పిల్లల తల్లులకు వ్యాక్సిన్ .. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !

Update: 2021-06-08 05:30 GMT
ఏపీలో శరవేగంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతోంది. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోల్చితే , ఏపీలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సాగుతుంది. ప్ర‌స్తుతం 45 ఏళ్లు దాటిన వారికి వేగంగా  వ్యాక్సిన్ అందిస్తున్నారు. అయితే , రాష్ట్రంలో అందరికి సరిపడేంత వ్యాక్సిన్ లేకపోవడంతో 18 ఏళ్లు పైబ‌డిన వారికి వ్యాక్సినేష‌న్ కొంచెం మంద‌కోడిగా సాగుతున్న‌ది.ఈ తరుణంలోనే   రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులందరికీ వ్యాక్సిన్‌ వేయాలని నిర్ణయించినట్టు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. ఇప్పటివరకు 45 ఏళ్ల వయసు పైన వారికే వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. కానీ చిన్నారుల్లో కరోనా వచ్చినప్పుడు తల్లి అవసరం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తల్లులకు కూడా టీకా వేస్తే రక్షణ ఉంటుందని చెప్పారు.

సెకండ్ వేవ్ క‌రోనా కేసులు క్ర‌మంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.  థ‌ర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉంద‌ని, థ‌ర్డ్ వేవ్ పిల్ల‌ల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్న స‌మ‌యంలో ఏపీ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  థ‌ర్డ్ వేవ్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండి ఆసుప‌త్రుల్లో చేరాల్సి వ‌చ్చే ఐదేళ్ల‌లోపు చిన్నారుల‌కు, వారి త‌ల్లుల‌కు టీకా ఇవ్వాల‌ని  కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారులున్న తల్లులు 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఉండవచ్చన్నారు. వీరికి వ్యాక్సిన్‌ ఇవ్వడంపై వయసు నిబంధనలు సడలిస్తూ త్వరలోనే మార్గదర్శకాలు జారీచేస్తామని తెలిపారు. భవిష్యత్‌ అంచనాలనుబట్టి ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాకుండా ప్రైవేటు ఆస్పత్రుల్లో కూడా వారం రోజుల్లోగా వసతులను పరిశీలించాలని ఆదేశించినట్టు చెప్పారు. ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోనూ ఈ అంచనా వేస్తామన్నారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లో చిన్నారులకు అవసరమైన వెంటిలేటర్లు, వార్డులు తదితరాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు తెలిపారు. ఈనెల 20వ తేదీ వరకు కర్ఫ్యూ పొడిగించాలని, ఈనెల 11 నుంచి సడలింపు సమయాన్ని 2 గంటలు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు.   రాష్ట్రంలో 57,07,706 మందికి వ్యాక్సిన్‌ తొలిడోసు వేశామని, 25,80,432 మందికి రెండుడోసులు వేశామని చెప్పారు.
Tags:    

Similar News