టీటీడీ పాలకమండలికి - ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుకు మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. టీటీడీ బోర్డులో జరుగుతోన్న అవకతవకలపై - ఆగమ శాస్త్రాలకు విరుద్ధంగా జరుగుతోన్న పనులపై తాను నోరు మెదిపినందుకే ప్రభుత్వం తనపై కక్ష్య తీర్చుకుంటోందని రమణ దీక్షితులు ఆరోపిస్తున్నారు. శ్రీవారి పోటులోని నేలమాళిగలో ఉన్న నిధుల కోసమే ఏపీ సీఎం చంద్రబాబు ...తన అనుయాయులతో ఆ తవ్వకాలు జరిపారని రమణ దీక్షితులు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఈ నేపథ్యంలో వెంకన్న నగలు మాయమయ్యాయన్న ఆరోపణలు - శ్రీవారిపోటులో తవ్వకాల కలకలం....పాలకమండలి నిర్ణయాలు....భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని ఉమ్మడి హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. వారి పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు.....విచారణ చేపట్టేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే....తిరుమల శ్రీవారి ఆభరణాలపై వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ నగలపై భక్తుల్లో అనుమానాలున్నాయని - అందుకే శ్రీవారి ఆభరణాలు - ఆస్తుల వివరాలను ఆన్ లైన్ లో పెట్టాలని రోజా డిమాండ్ చేశారు.
బుధవారం ఉదయం తిరుమల వెంకన్నను వైసీపీ ఎమ్మెల్యేలు రోజా - కోన రఘుపతి - ఆదిమూలపు సురేష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రోజా....చంద్రబాబుపై మండిపడ్డారు. చంద్రబాబుపై ఆరోపణలు చేసినందుకే ప్రధాన అర్చకులు రమణదీక్షితులను అవమానపరిచి తొలగించారని టీటీడీపై రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నిరంకుశత్వ పాలనకు ఇది నిదర్శనమని అన్నారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను దర్శనానికి అనుమతించేలా వైసీపీ నిరసన తెలిపిందన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీసిన వారిని వెంటనే టీటీడీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. శ్రీవారి నగలను ఆన్‌లైన్ లో ఉంచుతామని జేఈఓ శ్రీనివాస రాజు చెప్పారని, ఇప్పటివరకు పెట్టలేదని అన్నారు. నగలపై భక్తుల అనుమానాలను నివృత్తి చెయ్యాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పదవీ విరమణ చేసిన అర్చకులకు పూర్వవైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు.