ఈ ఫోటో చాలు వైఎస్ ఫ్యాన్ గుండె మండటానికి

Update: 2016-07-31 09:57 GMT
కొన్ని తప్పులకు చెల్లించాల్సిన మూల్యం భారీగా ఉంటుంది. అందుకే అలాంటి తప్పుల్ని ఏ అధికారపక్షమైనా వీలైనన్ని తక్కువగా చేయాల్సి ఉంటుంది. కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ విషయాన్ని మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది. ఊహించని రీతిలో మరణించిన వైఎస్ మీద పార్టీలకు అతీతమైన అభిమానం తెలుగు నేల మీద చాలామందికే ఉంది. ఆయన అవినీతి ఆరోపణలు పై ఆగ్రహం వ్యక్తం చేసే వారు సైతం.. ఆయన తీసుకున్న కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు.. వ్యక్తిగతంగా తనను నమ్ముకున్న వారి విషయంలో ఆయన వ్యవహరించిన విధానం.. సంక్షేమ పథకాల్ని అమలు (ఇవన్నీ ఓటుబ్యాంకు రాజకీయంలో భాగమైనప్పటికీ) చేసిన విధానాన్ని.. ఆయన ప్రభుత్వం హయాంలో షురూ చేసిన 108.. ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు వైఎస్ కు అంతులేని అభిమానాన్ని తెచ్చి పెట్టాయి. కేవలం ఆరేళ్ల పాటు ముఖ్యమంత్రిగా వ్యవహరించి.. తన పాలనతో దారుణమైన అవినీతి పెంచి పోషించినట్లుగా తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తినా రెండో దఫా అధికారంలోకి రావటం ఒక ఎత్తు అయితే..రాజకీయంగా పీక్ లో ఉన్న సమయంలో అనూహ్యంగా చోటు చేసుకున్న మరణం.. ఏపీ రాజకీయాల్ని ఎంతలా మార్చిందో అందరికి తెలిసిందే.

అలాంటి నేతకు చెందిన విగ్రహాల్ని విభజనకు ముందు రెండు ప్రాంతాల్లో విపరీతంగా ఏర్పాటు చేశారు. వైఎస్ మీద అభిమానం కంటే.. ఆయన మరణించిన తీరు చాలామందిని కలిచివేసింది. రాజకీయంగా ఆయన్ను వ్యతిరేకించే వారు సైతం ఆయన మరణానికి విలపించిన పరిస్థితి. తెలుగు రాజకీయాల్లో ఇలాంటి విచిత్రమైన పరిస్థితి గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదనే చెప్పాలి. అలాంటి ఇమేజ్ ఉన్న వైఎస్ కు విజయవాడ లాంటి నగరంలో భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు ఐదేళ్లుగా ఉన్న ఈ విగ్రహాన్ని తొలగించిన వైనం చాలామందిని హర్ట్ చేస్తున్న పరిస్థితి. అన్నింటికి మించి.. ఈ విగ్రహాన్ని తొలగించే క్రమానికి సంబంధించిన బయటకు వచ్చిన ఒక ఫోటో.. అందరి దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తోంది.

అయ్యో మరీ.. అంత అన్యాయంగా ఆ పెద్దమనిషి విగ్రహాన్ని తొలగిస్తారా? అన్న మాట సామాన్యుల నోటి నుంచి వచ్చేలా చేయటంలో జగన్ మీడియా సక్సెస్ అయ్యింది. నిజానికి పన్నెండు అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని బయటకు తీయాలంటే అంతకు మించిన మరో మార్గం ఉండదు. కానీ.. తీసిన విధానంలో తీసుకోని జాగ్రత్తలతో ఈ వ్యవహారం ఏపీ అధికారపక్షంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసేలా వ్యవహారం ఉంది. జగన్ మీడియా నుంచి వస్తున్న ఒక ఫోటోను చూసిన ప్రతి ఒక్క వైఎస్ అభిమాని గుండె మండేలా చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇలాంటి ఫోటోలు బాబు సర్కారును దీర్ఘకాలంలో నష్టపరుస్తాయన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News