'ఊరు వదిలేస్తావా? లేదా? బట్టలూడదీసి కొడతా'

Update: 2022-08-31 06:29 GMT
వివాదాలకు దూరంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భావించినా.. ఆయనకు దగ్గరగా ఉండేవారు.. సన్నిహితులు.. ఆయన బంధువులు మాత్రం ఆయన్నునిత్యం ఏదో ఒక వివాదంలోకి నెడుతున్నారు. తాజాగా వైఎస్ కొండారెడ్డి వంతుగా చెప్పాలి. ఆ మధ్యన కాంట్రాక్టర్ ను బెదిరించిన ఉదంతం ముఖ్యమంత్రి జగన్ వరకు వెళ్లటం.. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయటం.. కేసు పెట్టాలని చెప్పటం.. అన్నట్లే చట్టం తన పని తాను చేసుకుంటూ పోయి.. అరెస్టు కూడా అయ్యారు.. కాకుంటే రెండు రోజుల వ్యవధిలోనే ఆయనకు బెయిల్ వచ్చింది.

అనంతరం మూడు నెలలుగా జిల్లాలో కనిపించని కొండారెడ్డి.. తాజాగా రీఎంట్రీ ఇచ్చారు. వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన గ్రామ సచివాలయం భవనాన్ని. ఇతర ఆఫీసుల కోసం నిర్మించిన భవనాల్ని చూసిన కొండారెడ్డి.. అక్కడ జరిగిన పనుల్ని అభినందించారు.

ఈ భవనాల్ని సెప్టెంబరు ఒకటిన (గురువారం) ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు.ఇలాంటివేళ.. తన ప్రత్యర్థుల్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక వ్యక్తిని బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 'కొండారెడ్డితోనే తగులుకుంటావా? పొరపాటున వైఎస్ భాస్కర్ రెడ్డి చిన్నాన్నను ఒక మాట్లాడా. దాన్ని పట్టుకొని నువ్వు రికార్డు చేసి సీఎం జగన్ సార్ కు పంపుతావా? నా వాయిస్ ను రికార్డు చేస్తావా? సూసైడ్ చేసుకున్న ప్రవీణ్ గతే నీకూ పడుతుంది. డేట్ ఫిక్స్ చేయ్.. నీ కథేంటో.. నా కథేంటో తేల్చుకుందాం'' అని మండిపడ్డారు.

అక్కడితో ఆగని ఆయన బండ బూతులు తిట్టేస్తూ.. 'నువ్వు చక్రాయపేట వదిలిపెట్టి వెళ్లాలి. నడిరోడ్డుపై నీ బట్టలిప్పి కొట్టకపోతే..' అంటూ బండ బూతుతు తిట్టేశారు. ఈ మాటల్ని కూడా రికార్డు చేసి ముఖ్యమంత్రికి పంపరా.. చూద్దాం.. చెత్త నా కొడకా.. అంటూ శివాలెత్తారు. వైఎస్ కొండారెడ్డి ఇంతలా ఎందుకు విరుచుకుపడ్డారు? దాని వెనుకున్న స్టోరీకి వెళితే.. కొన్ని నెలల క్రితం ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాల్లోకి వెళ్లాలి.

కర్నూలు జిల్లా చాగలమర్రి నుంచి రాయచోటి వరకు పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మీదుగా నేషనల్ హైవే విస్తరణ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల్ని ఎస్ ఆర్ కే కన్ స్ట్రక్షన్స్ చేపట్టింది. మే ఐదున కొండారెడ్డి తమను కమిషన్ కోసం బెదిరింపులకు దిగినట్లుగా పోలీసులకు కంప్లైంట్లు వెళ్లాయి. ఇదే అంశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దకు వెళ్లటం.. ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేసి వెంటనే అరెస్టుకు ఆదేశాలు జారీ చేశారు.

అరెస్టు అయిన రెండు రోజులకు బెయిల్ లభించింది. అయితే.. ఆయన్ను ఉద్దేశించి జిల్లా కలెక్టర్.. ఎస్పీలు ఇద్దరూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తీరు మార్చుకోవాలన్నారు. అంతేకాదు.. కొండారెడ్డిని జిల్లా బహిష్కరణకు నిర్ణయం తీసుకున్నారు. అయితే.. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఏమీ జారీ కాలేదు.

అదే సమయంలో అప్పటి నుంచి దాదాపు మూడు నెలల పాటు కొండారెడ్డి కనిపించకుండా పోయారు. సరిగ్గా మరో రెండు రోజుల్లో సీఎం జగన్ భవనాల్ని ప్రారంభించేందుకు వస్తారన్న వేళలో రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. రావటంతోనే తన నోటికి పని చెప్పటం ఆసక్తికరంగా మారింది. మరి.. ఆయన్ను జిల్లా నుంచి బహిష్కరించినట్లుగా చెప్పారు కదా? అని అధికారుల్ని అడిగితే.. నిర్ణయం తీసుకున్నా.. అధికారిక ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. మరి.. తాజా పరిణామాల నేపథ్యంలో సీఎం జగన్ ఎలా రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News