దివంగ‌త మ‌హానేత వైఎస్ కు ఘ‌న నివాళి!

Update: 2018-09-02 04:47 GMT
చాలామంది నేత‌లు మ‌న చుట్టూ ఉన్నా..కొంద‌రు మాత్రం జ‌న హృద‌యాల్లో నిలిచిపోతారు. ఏళ్ల‌కు ఏళ్లు గ‌డిచినా వారి ముద్ర‌లు జ‌నం మ‌న‌సుల నుంచి వీడిపోవు. అలాంటి ప్ర‌త్యేక‌త దివంగ‌త మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి సొంతమ‌ని చెప్పాలి. ఈ రోజు ఆయ‌న తొమ్మిదో వ‌ర్థంతి. ఈ నేప‌థ్యంలో ఏపీతో స‌హా తెలంగాణ‌లోని ప‌లు ప్రాంతాల్లో ఆయ‌న వ‌ర్థంతి వేడుక‌లు జ‌రుగుతున్నాయి.

ఈ రోజు ఉద‌యం మ‌హానేత వ‌ర్థంతి నేప‌థ్యంలో క‌డ‌ప జిల్లా ఇడుపులపాయ‌లోని వైఎస్సార్ ఘాట్ వ‌ద్ద వైఎస్ కుటుంబ స‌భ్యులు.. వైఎస్ స‌తీమ‌ణి విజ‌య‌మ్మ‌.. కోడ‌లు వైఎస్ భార‌తి.. కుమార్తె ష‌ర్మిల‌.. అల్లుడు బ్ర‌ద‌ర్ అనిల్ కుమార్‌.. ఇత‌ర కుటుంబ స‌భ్యులు.. పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు.. అభిమానులు హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా దివంగ‌త మ‌హానేత స‌మాధి ద‌గ్గ‌ర అంజ‌లి ఘ‌టించారు. ప్ర‌త్యేక ప్రార్థ‌న‌ల్ని నిర్వ‌హించారు. వైఎస్ తో త‌మ‌కున్న అనుబంధాన్ని గుర్తు చేసుకోవ‌టంతో పాటు.. అలాంటి నేత మ‌ళ్లీ రార‌న్న‌మాట ప‌లువురి నోట వినిపించింది. మ‌రోవైపు వైఎస్ కు ఆయ‌న త‌న‌యుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఘ‌న నివాళులు అర్పించారు. తండ్రి తొమ్మిది వ‌ర్థంతిని పుర‌స్క‌రించుకొని వైఎస్ విగ్ర‌హానికి పూల‌మాల అర్పించి.. శ్ర‌ద్దాంజ‌లి ఘ‌టించారు.

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర‌లో భాగంగా జ‌గ‌న్ ప్ర‌స్తుతం అన్న‌వ‌రం శివారులో ఉన్నారు. వైఎస్ కు నివాళులు అర్పించే స‌మ‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లు.. పార్టీ కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున జోహార్ వైఎస్సార్ అంటూ నిన‌దించారు. జ‌గ‌న్ ను క‌లిసేందుకు ఈ రోజు ఉద‌యం నుంచి పెద్ద ఎత్తున నేత‌లు.. కార్య‌క‌ర్త‌లు జ‌గ‌న్ శిబిరం వ‌ద్ద‌కు పోటెత్తారు.
Tags:    

Similar News