వైసీపీ హిట్స్ బ్యాక్‌!... రాధా మాట‌ల‌న్నీ అబ‌ద్ధాలే!

Update: 2019-01-24 11:57 GMT
బెజ‌వాడ పాలిటిక్స్‌ లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారిన వంగవీటి రాధాకృష్ణ రాజకీయ నిర్ణ‌యంపై ఇప్ప‌టికీ ఇంకా క్లారిటీ రాలేదు. మూడు రోజుల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన రాధా... ఏ పార్టీలో చేరాల‌న్న అంశంపై త‌న అభిమానుల‌తో చ‌ర్చోప‌ర్చ‌లు నిర్వ‌హించారు. ఇదే స‌మ‌యంలో ఏమాత్రం చిన్న అవకాశం చిక్కినా రాధాను లాగేసుకుందామ‌ని య‌త్నించిన టీడీపీ... ఏకంగా త‌న దూత‌లుగా కృష్ణా జిల్లా టీడీపీ అధ్య‌క్షుడు బ‌చ్చుల అర్జునుడు - సీఎం చంద్ర‌బాబుకు అత్యంత స‌న్నిహితుడిగా పేరున్న టీడీ జ‌నార్ద‌న్‌ లను రాధా వ‌ద్ద‌కు చ‌ర్చ‌ల‌కు కూడా పంపారు. ఈ క్ర‌మంలో త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్తుకు సంబంధించి కీల‌క ప్ర‌క‌ట‌న చేసేందుకు నేటి ఉద‌యం మీడియా ముందుకు వ‌చ్చిన రాధా... త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌ను ఏమాత్రం ప్ర‌స్తావించ‌లేదు. టీడీపీలో చేర‌తార‌ట క‌దా.. వంగ‌వీటిని హ‌త్య చేసిన టీడీపీలో రంగా ఆశ‌యాల‌ను ఎలా కొన‌సాగిస్తార‌ని ప్ర‌శ్నించిన మీడియాపై రాధా అంతెత్తున ఎగిరి ప‌డ్డారు. త‌న తండ్రి రంగా హ‌త్యలో కొంద‌రు వ్య‌క్తులు మాత్ర‌మే పాలుపంచుకున్నార‌ని చెప్పిన రాధా... దానిని టీడీపీకి ఆపాదించ‌డం ఎలాగంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

అంతేకాకుండా మీడియా స‌మావేశంలో జ‌గ‌న్‌ - వైసీపీల‌పై ఆయ‌న నిప్పులు చెరిగారు. రాధా వ్యాఖ్య‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వచ్చిన వైసీపీ కీల‌క నేత పేర్ని నాని... రాధా వ్యాఖ్య‌ల‌ను తీవ్ర స్థాయిలో ఖండించారు. అస‌లు రాధాకు వైసీపీలో ప్రాధాన్యం ద‌క్క‌లేద‌న్న మాట కూడా అవాస్త‌వ‌మేన‌ని - రాధాను పార్టీలో తీవ్ర అవ‌మానాలు జ‌రిగాయ‌న్న విష‌యంలో కూడా ఇసుమంతైనా నిజం లేద‌ని తేల్చేశారు. రంగా విగ్ర‌హావిష్క‌ర‌ణ‌కు సంబంధించి రాధాకు జ‌గ‌న్ ఆంక్ష‌లు పెట్టార‌న్న వ్యాఖ్య‌ల‌ను కొట్టేసిన నాని... ఎక్క‌డికి వెళ్లినా పార్టీ కార్యక‌ర్త‌ల‌ను ప‌ల‌క‌రించాల‌ని మాత్ర‌మే సూచించార‌ని చెప్పారు. అస‌లు రాధా చెప్పిన కార‌ణంగానే... కోరి మ‌రీ పార్టీలోకి వ‌స్తాన‌ని ముందుకు వ‌చ్చిన దేవినేని నెహ్రూను పార్టీలో చేర్చుకోలేద‌ని కూడా నాని చెప్పుకొచ్చారు. అయినా రంగా ఆశ‌య సాధ‌నే త‌న ల‌క్ష్య‌మ‌ని చెబుతున్న రాధా... టీడీపీలో రంగా ఆశ‌యాల సాధ‌న ఎలా సాధ్య‌మవుతుందో చెప్పాల‌ని డిమాండ్ చేశారు.

రంగాను హత్య చేసింది టీడీపీనేన‌ని - ఈ విష‌యం రంగా అభిమానులంద‌రికీ తెలిసిందేనని - ఏ ప్రాంతానికి వెళ్లినా ఇదే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంద‌ని నాని పేర్కొన్నారు. రంగాను హ‌త్య  చేసిన టీడీపీలో చేరి రాధా... త‌న తండ్రి ఆశ‌యాల‌ను ఎలా కొన‌సాగిస్తార‌ని కూడా ప్ర‌శ్నించారు. పేద‌ల‌కు సంక్షేమమే త‌న ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్న రాధా.... టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్ప‌టిదాకా ఎంత‌మందికి ప‌ట్టాలిచ్చారో గుర్తు చేసుకోవాల‌ని కూడా నాని హిత‌వు ప‌లికారు. ఎమ్మెల్యేగా ఏం చేస్తార‌ని జ‌గ‌న్ త‌న‌ను ప్ర‌శ్నించార‌న్న రాధా కామెంట్ల‌కు స‌మాధానంగా నాని ఫుల్ క్లారిటీ ఇచ్చారు. ఒక్క ఎమ్మెల్యేతో రాష్ట్రంలో ఏమీ చేయ‌లేమ‌ని - ఎంత ఎక్కువ సంఖ్య‌లో ఎమ్మెల్యేల బ‌లం ఉంటే...అంత మేర ప్ర‌జా సేవ చేయ‌వ‌చ్చ‌న్న విష‌యాన్నే జ‌గ‌న్ చెబుతార‌ని - ఇదే విష‌యాన్ని రాధాతోనూ జ‌గ‌న్ అని ఉంటార‌ని చెప్పారు. మొత్తంగా వైసీపీపై రాధా చేసిన వ్యాఖ్య‌ల‌న్నింటినీ నాని కొట్టిపారేశారు.
Tags:    

Similar News