జ‌గ‌న్ మాట:అవిశ్వాసంపై చ‌ర్చించాల్సిందే..ఎంపీలు రాజీనామాకు రెడీ

Update: 2018-03-26 12:41 GMT
ప్ర‌త్యేక హోదా కోసం రాష్ట్రం ఏర్పాటు అనంత‌రం నుంచి పోరాటం చేస్తున్న వైసీపీ  అధినేత‌ - ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి త‌న దూకుడును మ‌రింత పెంచారు. ఏకంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ప్రత్యేక హోదా పోరాటంలో భాగంగా డెడ్‌ లైన్ విధించారు. వచ్చే నెల 6వ తేదీలోగా  ప్ర‌త్యేక హోదా ఇవ్వాల‌ని డిమాండ్ చేసిన జ‌గ‌న్  ఒక‌వేళ‌ ఇవ్వకుంటే తన పార్టీ ఎంపీలు రాజీనామా చేస్తారని స్ప‌ష్టం చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ముప్పాళ్ల గ్రామం ప్రజా సంకల్ప క్యాంపు కార్యాలయంలో వైఎస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా లోక్‌ సభ - రాజ్యసభల్లో వ్యవహరించాల్సిన విషయాలపై ఎంపీలతో చర్చించారు. భేటీ అనంతరం పార్టీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ చ‌ర్చ‌ల‌ను వివ‌రించారు.

పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ..తామిచ్చిన అవిశ్వాస నోటీసులపై చర్చించకుండా పార్లమెంట్‌ ను వాయిదా వేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం చూస్తే, వాయిదా వేసిన రోజునే ఎంపీలంతా రాజీనామా చేస్తారని వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ త‌మ‌తో తెలిపార‌ని వివ‌రించారు.ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని వైఎస్‌ ఆర్‌ సీపీ అధినేత వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మొదటి నుంచి పోరాటం చేస్తున్నారని మేకపాటి గుర్తు చేశారు. 13 జిల్లాలో తిరిగి యువతను చైతన్య పర్చడం - ధర్నాలు - దీక్షలు చేశారన్నారు. గుంటూరు వేదికగా ఆమరణ నిరాహారదీక్ష కూడా చేశారన్నారు. పలు బహిరంగ సభల్లో 13వ ఆర్థిక సంఘం ప్రకారమే హోదా ఇవ్వాలని డిమాండ్‌ చేశారన్నారు. మార్చి 1వ తేదీన కలెక్టరేట్‌ ల ముట్టడి - 5వ తేదీన ఢిల్లీలో పార్టీ నేతలతో ధర్నాలు - ఆ తరువాత లోక్‌ సభలో అవిశ్వాస తీర్మానాలు ప్రవేశపెడుతూ.. పోరాటం ఉధృతం చేశామన్నారు. చంద్రబాబు నాలుగేళ్లుగా ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. టీడీపీకి మెజార్టీ ఎంపీలున్నా హోదా సాధనలో విఫలమైందని విరుచుకుపడ్డారు. హోదా విషయంలో రాజీపడేది లేదని - ఎవరు ప్రత్యేక హోదా ఇస్తే వారికి వచ్చే ఎన్నికల్లో మద్దతు ఇస్తామని చెప్పారు.టీడీపీ ఎంపీలు తమతో కలసి రావాలని కోరారు.

వైయస్‌ ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటాన్ని ఎగతాలి చేసి మాట్లాడిన చంద్రబాబు.. ప్రతిపక్ష వైఎస్‌ జగన్‌ బాటలోకే వచ్చారని మేకపాటి అన్నారు. మొదట్లో అవిశ్వాసం ప్రవేశపెడితే మద్దతు లేదని చులకన చేసి మాట్లాడారని మండిపడ్డారు. ఆ తరువాత వైఎస్‌ జగన్‌ రాసిన లేఖ ద్వారా జాతీయ పార్టీల నేతలను కలిసి మద్దతు కూడగట్టడంతో బాబు వెన్నులో వణుకుపుట్టి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ప్లేట్‌ ఫిరాయించారన్నారు. వైఎస్‌ ఆర్‌ సీపీ అవిశ్వాసానికి మద్దతు ఇస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా చెప్పి 16వ తేదీ ఉదయం విరమించుకున్నారన్నారు. ప్రత్యేక హోదా సాధించే వరకు వెనక్కు తగ్గేది లేదని - హోదా కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ ను రేపు నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు ప్రకటిస్తే - రేపే ఎంపీలంతా రిజైన్ చేస్తారని ఆయన స్పష్టం చేశారు. స్పీకర్ ఫార్మాట్ లోనే తమ ఎంపీల రాజీనామా పత్రాలు ఉంటాయని అన్నారు.
Tags:    

Similar News