జగన్‌ ప్రభుత్వ నిర్ణయంపైన వైసీపీలోనే అసంతృప్తి.. నిజమేనా!

Update: 2022-12-30 06:14 GMT
ఆంధ్రప్రదేశ్‌ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదికిపైగా సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్‌ 175కి 175 సీట్లు సాధించాలని పెద్ద లక్ష్యమే పెట్టుకున్నారు. ఈ దిశగా పెద్ద ఎత్తున కార్యాచరణ ప్రణాళిక కూడా అమలు చేస్తున్నారు.

అయితే.. ఎన్నికల ముందు ప్రజలకు, ప్రభుత్వ ఉద్యోగులకు మరింత చేరువయ్యే నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం వారిని ఇబ్బందిపెట్టే నిర్ణయాలు తీసుకుంటోందని వైసీపీలోనే కొంత అసంతృప్తి వ్యక్తం అవుతుందని గాసిప్‌ వినిపిస్తున్నాయి.

తాజాగా జగన్‌ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు ఫేషియల్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ (ముఖ ఆధారిత హాజరు) ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర సచివాలయం స్థాయి వరకు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి బయోమెట్రిక్‌ ద్వారానే హాజరు వేయడాన్ని తప్పనిసరి చేసింది. మొదట ఈ విధానాన్ని కొన్ని ప్రభుత్వ విభాగాల్లోనే ప్రవేశపెట్టగా వచ్చే జనవరి నుంచి అన్ని విభాగాల్లోనూ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

ఈ నేపథ్యంలో ఉదయం పది గంటలకు ఉద్యోగులంతా తమ విధులకు హాజరుకావాలి. పది నిమిషాలపాటు గ్రేస్‌ పీరియడ్‌ ఉంటుంది. అంటే.. ఉదయం 10.10 గంటల వరకు ఉద్యోగులు బయోమెట్రిక్‌ హాజరు వేయొచ్చు. ఆ తర్వాత అంటే 10.10 గంటలు దాటితే మాత్రం ఉద్యోగుల జీతాల్లో కోత పడనుంది. ఆలస్యం అయిన మేర ఉద్యోగుల జీతాలను తగ్గించనుంది.

ఇప్పటికే ఉద్యోగ సంఘాలు జగన్‌ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. ప్రతి నెలా జీతాలు ఆలస్యంగా చెల్లిస్తున్నాయని బహిరంగంగానే విమర్శలు చేస్తున్నాయి. డిసెంబర్‌ నెలలో సైతం కొన్ని విభాగాలు ఉద్యోగులకు రెండు వారాలు గడిచాక కానీ జీతాలు పడలేదు.

ఈ నేపథ్యంలో ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం చేతకావడం లేదు కానీ.. కొద్ది నిమిషాల ఆలస్యమైందని జీతాలు కత్తిరించే అధికారం ప్రభుత్వానికి ఎక్కడ ఉంటుందని ఉద్యోగ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
వైసీపీలోనే కొంతమంది ప్రభుత్వ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు టాక్‌ నడుస్తోంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదని.. ఇలాంటి సమయంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులకు చేరువ కావడానికి నిర్ణయాలు తీసుకోవాల్సిన ప్రభుత్వం.. ఉద్యోగుల ఆగ్రహాన్ని మరింత పెంచేలా వ్యవహరించడం సరికాదని అంటున్నారు. ఇది ఎన్నికల్లో తమకు నష్టం చేకూర్చే ప్రమాదం ఉందని వైసీపీ నేతలు లోలోన మథనపడుతున్నట్టు గాసిప్స్‌ వినిపిస్తున్నాయి.    



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News