పవన్‌ తర్వాత.. జగన్‌ సంగతేంది అంబటి?

Update: 2015-06-28 09:56 GMT
వినే వాడు ఉండాలే కానీ చెప్పే వాడు చెలరేగిపోతారనటానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతల్ని చూస్తే అర్థమవుతుంది. ఒక విపక్ష నేతగా కీలకమైన అంశాలపై నోరు మెదపని తమ అధినేత గురించి ఒక్క మాట మాట్లాడే ధైర్యం లేని అంబటి రాంబాబులాంటి వారు.. జనసేన అధినేత పవన్‌ మీద వ్యాఖ్యలు చేయటంపై తీవ్రంగా మండిపడుతున్నారు.

తెలంగాణ.. ఆంధ్ర రాష్ట్రాల మధ్య నడుస్తున్న పంచాయితీలను చూసిన వారు ఎవరైనా.. మరీ.. ఇంతలా కొట్లాడుకుంటారా? అని నవ్వుతుంటే ఒక్క మాట మాట్లాడని జగన్‌ లాంటి వారు.. ఇలాంటి గొడవలు రెండు ప్రాంతాల ప్రజల్ని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని హెచ్చరిస్తూ.. రెండు జాతులు కోట్లాటనే ఎంత శాంతపర్చారో అని మండేలా ఉదంతాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే.

రామా అంటే బూతులాగా వినిపించే అంబటి లాంటి వారికి.. మండేలా ప్రస్తావన తీసుకొచ్చిన పవన్‌ మాటల్లో ఏదో బూతుగా వినిపించి తెగ ఫీలైపోతున్నారు. రెండు జాతుల మధ్య వైరంగా పోల్చి నెల్సన్‌ మండేలాను వివాదంలోకి లాగడం దురదృష్టకరమంటూ అంబటి వ్యాఖ్యానించిన తీరు చూస్తే.. పవన్‌ చెప్పిన మాటలు ఆయనకు అర్థం కాలేదన్న భావన కలగటం ఖాయం.

ఎంతసేపటికి ఏదో విధంగా పవన్‌ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడాలన్న యావ తప్పించి.. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న పంచాయితీని ఏ విధంగా పరిష్కరించాలన్న అంశంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేతలకు ఎలాంటి ఆలోచన లేదన్నట్లుగా ఉంది. సెక్షన్‌ 8 గుర్తుకు వచ్చిందా? అంటూ పదే పదే ప్రస్తావిస్తున్న అంబటి.. అసలు ఈ అంశంపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ స్టాండ్‌ ఏమిటి? ఆ పార్టీ అధినేత జగన్‌ ఏం చెబుతారు?

ఈ విషయమే కాదు.. సెక్షన్‌ 9, 10 లలో ఉన్న సంస్థలకు సంబంధించిన వివాదంలో జగన్‌ మాటేమిటి? విద్యుత్తు ఉద్యోగుల్ని ఏకపక్షంగా తొలగించటంపై జగన్‌ ఏమంటారు? పాలమూరు ఎత్తిపోతల పథకంపై లేఖ రాసినట్లు చెప్పిన జగన్‌.. ఆ తర్వాత ఏం చేయనున్నారు? బాంబులేస్తానని చెప్పిన కేసీఆర్‌ మాటలపై జగన్‌ స్పందన ఏమిటి? లాంటి ప్రశ్నలకు సమాధానం ఏమిటో ముందు చెబితే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News