జ‌గ‌న్ కు హ్యాండిచ్చినోళ్లంతా ఓడారు!

Update: 2019-05-27 05:21 GMT
అధినాయ‌కుడు న‌మ్మిన‌ప్పుడు ఆయ‌న న‌మ్మ‌కానికి విధేయులుగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. అందుకు భిన్నంగా స్వార్థ రాజ‌కీయంలో భాగంగా న‌మ్మ‌క‌ద్రోహం చేసిన నేత‌లకు త‌గిన బుద్ది చెబుతారు ప్ర‌జ‌లు. ఈ విష‌యం తాజాగా ఏపీ రాజ‌కీయ ప‌రిణామాల్ని చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. 2014సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి గెలుపొందిన  ఎమ్మెల్యేలు ప‌లువురు నైతిక విలువ‌ల‌కు తిలోద‌కాలు ఇవ్వ‌టం.. టీడీపీలో చేర‌టం తెలిసిందే.

మ‌రి.. అలాంటి వారిలో కొంద‌రిని చూస్తే వారి రాజ‌కీయ భ‌విష్య‌త్తు ఇప్పుడు అర్థం కాని రీతిలోకి వెళ్లిపోయింద‌ని చెప్పాలి. పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డిన వారిని ప్ర‌జ‌లు నిర్మోహ‌మాటంగా తిర‌స్క‌రించారు. పార్టీ మారిన వారికి షాకిచ్చిన ప్ర‌జ‌లు.. పార్టీలో కంటిన్యూ అయిన వారికి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టిన వైనం కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపించ‌క‌మాన‌దు.

2009లో పామ‌ర్రు నుంచి టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడారు ఉప్పులేటి  క‌ల్ప‌న‌. అనంత‌రం 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసి గెలుపొందారు. రెండేళ్ల త‌ర్వాత న‌మ్మిన అధినేత‌కు న‌మ్మ‌క‌ద్రోహం చేసి టీడీపీలోకి వెళ్లారు. 2019లో టీడీపీ త‌ర‌ఫున పామ‌ర్రు నుంచి పోటీ చేశారు. పాలిటిక్స్ లోకి కొత్త‌గా వ‌చ్చిన కైలే అనిల్ కుమార్ చేతిలో ఏకంగా 30,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఆమె ఒక్క‌రే కాదు.. ఇలాంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి.

విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే జ‌లీల్ ఖాన్ సంగ‌తే చూస్తే.. ఆయ‌న రాజ‌కీయ జీవితం ఇక ముగుస్తుంద‌న్న వేళ 2014లో ఆయ‌నకు జ‌గన్ పార్టీ టికెట్ ఇవ్వ‌టం.. ఆయ‌న గెల‌వ‌టం తెలిసిందే. ఏడాది తిర‌క్క‌ముందే టీడీపీలో చేరారు. తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు బ‌దులుగా త‌న కుమార్తెకు టీడీపీ టికెట్ ఇప్పించుకున్నారు జ‌లీల్ ఖాన్. వైఎస్సార్ కాంగ్రెస్ అభ్య‌ర్థి వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్ చేతిలో ఓట‌మిపాల‌య్యారు. వాస్త‌వంగా జ‌లీల్ ఖాన్ కుమార్తె ఓట‌మి సొంతంగా కంటే కూడా త‌న తండ్రి జంపింగ్ ఇమేజ్ కార‌ణంగా ఓట‌మిపాల‌య్యార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. ఇలా జ‌గ‌న్ కు హ్యాండిచ్చిన ఎంతోమంది నేత‌ల‌కు షాకులు త‌ప్ప‌లేదు.
Tags:    

Similar News