కోట్లు కోల్పోతున్న వైసీపీ అభిమానులు

Update: 2015-08-17 12:59 GMT
పార్టీల మీద అభిమానం ఉండవచ్చు. పార్టీలు, నాయకుల మీద వ్యతిరేకత కూడా ఉండవచ్చు. కానీ, అది సొంతంగా కోట్ల రూపాయలు నష్టపోయేదిగా ఉండకూడదు. కానీ, నవ్యాంధ్ర రాజధాని ప్రాంతమైన అమరావతిలోని 29 గ్రామాల్లో కొన్ని గ్రామాల్లోని రైతుల పరిస్థితి ఇలాగే ఉంది. కోట్లు కోల్పోవడానికి సిద్ధపడుతున్నారు. కానీ వాళ్లు తమ భూములను ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధపడడం లేదు.

రాజధాని నిర్మాణానికి ప్రభుత్వం భూ సమీకరణకు సిద్ధమైన విషయం తెలిసిందే. 29 గ్రామాల్లో దాదాపు 95 శాతం భూములు ఇచ్చేశారు. ఇంకా ఐదు శాతం భూములు ఇవ్వాల్సి ఉంది. దాదాపు అన్ని అవకాశాలూ ఇచ్చిన తర్వాత ఇక భూ సేకరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేయనుంది.

భూ సమీకరణకు ఇక్కడి రైతులు తమ భూములను ఇస్తే .. అవన్నీ జరీబు భూములు కనక రాజధానిలో వారికి 1400 గజాల స్థలాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ప్రస్తుతం ఇక్కడ గజం భూమి విలువ పది వేల నుంచి పాతిక వేల వరకు ఉంది. రాజధాని అభివృద్ధి చెందిన తర్వాత ఇక్కడ ఎలా లేదన్నా లక్ష రూపాయలు ఉంటుంది. అంత ఉండదు.. కనీసం రూ.50 వేలు ఉంటుందని అనుకున్నా.. ఎకరం భూమి ఇచ్చిన రైతుకు దాదాపు ఏడు కోట్ల రూపాయల విలువైన భూమి దక్కుతుంది. ఇప్పుడు అక్కడ ఎంత లేదన్నా ఎకరా విలువ రెండు మూడు కోట్లకు మించి లేదు. వారికి భూ సమీకరణ ద్వారా ఏడు కోట్లు వస్తున్నాయన్నమాట.

కానీ, ఇప్పుడు భూ సేకరణను చేపడితే కొత్త భూ సేకరణ చట్టం ప్రకారం వారికి మార్కెట్ విలువ కంటే నాలుగు రెట్లు అధికంగా పరిహారం దక్కుతుంది. అంటే ఇప్పుడు అక్కడ మార్కెట్ విలువ రూ.30 లక్షలు ఉంది. దాని ప్రకారం వారికి కోటిన్నర మాత్రమే దక్కుతుంది. అంటే ఇప్పుడు వారి భూమి విలువ కూడా భూ సేకరణ ద్వారా రాదు. అయినా, కొంతమంది వైసీపీ అభిమానులైన రైతులు భూ సమీకరణ కింద భూములు ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. అదీ విశేషం.
Tags:    

Similar News