గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు జ‌గ‌న్‌!..బాబుకు బీపీ గ్యారెంటీ!

Update: 2019-02-08 17:25 GMT
ఏపీ అసెంబ్లీకి ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ.. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిజంగానే స్పీడు పెంచేశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా ప్ర‌జా సంక‌ల్ప యాత్ర పేరిట తాను చేపట్టిన సుదీర్ఘ యాత్ర కొన‌సాగినంత కాలం కాస్తంత నెమ్మ‌దిగానే క‌నిపించిన జ‌గ‌న్‌... పాద‌యాత్ర పూర్తి కాగానే  స్పీడు పెంచేశార‌నే చెప్పాలి. ఇప్ప‌టికే చో ద‌ఫా డిల్లీ టూర్‌కు వెళ్లొచ్చిన జ‌గ‌న్‌... రెండు రోజుల క్రితం స‌మ‌ర శంఖారావం పేరిట ప్ర‌త్యేక కార్యాచ‌ర‌ణ‌కు శ్రీ‌కారం చుట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో భాగంగా జిల్లాల ప‌ర్య‌ట‌ల‌న‌కు వెళుతున్న జ‌గ‌న్‌... ఆయా జిల్లాల పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో పాటు త‌ట‌స్థుల‌తో వ‌రుస‌గా భేటీలు నిర్వ‌హిస్తున్నారు. తిరుప‌తిలో ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మంతో పార్టీలో ఫుల్ జోష్ క‌నిపిస్తోంది. అధికార పార్టీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేసే జిమ్మిక్కుల‌పై స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న‌తో ఉన్న జ‌గ‌న్‌... టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడికి ఎక్క‌డిక‌క్క‌డ బ్రేకులు వేసుకుంటూ వెళుతున్నారు.

ఈ దిశ‌గా జ‌గ‌న్ వేసే ప్ర‌తి అడుగు కూడా చంద్ర‌బాబుకు మంట పుట్టిస్తుంద‌నే చెప్పాలి. జ‌గ‌న్ చేసే ప్ర‌తి కార్య‌క్ర‌మంపైనా స్వ‌యంగా చంద్రబాబు విరుచుకుప‌డుతున్న తీరే ఇందుకు నిదర్శ‌నంగా చెప్పుకోవాలి. ఢిల్లీ టూర్‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘాన్ని క‌లిసి జ‌గ‌న్‌... ఏపీలో త‌న‌కు ప్ర‌తికూలంగా ఉన్న ఓట‌ర్ల‌ను జాబితా నుంచి తొల‌గించిన వైనంపై ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా అధికార పార్టీకి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తూ... విప‌క్షాల గొంతు నొక్కుతున్న ప‌లువురు పోలీసు అధికారుల‌పైనా ఆయ‌న ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ త‌రహా జ‌గ‌న్ అడుగు చంద్ర‌బాబుకు నిజంగానే మంట పుట్టించింద‌నే చెప్పాలి. ఇక తాజాగా జ‌గ‌న్ మ‌రో కీల‌క అడుగు వేస్తున్నారు. ఈసీకి చేసిన ఫిర్యాదునే మ‌రోమారు బ‌య‌ట‌కు తీస్తున్న జ‌గ‌న్‌... రేపు తెలుగు రాష్ట్రాల ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్‌తో భేటీ కానున్నారు. ఈసీకి ఇచ్చిన ఫిర్యాదునే గ‌వ‌ర్న‌ర్‌కు కూడా ఇవ్వ‌నున్న జ‌గ‌న్‌.. ఏపీలో ఓట్ల తొల‌గింపు, అధికార పార్టీ ద‌మ‌న నీతిపై మ‌రింత గ‌ట్టిగా గ‌ళం విప్ప‌నున్నారు. గ‌వర్న‌ర్‌తో జ‌గ‌న్ భేటీ... ఇప్పుడు భారీ చ‌ర్చ‌ల‌కే తెర లేపిందని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇప్ప‌టికే గ‌వ‌ర్నర్ త‌మ‌కు వ్య‌తిరేకంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపిస్తున్న చంద్ర‌బాబు... రేపు గ‌వ‌ర్న‌ర్ వ‌ద్ద‌కు జ‌గ‌న్ వెళితే ఊరుకుంటారా? ఎంత‌మాత్రం ఊరుకోరు. ఉడికిపోతార‌నే చెప్పాలి. ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏ పార్టీ అయినా గెలుపు కోస‌మే ప‌నిచేస్తుంది క‌దా. అయినా రాజ‌కీయ పార్టీ అన్నాక గెలుపే ల‌క్ష్యంగా సాగాలి క‌దా. మ‌రి జ‌గ‌న్ చేస్తున్న‌ది కూడా అదే క‌దా. అధికారంలో ఉన్న పార్టీ చేస్తున్న దురాగ‌తాల‌ను విప‌క్షంగా ఎత్తి చూపాలి క‌దా. జ‌గ‌న్ ఇప్పుడు చేస్తున్న‌ది అదే క‌దా. మ‌రి జ‌గ‌న్ స్పీడు పెంచితే... చంద్ర‌బాబుకు ఎందుకు మంటెత్తాలి?. ఈ ప‌రిస్థితుల్లో రేపు గ‌వ‌ర్న‌ర్‌తో జ‌గ‌న్ భేటీ త‌ర్వాత చంద్ర‌బాబు అండ్ కో ఏ రేంజిలో విరుచుకుపడుతుందో చూడాలి.


Tags:    

Similar News