ప్ర‌త్యేక హోదాపై వైకాపా బంద్ హిట్‌

Update: 2016-09-10 16:23 GMT
ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా కోసం కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరుకు నిర‌స‌న‌గా వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్ పిలుపు మేర‌కు ఆ పార్టీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన బంద్ శ‌నివారం రాష్ట్ర‌వ్యాప్తంగా స‌క్సెస్ అయ్యింది. ప్ర‌త్యేక హోదా సాధ‌నే ధ్యేయంగా వైకాపా నాయ‌కులు గ‌ళ‌మెత్తారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల దిష్టిబొమ్మలను దహనం చేసి తమ నిరసనను తెలియజేశారు. ఈ బంద్ కు కాంగ్రెస్ - వామపక్షాలు- ప్రజా సంఘాలు - విద్యార్థి సంఘాలు సంపూర్ణ మద్దతు తెలపడంతో పాటు బంద్ లో పాల్గొన్నాయి.

 క‌డ‌ప జిల్లాలో జ‌రిగిన బంద్‌ లో మేయ‌ర్ సురేష్‌ బాబు - రాజంపేటలో పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి  నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పార్టీ నేతలు - కార్యకర్తలు బంద్ లో పాల్గొన్నారు. జ‌ర్న‌లిస్టు సంఘాలు సైతం బంద్‌ కు మ‌ద్ద‌తు నిచ్చాయి. ఇక ఉత్త‌రాంధ్ర‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఆ పార్టీ నేత‌లు ధర్మాన ప్రసాద రావు - తమ్మినేని సీతారాం - శాంతి రెడ్డి లను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. విజయనగరం జిల్లాలో బ‌స్సులు రోడ్డెక్క‌లేదు.

 ఇక విశాఖ‌లో అమ‌ర్నాథ్‌ - ఆ పార్టీ నేత గొల్ల బాబురావు ఆధ్వర్యంలో బంద్ చేపట్టారు. తూర్పుగోదావ‌రి జిల్లాలో సైతం వైకాపా నాయ‌కుల‌ను ముందుగానే అరెస్టు చేశారు. కాకినాడలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి - కోరుకుండలో జక్కంపూడి విజయలక్ష్మీ ఆధ్వర్యంలో బంద్ జ‌రిగింది. ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో ఏలూరులో పార్టీ జిల్లా అధ్యకుడు ఆళ్ల నాని - తణుకు లో కారుమూరి నాగేశ్వరరావు - నర్సాపురంలో ముదునూరు ప్రసాదరాజు - కొవ్వూరులో తానేటి వనిత - జీలుగుమిల్లిలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు నేతృత్వంలో బంద్ నిర్వహిస్తున్నారు. జిల్లాలో అర్థరాత్రి నుంచే అరెస్టుల పర్వం కొనసాగుతోంది.

 ఇక ఏపీ రాజ‌ధాని కేంద్రం కృష్ణా జిల్లాలో విజ‌య‌వాడ‌లో వైకాపా నగర అధ్యక్షుడు వంగవీటి రాధాను పోలీసులు అడ్డుకున్నారు. విజయవాడలో రాస్తారోకో నిర్వహిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు న‌గ‌రంలో మేరుగ నాగార్జున - లేళ్ల అప్పిరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్ర‌కాశం జిల్లాలో ఒంగోలు ఎంపీ వై.వి సుబ్బారెడ్డిని హౌస్ అరెస్ట్ చేయడంతో.. కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఇక పార్టీ జిల్లా అధ్య‌క్షుడు - మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డిని సంత‌మాగ‌లూరులో పోలీసులు అరెస్టు చేసి కురిచేడు పోలీస్‌ స్టేష‌న్‌ కు త‌ర‌లించారు.

  నెల్లూరులోను బంద్ స‌క్సెస్ అయ్యింది. చిత్తూరు జిల్లాలో పార్టీ నేత భూమ‌న క‌రుణాక‌ర్‌ రెడ్డితో పాటు ఇత‌ర నేత‌ల‌ను హౌస్ అరెస్టు చేశారు. అనంతపురంలో గుర్నాథ్ నేతృత్వంలో - గుంతకల్లులో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి - రాయదుర్గంలో కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నేతలు బంద్ ను నిర్వహిస్తున్నారు. క‌ర్నూలులో ఎంపీ బుట్టా రేణుక నేతృత్వంలో బంద్ చేపట్టారు. వైకాపా ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన ఈ బంద్‌ కు కాంగ్రెస్ - వామపక్ష పార్టీల‌తో పాటు విద్యార్థులు సైతం మ‌ద్ద‌తు ఇచ్చి రోడ్ల‌మీద‌కు వ‌చ్చారు.

Tags:    

Similar News