బాబు సొంతూరు లో జగన్ పార్టీ సభకు రెస్పాన్స్ ఎంతంటే?

Update: 2020-02-03 04:55 GMT
ఇంటిని గెలవనోడు.. ఊరిని ఎలా ఏలగలడు? ఇప్పుడు ఇలాంటి విమర్శనే ఎదుర్కొంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆయన సొంతూరు చిత్తూరు జిల్లా నారావారిపల్లెలో తాజాగా జరిగిన జగన్ పార్టీ సభకు పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావటమే కాదు.. అక్కడ వచ్చిన స్పందన చూసినోళ్లంతా సొంతూరులో బాబుకున్న పలుకుబడి ఇంతేనా? అన్న ఆశ్చర్యానికి గురయ్యే పరిస్థితి. అధినేతలు ఎవరైనా సరే.. వారి సొంతూళ్లలో వారికి తిరుగులేని పట్టు ఉంటుంది. అందుకు భిన్నమైన పరిస్థితి నారావారి పల్లెలో బాబుకు ఉందన్న విషయం తాజా బహిరంగ సభ నిరూపించినట్లైంది.

ఈ సభకు పలువురు మంత్రులు.. చిత్తూరు జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు.. సీనియర్ నేతలు హాజరయ్యారు. ముఖ్యమంత్రి హాజరు కాని ఈ సభకు ఏకంగా పాతిక వేల మంది వరకూ ప్రజలు రావటం హాట్ టాపిక్ గా మారటమే కాదు.. బాబుకు బీపీ పెరిగేలా చేసిందని చెప్పక తప్పదు.

ఈ సభకు నారావారి పల్లె నుంచి మాత్రమే కాదు.. చుట్టుపక్కల ఊళ్ల నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజలు హాజరు కావటమే కాదు.. జగన్ పార్టీ నేతలు చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వినటం కనిపించింది. ఈ ఊళ్లో ఇంత పెద్ద సభను ఇప్పటి వరకూ నిర్వహించింది లేదు. ఊరి ఆరంభం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఫ్లెక్సీలు.. తోరణాలతో నారావారిపల్లెకు కొత్త శోభను తీసుకొచ్చాయి. రోడ్డు కు ఇరు వైపులా ఏర్పాటైన ఫ్లెక్సీలలో మూడు రాజధానుల నిర్ణయానికి తాము స్వాగతిస్తున్నట్లుగా ఉండటం విశేషం.

ఈ సభలో బాబు తన సొంతూరును పట్టించుకోలేదన్న వాదన పలువురి నోట వినిపించింది. ముఖ్యమంత్రి గా అంత కాలం పని చేసిన నేత సొంతూరు ఇలా ఉండటం ఏమిటన్న ప్రశ్న వినిపించటమే కాదు.. అమరావతి మీద చూపించే ప్రేమ నారావారి పల్లె మీద ఎందుకు చూపించలేదన్న మాట వచ్చింది. మొత్తంగా చూస్తే.. బాబు సొంతూరు లో జగన్ పార్టీ సభ.. తెలుగు తమ్ముళ్ల కు చెమటలు పట్టేలా చేస్తే.. బాబుకు భారీ షాక్ ను ఇచ్చిందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News