ష‌ర్మిళ ఎంట్రీ!... బాబు అండ్ కోకు వ‌ణుకే!

Update: 2019-03-25 09:00 GMT
ఎన్నిక‌ల హీట్ బాగా పెరిగిపోయిన త‌రుణంలో వైసీపీ త‌ర‌ఫున ఆ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సోద‌రి వైఎస్ ష‌ర్మిళ‌... స్ట్రైట్‌గానే ఎంట్రీ ఇచ్చేశారు. వ‌చ్చీ రావ‌డంతోనే వైరి వ‌ర్గానికి ముచ్చెమ‌ట‌లు ప‌ట్టించేలా ప్ర‌శ్నల ప‌రంప‌ర‌ను సంధించిన ష‌ర్మిళ‌... తాను ఓ సామాన్యురాలుగా సంధిస్తున్న ఈ ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు వ‌ద్ద ఆన్స‌ర్లున్నాయా? అంటూ త‌న‌దైన శైలిలో ఫైర‌య్యారు. అస‌లు అధికారంలో ఉన్న పార్టీ ఐదేళ్ల‌లో ప్ర‌జ‌ల‌కు ఏం చేశామ‌న్న విష‌యాన్ని చెప్పి ఓట్లు అడ‌గాల్సింది పోయి... మ‌ళ్లీ అధికారం ఇస్తే ఇవి చేస్తాం, అవి చేస్తామంటూ కొత్త హామీలివ్వ‌డమేమిట‌ని ష‌ర్మిళ ప్ర‌శ్నించారు. కాసేపటి క్రితం అమ‌రావ‌తి వేదిక‌గా ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో మాట్లాడిన‌ ష‌ర్మిళ‌... తాను ఓ సామాన్యురాలిగా ఈ ప్ర‌శ్న‌లు అడుగుతున్నాన‌ని, ఈ ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు నుంచి గానీ, ఆయన పార్టీ నుంచి గానీ స‌మాధానాలు చెబుతారా? అంటూ ఏకంగా న‌డిరోడ్డుపై నిల‌దీసినంత ప‌నిచేశార‌ని చెప్పాలి. త‌న తండ్రి - దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి పాల‌న‌లో అమ‌లైన సంక్ష‌మాన్ని అంశాల వారీగా ప్ర‌శ్నిస్తూనే... క‌నీసం త‌న తండ్రి ప్రారంభించిన ప‌థ‌కాల‌నైనా అమ‌లు చేస్తున్నారా? అని స్ట్రైట్ గానే నిల‌దీశారు. చంద్రబాబు హయంలో రాష్ట్రంలో అభివృద్ధి 25ఏళ్లు వెనక్కి వెళ్లిందని ఆమె మండిప‌డ్డారు.

చంద్రబాబు పాలనలో ఎక్కడా అభివృద్ధి కనిపించడం లేదన్నారు. భూతద్దం పెట్టుకుని వెతికినా అభివృద్ధి జాడే కనిపించడం లేదని విమర్శించారు. అదే వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పాలనలో అన్నివర్గాల ప్రజలకు ఓ భరోసా ఉండేదన్నారు. వైఎస్సార్‌ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర ఉండేదని, అలాగే పేద విద్యార్థులు ఉచితంగానే పెద్ద చదువులు చదివేవారని ఆమె గుర్తు చేశారు. అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు...ఆ తర్వాత ఆ హామీలను గాలికి వదిలేశారన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు... రైతులను మోసం చేశారని విమర్శించారు.  మొదటి అయిదు సంతకాల పేరుతో డ్రామాలు ఆడిన చంద్రబాబు...తొలి సంతకానికి అయినా ప్రాధాన్యత ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. తాను వైఎస్సార్‌ కూతురుగానే కాకుండా సామాన్యురాలిగా మాట్లాడుతున్నాన‌ని చెప్పిన ష‌ర్మిళ‌.. చంద్ర‌బాబు వ్య‌వ‌స్థ‌ల‌ను మేనేజ్ చేసుకుంటూ పాల‌న సాగించార‌ని విమ‌ర్శించారు. మ‌హానేత వైఎస్సాఆర్ హ‌యాంలో కులాల‌కు, మ‌తాల‌కు, ప్రాంతాల‌కు ఆఖ‌రికి పార్టీల‌కు కూడా అతీతంగా ప్ర‌తి వ‌ర్గానికి మేలు జ‌రిగింద‌న్నారు.

