వివేకా హత్య కేసులో నిందితుడు దేవిరెడ్డి బెయిల్‌... ఏడ్చేసిన సునీత‌!

Update: 2022-05-25 11:55 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌.. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడుగా ఉన్న‌ దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి కడప కోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది. కడప జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి ఒకరోజు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది. రేపు (గురువారం) ఉదయం10 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు బెయిల్‌కు అనుమతి ఇచ్చింది. దీంతో వివేకా కుమార్తె.. వైఎస్ సునీత ఒక్క‌సారిగా భావోద్వేగానికి గుర‌య్యారు. క‌న్నీరు పెట్టుకున్నారు.

నిందితులుకు బెయిల్ ఇస్తే.. సాక్ష్యాలను తారుమారు చేస్తార‌ని త‌మ‌కు అనుమానంగా ఉంద‌న్నారు. అయిన‌ప్ప‌టికీ..కోర్టులు త‌మ మాట‌ను వినిపించుకోవ‌డం లేద‌ని.. వాపోయారు. బెయిల్ పిటిష‌న్‌పై విచార‌ణ నిమిత్తం క‌డ‌ప కు వ‌చ్చిన ఆమె.. శివ‌శంక‌ర‌రెడ్డికి.. బెయిల్ ఇస్తున్న‌ట్టు కోర్టు తీర్పు ఇవ్వ‌గానే.. కోర్టు ప్రాంగ‌ణంలోనే సునీత క‌న్నీరు పెట్టుకున్నారు. త‌న తండ్రి హ‌త్య‌కు  గురై... 4 సంవ‌త్స‌రాలు పూర్త‌యినా.. ఇప్ప‌టి వ‌ర‌కు త‌మ‌కు, త‌మ కుటుంబానికి న్యాయం జ‌ర‌గ‌లేద‌ని.. బోరుమ‌న్నారు.

ఒక్క రోజు బెయిల్ ఎందుకంటే..

వైఎస్ వివేకా హ‌త్య కేసులో తీవ్ర ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న దేవిరెడ్డి శివ‌శంక‌ర‌రెడ్డికి క‌డ‌ప కోర్టు ఒక్క‌రోజు మాత్ర‌మే బెయిల్ మంజూరు చేసింది. అది కూడా ఉద‌యం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే ఇచ్చింది. ఇక్క‌డ కూడా కొన్ని ష‌ర‌తులు విధించింది. శివ‌శంక‌ర‌రెడ్డి త‌న కుటుంబ స‌భ్యుల‌తో త‌ప్ప‌.. ఎవ‌రితోనూ మాట్లాడ‌కూడ‌ద‌ని.. పోన్‌ను వినియోగించ‌రాద‌ని.. అవ‌స‌ర‌మైతే.. పోలీసుల స‌మ‌క్షంలోనే ఆయ‌న ఫోన్‌మాట్లాడాల‌ని.. కేసుకు సంబంధించిన విష‌యాల‌పై ఎవ‌రితోనూ చ‌ర్చించ‌రాద‌ని.. పేర్కొంది.

ఇక‌, ఈ ఒక రోజు బెయిల్ ఎందుకు ఇస్తున్న‌ట్టో.. కోర్టు స్ప‌ష్టం చేసింది. కడపలో శివశంకర్ రెడ్డి కుమారుడు.. డాక్ట‌ర్‌. ఈ నేప‌థ్యంలో ఆయ‌న క‌డ‌ప న‌గ‌రంలో కొత్త‌గా ఆసుప‌త్రిని నిర్మించుకున్నారు. ఈ ఆ సుప‌త్రిని గురువారం ప్రారంభించ‌నున్నారు. అది కూడా ప్ర‌స్తుతం వైఎస్ వివేకా కేసులో జైల్లో ఉన్న త‌న తండ్రి చేతుల మీదుగానే ప్రారంభించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే శివశంకర్ రెడ్డి కి కోర్టు ఒక్క‌రోజు బెయిల్ మంజూరు చేసింది.  ఈ కార్య‌క్ర‌మం ముగించుకుని సాయంత్రం 4 గంట‌ల‌కు పోలీసుల‌కు లొంగిపోవాల‌ని.. కోర్టు ఆదేశించింది.
Tags:    

Similar News