వైసీపీ బంద్... విజ‌య‌వంత‌మే

Update: 2015-08-30 07:43 GMT
ఏపీకి ప్రత్యేక హోదాకోసం వైసీపీ తలపెట్టిన బంద్ విజయవంతమైంది. అన్నివర్గాలు పెద్ద ఎత్తున‌ స్వచ్ఛదంగా బంద్‌ లో పాల్గొన‌టంతో బంద్ తాలుకు ప్ర‌భావం ఏపీ అంత‌టా స్ప‌ష్టంగా క‌నిపించింది. దీంతోపాటు ఆంధ్రుల్లో ప్ర‌త్యేక సాధ‌న కాంక్ష‌కూడ ప్ర‌క‌టిత‌మైంది.  వామపక్షాలు కూడా మద్దతివ్వడంతో రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రభావం కనిపించింది. ఉదయం నుంచే వైసీపీ కార్యకర్తలు రోడ్ల పైకి వచ్చి ప్రజా రవాణాను స్ధంభింప చేశారు. బంద్‌ తో అన్ని జిల్లాల్లోనూ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగిన వైసీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలుచోట్ల ఆందోళనల్లో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. అన్ని జిల్లాల్లో వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, ప్రభుత్వా కార్యాలయాలు మూతపడ్డాయి. దీంతో రోడ్లన్నీ జనాలు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. మరోవైపు ఆందోళనకారులను అరెస్ట్ చేయడం పలుచోట్ల ఉద్రిక్తతకు దారితీసింది.

కడప జిల్లాలో బంద్ చేపట్టిన వైపీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ధర్నాకు దిగిన వైఎస్ వివేకానందతో పాటు.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అరెస్ట్ చేశారు. వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులు స్వచ్ఛందంగా మూసివేసి బంద్‌కు సహకరించారు. నెల్లూరు, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనూ ఆందోళనకు దిగిన వైసీపీ శ్రేణులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు, నేతలు బస్సు డిపోల ఎదుట బైఠాయించారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురంలో బంద్‌లో పాల్గొన్న వైసీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

విశాఖ జగదాంబ జంక్షన్ వైసీపీ నిరసన ఉద్రిక్తంగా మారింది. రాస్తారోకో నిర్వహించేందుకు యత్నించిన ఆ పార్టీ నేత విజయసాయిరెడ్డి తోపాటు పలువురు ముఖ్యనేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో తీవ్ర పెనుగులాట చోటుచేసుకుంది. తూర్పుగోదావరి జిల్లాల్లోనూ అరెస్టుల‌ పర్వం కొనసాగింది. కాకినాడలో వామపక్షాలతో కలిసి వైసీపీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు.  చిత్తూరుజిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. తిరుపతిలో ఆందోళనకు దిగిన వైసీపీ నేతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, నారాయణస్వామి, భూమన కరుణాకర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

రాజమండ్రిలో మాత్రం వైసీపీ నిరసనలు ఉద్రిక్తతకు దారితీశాయి. తోపులాటలో ఓ పోలీస్, వైసీపీ కార్యకర్త గాయపడ్డారు. పోలీసులు తమపై అక్రమ కేసులు పెడుతున్నాని వైసీపీ నేతలు మండిపడ్డారు. హిందూపురంలో ఇద్దరు నాయకులు సెల్ టవర్ ఎక్కి హల్ చ‌ల్ చేశారు. కదిరి డిపో బస్సుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. తాడిపత్రిలో బంద్ పాటించలేదని నిరసనకారులు ఓ హోటల్‌ను ధ్వంసం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని గుంటూరులో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు సెల్ టవరెక్కారు. ప్రత్యేకహోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను కేంద్రం మోసం చేస్తోందంటూ వారు నిరసన తెలిపారు. స్దానికుల విజ్ఞప్తితో వారు టవర్ దిగడంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు.

పద‌నిస‌లు...

నగరిలో ఎమ్మెల్యే, సినీన‌టి రోజా బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. విశాఖ జిల్లాలో నిరసనలు కాస్త వెరైటీగా సాగాయి. విశాఖలో బంద్ పాటించమంటూ రోడ్లపైకి వచ్చిన మహిళలు... పోలీసులను ఆత్మీయంగా పలకరించారు. పోలీసులకు రాఖీలు కట్టి బంద్‌ కు సహకరించమని కోరారు. అయితే... రాఖీలు కట్టించుకున్న ఖాకీలు ఆ వెంటనే వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేష‌న్‌ కు తరలించారు. అరకులో వామపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వ తీరను నిరసిస్తూ శిరోమండనం చేయించుకున్నారు. అరెస్ట్ చేసిన పోలీసులే భోజనాలు పెట్టించాలని వైసీపీ నేతలు విశాఖలోని త్రీటౌన్ పోలీస్‌ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. మరోవైపు... అనంతపురం జిల్లా మడకశిరలోని ఆర్టీసీ ఉద్యోగులు ఈ బంద్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. బంద్ కారణంగా బస్సులు నిలిచిపోవడంతో.. కార్మికులంతా యోగా సాధన చేశారు. అనుకోకుండా దొరికిన ఖాళీ సమయాన్ని ఇలా తమ ఆరోగ్యం కోసం వెచ్చించారు.
Tags:    

Similar News