ఎన్నిక ముగిసింది. అధికార పార్టీ అభ్య‌ర్థి భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి 27వేల 456 ఓట్ల‌తో విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలో టీడీపీ సంబ‌రాల్లో మునిగిపోగా - వైసీపీ తాను చేసిన పొర‌పాట్ల‌పై పునఃస‌మీక్ష  చేసుకునే ప‌నిలో ప‌డిపోయింది. ఉప ఎన్నిక ఫ‌లితంపై మాట్లాడేందుకు హైద‌రాబాదులోని లోట‌స్ పాండ్ లో ఉన్న త‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మీడియాతో ప‌లు విష‌యాలు చెప్పారు. అస‌లు నంద్యాల‌లో టీడీపీకి ద‌క్కిన విజ‌యం అస‌లు గెలుపే కాద‌ని వ్యాఖ్యానించారు. మొత్తం మంత్రి మండ‌లిని - 50 మందికి పైగా ఎమ్మెల్యేల‌ను నంద్యాల‌లో కూర్చోబెట్టిన చంద్ర‌బాబు... ఏకంగా రూ.200 కోట్ల‌ను ఓట‌ర్ల‌కు పంపిణీ చేశార‌ని ఆరోపించారు. అంతేకాకుండా త‌మ‌కు ఓటేయ‌కపోతే... పింఛ‌న్లు క‌ట్ చేస్తామ‌ని - ఇళ్ల మంజూరును నిలిపివేస్తామ‌ని ఓట‌ర్ల‌ను భ‌యభ్రాంతుల‌ను చేశార‌న్నారు.

ఇన్ని చేసిన కార‌ణంగా టీడీపీ అరాచ‌కాల‌కు భ‌య‌ప‌డ్డ ఓటర్లు టీడీపీకి ఓటు వేయ‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి నెల‌కొంద‌న్నారు. అంటే నంద్యాల ఓట‌ర్ల‌ను బెదిరించే టీడీపీ గెలిచింద‌ని కూడా ఆయ‌న అన్నారు. ఇక ఈ ఎన్నిక‌ల‌ను రెఫ‌రెండంగా భావిస్తారా? అన్న మీడియా ప్ర‌శ్న‌కు స్పందించిన జ‌గ‌న్‌... కాస్తంత ఘాటైన రీతిలో స‌మాధానం చెప్పారు. త‌మ పార్టీ టికెట్‌ పై విజ‌యం సాధించి టీడీపీలో చేరిన 20 మంది ఎమ్మెల్యేల‌తో రాజీనామా చేయిస్తే... అప్పుడు జ‌రిగే  ఉప ఎన్నిక‌ల‌ను అయితే తాను రెఫ‌రెండంగా భావిస్తాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. *ఒక్క చోట అయితే 12 మంది మంత్రులు - 50 మంది ఎమ్మెల్యేల‌ను చంద్ర‌బాబు కూర్చోబెట్టారు. ఒక్క‌చోట కాబ‌ట్టే రూ.200 కోట్లు వెద‌జల్లారు. త‌న అనుచ‌ర గ‌ణంతో ఓట‌ర్ల‌ను బెదిరించారు. 20 చోట్ల ఎన్నిక‌లు జ‌రిగితే... చూస్తాం. చంద్ర‌బాబు ఎన్నిచోట్ల బెదిరింపుల‌కు పాల్ప‌డ‌గ‌ల‌రో? ఎన్ని చోట్ల 12 మంది మంత్రుల‌ను - 50 మంది ఎమ్మెల్యేల‌ను కూర్చోబెడ‌తారో? ఎన్ని చోట్ల రూ.200 కోట్లు ఖ‌ర్చుపెడ‌తారో?* అంటూ ఆయ‌న త‌న‌దైన శైలిలో టీడీపీపై విరుచుకుప‌డ్డారు.
Tags:    

Similar News