ష‌ర్మిల‌కు టైం క‌లిసి రాలేదా?

Update: 2021-04-11 12:30 GMT
ఏ ప‌నిచేయాల‌న్నా.. దానికి అనుకూలంగా స‌మ‌యం చూసుకోవ‌డం.. న‌లుగురు వ‌చ్చే అవ‌కాశం ఉందా ? లేదా? అని అంచ‌నా వేసుకోవ‌డం స‌హ‌జం. ఏ చిన్న కార్య‌క్ర‌మం జ‌రిగినా.. అన్ని ఈ క్వేష‌న్లు స‌రిపోయా యా? లేదా? అని ఒక‌టికి రెండు సార్లు స‌రిచూసుకుని స‌ద‌రు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌డం అనేది కామ‌న్‌. ఏ చిన్న తేడా వ‌స్తుంద‌ని తెలిసినా.. స‌ద‌రు కార్య‌క్ర‌మం విఫ‌ల‌మ‌వుతుంద‌ని గుర్తిస్తే.. చాలా వ‌ర‌కు జాగ్ర‌త్త‌లు తీసుకుంటాం. మ‌రి ఒక ఇంట్లో.. జ‌రిగే.. చిన్న పాటి కార్య‌క్ర‌మానికే ఇన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటే.. మ‌రి ఒక రాష్ట్రానికి సంబంధించిన పార్టీని ఏర్పాటు చేసేట‌ప్పుడు.. ఐదు కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు సంబంధించిన విష‌యంపై ఎంత జాగ్ర‌త్త‌గా ఉండాలి?

అందునా.. ఒక కొత్త పార్టీని ప్రారంభించేట‌ప్పుడు.. అడుగ‌డుగునా సెంటిమెంటు పులుముకున్న తెలంగాణ‌లో కొత్త పార్టీ విష‌యంలో నిర్వ‌హించే తొలి బహిరంగ స‌భ విష‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించాలి? మ‌రీ ముఖ్యంగా మ‌హానేతగా పేరున్న వైఎస్సార్ పేరుతో పార్టీ పెట్టే సంద‌ర్భంలో ఇంకెంత జాగ్ర‌త్త‌లు పాటించాలి? కానీ... ఇలాంటి జాగ్ర‌త్త‌లు పాటించ‌డంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న‌య‌.. వైఎస్ ష‌ర్మిల విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న రాజ‌కీయ విశ్లేష‌కుల నుంచి వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

ఖ‌మ్మం వేదిక‌గా సంక‌ల్ప యాత్ర నిర్వ‌హించిన ష‌ర్మిల‌.. ఆచి తూచి వ్య‌వ‌హ‌రించ‌కుండా.. తొంద‌ర ప‌డ్డార‌నే వ్యాఖ్య‌లువినిపిస్తున్నాయి. ఆదిలో ల‌క్ష‌మందితో సంక‌ల్ప స‌భ నిర్వ‌హిస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు ష‌ర్మిల‌. అయితే.. అప్ప‌టికే రాష్ట్రంలో క‌రోనా సెకండ్ వేవ్ ప్రారంభ‌మైంది. దేశంలో మ‌హారాష్ట్ర త‌ర్వాత‌.. హైద‌రాబాద్‌.. తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో వైర‌స్ వ్యాప్తి ఎక్కువ‌గా ఉంద‌నే వార్తలు వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలో ప్ర‌భుత్వం కూడా అలెర్ట‌యి.. అనేక నిబంధ‌న‌లు అమ‌లు చేయ‌డం ప్రారంభించింది.

ఈ స‌మ‌యంలో ల‌క్ష‌మందితో స‌భ అంటే.. సాధార‌ణంగానే ప్ర‌భుత్వం నుంచి అధికారుల నుంచి అనుమ‌తి రావ‌డం క‌ష్ట‌మే. ఈ క్ర‌మంలోనే ఖ‌మ్మం పోలీసులు అతిక‌ష్టం మీద కేవ‌లం ఆరు వేల మందికి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. అదేస‌మ‌యంలో సంక‌ల్ప యాత్ర‌కు హైద‌రాబాద్ నుంచి భారీ ఎత్తున కాన్వాయ్‌తో బ‌య‌లు దేరిన ష‌ర్మిల‌కు కూడా దారి పొడ‌వునా భారీ ఎత్తున స్వాగ‌త స‌త్కారాలు ల‌భిస్తాయ‌ని అనుకున్నా.. అది కూడా అనుకున్న విధంగా సాగ‌లేదు. చాలా త‌క్కువ మంది అది కూడా వైఎస్ అభిమానులు మాత్ర‌మే ఆమెకు స్వాగ‌తం ప‌లికారు.

ఇక‌, సంక‌ల్ప స‌భ‌కు వ‌చ్చే స‌రికి ఆరు వేల మందికి మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చారు. అయితే.. స‌భ‌కు ఒక ఓ పెద్దాయ‌న మాత్రం ల‌క్ష‌ల మంది వ‌చ్చార‌ని.. వారంద‌రినీ పోలీసులు అడ్డుకుంటున్నార‌ని.. డీజీపీ వెళ్లి బీజేపీకండువా క‌ప్పుకోవాల‌ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం మ‌రింత‌గా స‌భ‌ను దిగ‌జార్చింద‌నే చెప్పాలి. వాస్త‌వానికి ఖ‌మ్మం టౌన్‌లో ష‌ర్మిల సామాజిక వర్గం రెడ్లు పెద్ద‌గా లేరు. గ్రామాల్లో ఉన్న‌ప్ప‌టికీ.. వారు క‌రోనా భ‌యంతో గ్రామాలు వ‌దిలి రాలేదు. దీంతో ఆరు వేల మందికి మాత్ర‌మే స‌భ ప‌రిమిత‌మైంది.

క‌రోనా సెకండ్ వేవ్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో గుంపులోకి వ‌చ్చి క‌రోనా బారిన ప‌డ‌డం ఎందుకులే.. అనుకుని చాలా మంది రాలేద‌నే వార్త‌లు కూడా వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ష‌ర్మిల పెట్టుకున్న సంక‌ల్ప స‌భ తూతూ మంత్రంగానే ముగిసింద‌నేది వాస్త‌వం. అదే క‌రోనా వేవ్ త‌గ్గిన త‌ర్వాత హైద‌రాబాద్ వేదిక‌గా ఇదే ల‌క్ష మందితో స‌భ పెట్టుకుని ఉండి ఉంటే.. ప‌రిస్థితి వేరేగా ఉండేది. ప్ర‌జ‌లు కూడా మంచిగా స్పందించేవాళ్ల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

పైగా సెటిల‌ర్లు, విద్యావంతులు ఎక్కువ‌గా ఉన్న హైద‌రాబాద్‌ను వ‌దిలేసి.. ఖ‌మ్మంను ఎంచుకోవ‌డం కూడా స‌రికాద‌నే వాద‌న ఉంది. ఖ‌మ్మంలో రెండో స‌భ పెట్టుకుని ఉంటే బాగుండేద‌నే వాద‌న ఉంది. ఏదేమైనా.. ష‌ర్మిల అనుకున్న విధంగా సంకల్ప స‌భ మైలేజీ రాబ‌ట్ట‌లేక పోయింద‌ని అంటున్నారు. అందుకే.. ఆనుపాను చూసుకోవాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఇక‌నుంచి నిర్వ‌హించే స‌భ‌ల విష‌యంలో అయినా.. ష‌ర్మిల క‌నీసం ముందుచూపుతో వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌ని చెబుతున్నారు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.




Tags:    

Similar News