జ‌గ‌న్ ట్వీట్స్‌!... ఏపీలోనూ క‌థువా - ఉన్నావో!

Update: 2018-04-16 11:34 GMT
దేశంలో  ఇప్పుడు ఎక్క‌డ చూసిన మాన‌వ మృగాల దాష్టీకానికి బ‌లైపోయిన చిన్నారుల గురించే చ‌ర్చ జ‌రుగుతోంది. క‌ర‌డుగ‌ట్టిన హృద‌యాల‌కు సైతం క‌న్నీటిని తెప్పించే ఈ ఘ‌ట‌న‌ల‌పై దేశం మొత్తం అట్టుడుకుతోంది. ఢిల్లీలో చోటుచేసుకున్న నిర్భ‌య  ఘ‌ట‌న నాడు జ‌నంలో ఆగ్ర‌హావేశాలు పెల్లుబికితే... ఇప్పుడు క‌థువా, ఉన్నావో ఘ‌ట‌న‌ల‌ను త‌ల‌చుకుని లోలోప‌లే మ‌ద‌న‌ప‌డిపోతున్న హృద‌యాలు  కోట్ల సంఖ్య‌లో ఉన్నాయని చెప్ప‌క త‌ప్ప‌దు. అభం శుభం తెలియ‌ని బాలిక‌ల‌పై హ‌త్యాచారానికి పాల్ప‌డ్డ దుర్మార్గుల‌ను క‌ఠినంగా శిక్షించాల‌న్న డిమాండ్ అంత‌కంత‌కూ పెరిగిపోతోంది.  

ఈ రెండు ఘ‌ట‌న‌ల‌పై ఏపీ అసెంబ్లీలో విప‌క్ష నేత‌, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కూడా స్పందించారు. క‌థువా, ఉన్నావో ఘ‌ట‌ల‌ను చూస్తుంటే... ఆడపిల్లల్ని కాపాడుకోవడంలో మనం విఫలం చెందామనే భావించాల్సి వ‌స్తోందని జ‌గ‌న్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా జ‌గ‌న్ ఈ అంశాల‌పై త‌న ఆవేద‌న‌ను వెలిబుచ్చారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై స్పందించ‌డంతోనే స‌రిపెట్ట‌ని జ‌గ‌న్‌.. క‌థువా, ఉన్నావోలో చోటుచేసుకున్న దారుణ ప‌రిస్థితులు దేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఉన్నాయ‌ని, ప్ర‌త్యేకించి ఏపీలోనూ ఉన్నావో - క‌థువాలు ఉన్నాయ‌ని కూడా ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఏపీలోనూ ఈ త‌రహా ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయ‌ని చెప్పిన జ‌గ‌న్‌... ఆ త‌రహా ఘ‌ట‌న‌లు ఎక్క‌డ జ‌రిగాయ‌న్న విష‌యాన్ని కూడా పేర్కొన‌డం విశేషం. గతేడాది అక్టోబర్‌ 17న వైజాగ్‌ రైల్వే కాలనీలో ఓ మహిళపై పట్టపగలే లైంగికదాడి జరిగిందని, అనంతరం డిసెంబర్‌ లో పెందుర్తిలో మరో దళిత మహిళను వివస్త్రను చేసి దాడిచేశారని పేర్కొన్నారు. ఈ సారి నిందితులను అస్సలు విడిచిపెట్టకూడదని, ఏ ఒక్కరు కూడా ఇలాంటి నేరానికి పాల్పడాలన్న ఆలోచన రాకుండా భయం పుట్టేలా కఠిన శిక్షలు విధించాలని డిమాండ్ చేశారు.

Tags:    

Similar News