వైసీపీలో ఎమ్మెల్యేకు షాక్..ఉంటే ఉండు లేదంటే లేదు!

Update: 2020-03-19 04:25 GMT
ముందు వ‌చ్చిన చెవులు క‌న్నా వెనుక వ‌చ్చిన కొమ్ములే వాడి.. అన్న‌ట్టుగా త‌యార‌వుతోంద‌ట వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప‌రిస్థితి. ఇటీవ‌ల వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిక‌లు జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. స్థానిక ఎన్నిక‌ల నేప‌థ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తెలుగుదేశం నుంచి వ‌ల‌స‌లు జోరుగా సాగాయి, సాగుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌లు పూర్తై ఏడాది అవుతున్న త‌రుణంలో ఈ చేరిక‌ల‌కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ప్రోత్స‌హిస్తూ ఉంది. తెలుగుదేశం పార్టీ ఖాళీ అవుతుంద‌నే లెక్క‌ల‌తో ఆ పార్టీ నుంచి వ‌చ్చిన మాజీల‌కు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ కండువాలు వేస్తూ ఉన్నట్టుంది.

ఈ వాతావ‌ర‌ణంలో కొంద‌రు గెలిచిన అభ్య‌ర్థుల‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌డం లేద‌ని వినికిడి. ఇదే అనుభ‌వం ఎదురైంద‌ట ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేకు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న చేతిలో ఓడిపోయిన ఒక నేత‌ను క‌మ్ మాజీ ఎమ్మెల్యేను త‌న పార్టీ అధిష్టానం చేర్చుకుంటూ ఉండ‌టంతో స‌ద‌రు ఎమ్మెల్యే అభ్యంత‌రం వ్య‌క్తం చేశార‌ట‌. గ‌తంలో తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున ఆ నియోజ‌క‌వ‌ర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గాన్ని బాగా వేధించి - నిస్తేజ‌ప‌రిచాడ‌ట ఆ నేత‌. అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబ‌ట్టి ఆయ‌న అక్క‌డున్నారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబ‌ట్టి ఇటు చేరారు. ఈ విష‌యాల‌నే ప్ర‌స్తావిస్తూ స‌ద‌రు నేత అధిష్టానం వ‌ద్ద త‌న కంప్లైంట్ ఇచ్చార‌ట‌.

అయితే ఈ విష‌యంలో ఆయ‌న‌కు షాక్ త‌గిలేలా రిప్లై వ‌చ్చింద‌ట‌. అదేమిటంటే... పార్టీలో ఉంటే ఉండు లేక‌పోతే వెళ్లిపో.. అనేంత స్థాయిలో స్పందించార‌ట కొంద‌రు హై క‌మాండ్ నేత‌లు. పార్టీలోకి ఇప్పుడు చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న‌ట్టుగా, ఎవ‌రు వ‌చ్చినా చేర్చుకునేదే అని స్ప‌ష్టం చేశార‌ట‌. దీంతో అవాక్క‌వ‌డం స‌ద‌రు ఎమ్మెల్యే వంతు అయ్యింద‌ని స‌మాచారం.

ఆ ఎమ్మెల్యే ప‌దేళ్ల నుంచి వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప‌ని చేశారు. గ‌త ప‌దేళ్ల నుంచి పార్టీ త‌ర‌ఫున ఎన్నో డక్కామొక్కీలు తిన్నారు. అలాంటి వ్య‌క్తికే ఇప్పుడు ఉంటే ఉండు లేక‌పోతే లేద‌నే ప‌రిస్థితి ఎదురైంద‌ట‌. స‌ద‌రు తెలుగుదేశం నుంచి వ‌చ్చిన నేతకు ఆ పార్టీతో చాలా అనుబంధ‌మే ఉంది. ఆయ‌న ఒంట్లోనే ప‌సుపుర‌క్తం ప్ర‌వ‌హిస్తూ ఉంటుందంటారు. ఇప్పుడు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఆయ‌న చేరుతున్న‌ది కూడా కేవ‌లం త‌న వ‌ర్గాన్ని కాపాడుకోవ‌డానికి - తెలుగుదేశం అభిమానుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఉండ‌టానికి అనేన‌ట‌. అయినా వైసీపీ హై క‌మాండ్ మాత్రం.. అలాంటి వారి చేరిక‌ల‌కు చాలా ప్రోత్సాహ‌మే అందిస్తూ ఉన్న‌ట్టుంది. పార్టీ త‌ర‌ఫున ప‌ని చేసిన వారి క‌న్నా ఇప్పుడు చేరే వారే ఎక్కువ అన్న‌ట్టుగా కొంత‌మంది పెద్ద స్థాయి నేత‌లు మాట్లాడుతున్నార‌ట‌!
Tags:    

Similar News