ఇంకా ష‌ర్మిళ ఏమ‌న్నారంటే... *బాబు అధికారంలోకి రావ‌డానికి మొత్తం రుణ‌మాఫీ అని వాగ్దానం చేసి అదే మొద‌టి సంత‌కం అవుతుంద‌ని చెప్పి ఎన్నిక‌లు అయిపోయిన త‌ర్వాత రుణ‌మాఫీ ఫైల్‌ పై సంత‌కం పెట్ట‌కుండా రుణ‌మాఫీకి క‌మిటీ వేస్తున్నాన‌ని సంత‌కం పెట్టారు. చంద్ర‌బాబు డ్వాక్రా మ‌హిళ‌ల‌కు మొత్తం రుణం మాఫీ చేస్తామ‌న్నారు. ఆ శాఖ‌కు చెందిన మంత్రి ప‌రిటాల సునీత అసెంబ్లీలో స‌మాధాన‌మిస్తూ మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫీ చేయ‌లేదు. చేసే ఉద్దేశం కూడా లేదు అని ప్ర‌క‌టించింది వాస్త‌వం కాదా?. రూ.14వేల కోట్లు ఉన్న పోల‌వ‌రం ప్రాజెక్టు వ్య‌యాన్నిరూ.60వేల కోట్ల‌కు పెంచారు. నామినేష‌న్ ప‌ద్ధ‌తిలో బాబుకు కావాల్సిన వాళ్ల‌కు కాంట్రాక్టులు ఇచ్చారు. అందుకే కేంద్రం నుంచి పోల‌వ‌రాన్ని లాగేసుకున్న‌ది నిజం కాదా?. పోల‌వ‌రాన్ని 3 ఏళ్ల‌లో పూర్తి చేస్తామ‌ని మీరు చెప్ప‌లేదా చంద్ర‌బాబు?  నేటికి అది పూర్తి కాలేదంటే అది మీ అస‌మ‌ర్థ‌త కాదా? అమరావతి అంటూ గ్రాఫిక్స్ చూపారు కానీ ఒక్క శాశ్వత భవనం కట్టారా? చంద్రబాబు పేద విద్యార్థుల భవిష్యత్ ఖూనీ చేసింది నిజంకాదా? పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసింది నిజం కాదా?* అంటూ ప్ర‌శ్నాస్త్రాలు సంధించారు.

*లోకేష్‌కి ఏకంగా 3 శాఖలు అప్పగించారు, జయంతికి, వర్దంతికి తేడా తెలియనివాడికి మూడు శాఖలా?. డేటా దోషులని ఇప్పటికి పట్టుకోలేదు, సిగ్గుగా లేదా? బాబు - మోడీ జోదీ రాష్ట్రానికి అన్యాయం చేసింది వాస్తవం కాదా? ప్రత్యేక హోదా నీరుగార్చిన చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోరా? చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? ఒక సామాన్యురాలిగా అడుగుతున్నా. ఎక్కడ చూసినా అవినీతి. చంద్రబాబు 600 హామీలు ఇచ్చి ఒక్కటి నెరవేర్చలేదు. ఇప్పుడు ఎన్నికలు వస్తాయి అని మళ్ళీ కొత్త హామీలు ఇస్తున్నారు. చంద్రబాబు చందమామని తెచ్చిస్తా అంటే ప్రజలు నమ్మలా? నిప్పు నిప్పు అంటే తుప్పు నిప్పవుతుందా? అసత్యానికి మారు పేరు చంద్రబాబు. చంద్రబాబూ సూటిగా చెప్పండి...జగన్ అన్న ఊరురు తిరిగి హోదా కోసం పోరాడకపోతే నీ నోట హోదా మాట వచ్చేదా? చేతనైతే నిజం చెప్పు. చంద్రబాబు రోజుకొక మాట, పూటకో వేషం, ఊసరవెల్లి సిగ్గుతో తలదించుకోవాలి. 9 ఏళ్ళు జగనన్న విలువల రాజకీయము చేశాడు, చంద్రబాబులా అధికారం కోసం వాగ్దానాలు ఇవ్వలేదు, పదవుల కంటే విశ్వసనీయత ముఖ్యం అనుకున్నాడు. నాన్నలా అందరికి మేలు చేయాలనుకుంటున్నాడు. చంద్రబాబుకు వెన్నుపోటు, మోసం, అవినీతి, స్వార్ధ రాజకీయాలు, హత్యలు చేయడంలో అనుభవం ఉంది* అని ష‌ర్మిళ దుయ్య‌బ‌ట్టారు.

*5 ఏళ్లలో కొన్ని వందల మందిని పొట్టన బెట్టుకున్నారు, రిషితేశ్వరి, వనజాక్షి విషయంలో చంద్రబాబు ఏం చేశారు? చంద్రబాబు అరాచకవాది కాదా? చంద్రబాబుని మించిన దుష్టుడు ఉండరు అని ఎన్టీఆర్ అన్నారు. ప్రజలు ఆలోచించండి. బాబు పాలనలో రాష్ట్రం ఎక్కడికి పోతుంది? ఈ ఎన్నికలు రాష్ట్రానికి, ప్రజలకు ముఖ్యం. ఆలోచించి ఓటు వేయండి. చంద్రబాబు ఈ అయిదేళ్లు ఏళ్ళు గాడిదలు కాశారా?. పవన్ కళ్యాణ్ యాక్టర్ - యాక్టర్ డైరెక్టర్ చెప్పినట్టు చేయాలి, బాబు డైరెక్టర్ చెప్పినట్టు పవన్ చేస్తున్నాడు. పవన్ నామినేషన్‌ కి పచ్చ పార్టీ క్యాడర్ ఉంటుంది. పవన్‌కు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్టే. చంద్రబాబు మీ ఫ్యామిలీలో గొడవలు ఉంటే హత్యలు చేసుకుంటున్నారా? మేము బాధితులం. మాపై ఆరోపణలు చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హత్యలు జరిగాయి, చంద్రబాబుకు దమ్ముంటే థర్డ్ పార్టీ విచారణ కి సిద్ధపడాలి. అమ్మ విజయమ్మ కూడా ప్రచారం చేస్తారు, నేను 29 నుంచి మంగళగిరి నుంచి ప్రారంభిస్తా* అని వైఎస్‌ షర్మిళ‌ తెలిపారు.



Tags:    

Similar News