ట్రోల్ చేస్తే చెయ్య‌నీ.. వార్త‌ల్లో నిలిచాంగా

Update: 2022-09-20 02:30 GMT
నేను తెలంగాణ కోడ‌లిని.. ఇది నా గ‌డ్డ అంటూ వైఎస్సార్ తెలంగాణ పేరుతో పార్టీ పెట్టి ర‌ణ‌రంగంలోకి దిగింది వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌యురాలు వైఎస్ ష‌ర్మిళ‌. ముందు ఆమె రాజ‌కీయ పార్టీ గురించి ఊహాగానాలు వినిపిస్తే అది కేవ‌లం ఊహాగానమే అనుకున్నారు.

కానీ అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య ఆమె నిజంగానే పార్టీ పెట్టింది. అది కూడా తెలంగాణ రాజ‌కీయ ర‌ణ‌రంగంలో అడుగు పెట్టి కొత్త కొత్త వాద‌న‌లు తెర‌పైకి తెచ్చింది. ఐతే ఆరంభంలో ఈ పార్టీ ప‌ట్ల జ‌నం కాస్త ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించారు కానీ.. ఆ త‌ర్వాత ఇటు జ‌నం, అటు మీడియా ఆమెను ప‌ట్టించుకోవ‌డం మానేశారు. తెలంగాణ ప్ర‌భుత్వం మీద ఎంత తీవ్ర విమ‌ర్శలు చేసినా, పాదయాత్ర పేరుతో ఎంత హడావుడి చేసినా మైలేజీ రాలేదు. ఈ మ‌ధ్య ష‌ర్మిళ ఊసే వినిపించ‌ట్లేదు ఎక్క‌డా.

ఇలా అయితే క‌ష్టం అనుకుందో ఏమో.. ష‌ర్మిళ కొత్త వ్యూహంతో సిద్ధ‌మైన‌ట్లు క‌నిపిస్తోంది. మొన్న ఒక ప్రెస్ మీట్లో నేర‌స్థుల‌కు పోలీసులు వేసే సంకెళ్లు తీసుకొచ్చి న‌న్ను అరెస్ట్ చేసుకోండి, మా నాన్న‌ను కుట్ర చేసి చంపారు.. అలాగే న‌న్ను కూడా చంపాల‌నుకున్నా నేను బెద‌ర‌ను, పులిబిడ్డ‌ను అంటూ స‌వాలు విసిరింది ష‌ర్మిళ‌.

ఐతే  తెలంగాణ రాజ‌కీయాల్లో ఏమాత్రం ప్ర‌భావం చూపేలా క‌నిపించ‌ని ష‌ర్మిళ మీదికి పోలీసుల‌ను ప్ర‌యోగించే ఆలోచ‌న‌లో తెలంగాణ ప్ర‌భుత్వం ఉంద‌నుకుంటే పొరబాటే. ప్రెస్ మీట్లో ష‌ర్మిళ మాట‌లు, చేత‌లు అన్నీ కూడా కృత్రిమంగా, కృత‌కంగా.. నాట‌కీయంగా అనిపించాయి జ‌నాల‌కు.

ఆ వీడియో మీద‌ నిన్న‌ట్నుంచి సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ట్రోలింగ్ జ‌రుగుతోంది. ష‌ర్మిళ మీద దారుణ‌మైన కామెంట్లు ప‌డుతున్నాయి. ఐతే ట్రోలింగ్ జ‌రిగితే జ‌రిగింది.. మీడియాలో, సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాం.. అని సంతృప్తి ప‌డే స్థితిలోనే ష‌ర్మిళ ఉన్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇలా నెగెటివ్‌గా అయినా స‌రే.. వార్త‌ల్లో నిల‌వాల‌ని ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆమె ఇలా చేసిందేమో అనిపిస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News