సెప్టెంబ‌ర్ 2.. ఏం జ‌ర‌గ‌బోతుంది?

Update: 2021-08-31 16:14 GMT
ఎవ‌రికి వారు సొంత పార్టీలు పెట్టుకుని ఎడ‌ముఖం పెడముఖంగా ఉన్న అన్నాచెల్లెలు క‌లుస్తారా? ఒక‌ప్ప‌టి మ‌హానేత మంత్రివ‌ర్గంలో ఉన్న స‌భ్యులు త‌మ‌కు అందిన ఆహ్వానాల‌ను మ‌న్నించి స‌మావేశానికి హాజ‌ర‌వుతారా? తెలుగు రాజ‌కీయాల్లో ఎంతో ఆస‌క్తి రేపుతోన్న ఈ రెండు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తేలియాలంటే మ‌రో రెండు రోజులు ఆగాల్సిందే. సెప్టెంబ‌ర్ 2 నాడు అస‌లు ఏ జ‌ర‌గ‌బోతుంద‌నే ఉత్కంఠ తెలుగు రాష్ట్రాల్లోని రాజ‌కీయ వ‌ర్గాల్లో నెల‌కొంది. రాజ‌కీయ నాయ‌కుల‌తో పాటు సామాన్యులు కూడా ఈ తేదీ కోసం ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

సెప్టెంబ‌ర్ 2న దివంగ‌త‌ ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి 12వ వ‌ర్థంతి. ఆ రోజు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల ఇడుపుల‌పాయ‌లోని త‌మ తండ్రి స‌మాధి వ‌ద్ద నివాళులు అర్పించనున్నారు. అయితే వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు పెట్టిన ఈ అన్నాచెల్లెలి మధ్య ఇప్ప‌టికే దూరం ఉంద‌న్న విష‌యం తెలిసిందే. తెలంగాణ‌లో పార్టీని ఏర్పాటు చేయ‌డం జ‌గ‌న్‌కు ఇష్టం లేక‌పోయిన‌ప్ప‌టికీ అన్న మాట‌ను విన‌ని ష‌ర్మిల ఇక్క‌డ సొంత పార్టీ పెట్టారు. దీంతో వాళ్ల మ‌ధ్య దూరం మ‌రింత పెరిగింద‌నే అభిప్రాయాలు ఉన్నాయి. వైఎస్ జ‌యంతి రోజున జ‌గ‌న్‌, ష‌ర్మిల ఎవ‌రికి వారే ఇడుపుల పాయ‌కు వెళ్లి తండ్రికి నివాళులు అర్పించారు. క‌నీసం ఒక‌రికొక‌రు ఎదురు ప‌డ‌లేదు. ఈ సంఘ‌ట‌న ద్వారా ఈ అన్న‌చెల్లెలి మ‌ధ్య ఉన్న విభేధాలు స్ప‌ష్ట‌మ‌య్యాయని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు.

ఇక రాఖీ రోజున అయినా వీళ్లిద్ద‌రూ క‌లుస్తారా? అనే అనుమానాలు క‌లిగాయి. కానీ ఆ రోజు కూడా ష‌ర్మిల త‌న అన్న ద‌గ్గర‌కు వెళ్ల‌లేదు. ఓ ట్వీట్ చేసి స‌రిపెట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు వైఎస్‌ వ‌ర్థంతి సంద‌ర్భంగానైనా ఈ అన్నాచెల్లెలు క‌లిసి త‌మ తండ్రికి నివాళులు అర్పిస్తారా? అంటే అలా జ‌ర‌గ‌ద‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ఆ రోజు కూడా వీళ్లిద్ద‌రూ వేర్వేరు స‌మ‌యాల్లో ఇడుపుల పాయ‌కు వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. జ‌గ‌న్ ఉద‌య‌మే అక్క‌డికి చేరుకుంటార‌ని తెలుస్తోంది. తండ్రికి నివాళులు అర్పించిన త‌ర్వాత ఆయ‌న ఉద‌యం 11 గంట‌ల‌కు తిరిగి తాడేప‌ల్లి గూడెం బ‌య‌ల్లేర‌తార‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెప్తున్నాయి. ఆ త‌ర్వాత ఇడుపుల పాయ‌కు విజ‌య‌మ్మ‌తో క‌లిసి ష‌ర్మిల వెళ్ల‌నున్న‌ట్లు స‌మాచారం. ఆ త‌ర్వాత వీళ్లు హైద‌రాబాద్ బ‌య‌ల్లేర‌నున్నారు.

మ‌రోవైపు అదే రోజున హైద‌రాబాద్‌లో నిర్వ‌హించే వైఎస్ సంస్మ‌రణ స‌భ‌కు రావాల‌ని ఆయ‌న స‌తీమ‌ణి విజ‌య‌మ్మ.. అప్ప‌టి వైఎస్ మంత్రివ‌ర్గంలోని స‌భ్యుల‌ను ఆహ్వానాలు పంపించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ ఆహ్వానాలు అందుకున్న నాయ‌కులు ఈ స‌భ‌కు వ‌స్తారా? లేదా? అన్న ఉత్కంఠ రేపుతోంది. ఎందుకంటే అప్ప‌టి వైఎస్ మంత్రివ‌ర్గంలో మంత్రులుగా ప‌నిచేసిన నాయ‌కుల్లో కొంత‌మంది వేరే పార్టీల్లో ఉన్నారు మ‌రికొంత‌మంది రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. ఈ నేప‌థ్యంలో ఈ సంస్మ‌ర‌ణ స‌భ‌కు వెళ్లి వాళ్లు ఎలా వ్య‌వ‌హ‌రిస్తార‌నేది చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీంతో ఆహ్వానాలు అందుకున్న చాలా మంది నాయ‌కులు ఈ స‌భ‌కు వెళ్ల‌కుండా ఉండేందుకు కార‌ణాలు వెతుకుతున్న‌ట్లు తెలుస్తోంది. మొత్తానికి సెప్టెంబ‌ర్ 2వ తేదీ రాజ‌కీయ ప‌రిణామాల‌కు వేదిక‌గా నిల‌వ‌బోతుంద‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.




Tags:    

Similar News