కందుకూరు ఘటనలో పవన్ పాత్ర ఎంత..? ఇది క్లియర్ !

Update: 2022-12-31 03:47 GMT
ఎలాగైనా జగన్ కు ఈ సారి అధికారం దక్కకూడదనే కసితో ఉన్న జనసేనాని పవన్ కళ్యాణ్.. టీడీపీతో పొత్తుకు అంతర్గతంగా చర్చలు జరిపినట్టే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.. అయితే ఇప్పటి వరకు పవన్ ఎక్కడా టీడీపీ పొత్తు గురించి ప్రస్తావించకపోయినప్పటికీ కందుకూరు ఘటన దీనికి మరింత బలం చేకూరుస్తోంది. ఏదైనా తప్పు జరిగితే అత్యంత వేగంగా స్పందించే పవన్ ఈ విషయంలో మాత్రం తన రాజకీయ చతురతను ప్రదర్శించాడు. ఒక వైపు ప్రశ్నించలేదనే మాట అనిపించుకోకుండా పార్టీ నుంచి ఒక ప్రకట విడుదల చేశారు. టీడీపీది తప్పు అని కాకుండా మానవీయ కోణంలో ఇది దురద్రుష్టకరమంటూ ప్రకటన ఇచ్చి తన భవిష్యత్ రాజకీయాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెప్పారు..

-కందుకూరు ఘటనపై రాజకీయాలా?

నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనను చంద్రబాబుకు ఆపాదించి రాజకీయ లబ్ధిపొందాలనుకోవడం తెలివితక్కువ పనే.. ఇప్పుడు వైసీపీ చేస్తున్న పని ఇదే. అదొక దురద్రుష్టకర ఘటన, దానిని రాజకీయ కోణంలో చూడటం కూడా తగదు. ఒక సభ తలపెడితే భద్రతా చర్యలు తీసుకోవడం అనేది సహజం. అయితే రోడ్ షో దీనికి విరుద్ధం. రోడ్ షోలో భద్రతా చర్యల పర్యవేక్షణ అనేది ఒకింత కష్టతరమే.. అయితే పార్టీలను రోడ్ షోలకే మక్కువ చూపుతుంటాయి.  

ఎందుకంటే ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ప్రజలతో క్షేత్ర స్థాయిలో మమేకమయ్యేందుకు ఉపయోగపడుతుందనేది పార్టీల భావన. అందుకే పార్టీలు ఎన్నికల సమయంలో సభలు, సమావేశాలతో పాటు రోడ్ షోలకు ప్రాధాన్యతనిస్తుంటాయి. సాపీగా జరగాల్సిన రోడ్ షోలో కందుకూరు ఘటన ఒకరంగా విచారకరమే.. అయితే ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు 24 లక్షల చొప్పున నష్టపరిహారం ఇవ్వడమే కాకుండా వారి కుటుంబాలకు పూర్తిగా అండగా నిలుస్తామని భరోసా కల్పించారు.

-ఇందులో పవన్ పాత్ర ఏమిటి?

కందుకూరు ఘటనపై వైసీపీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. ఇదే అదునుగా భావించి విమర్శల బాణాలను ఎక్కుపెడుతోంది. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. రాజకీయంగా తనకంటూ ఒక ఇమేజ్ ను సెట్ చేసుకున్న పవన్ ఎలా స్పందిస్తారనేది అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే పవన్ పార్టీ నుంచి ప్రకటన ఇచ్చి తన స్టాండ్ ఏమిటో తెలియజెప్పారు.. ఈ ఘటనపై జనసేన నాయకులు సైతం ఎక్కడా స్పందించక పోవడం మరో ఎత్తు. ఇలాంటి ఘటనను రాజకీయాలకు అనుకూలంగా మలుచుకోవాలని ఎలాంటి నాయకుడైనా భావిస్తుంటాడు.

అయితే ఇప్పుడు వపన్ అది ఒక దురద్రుష్టకరమంటూ పేర్కొనడం ఆయన రాజకీయ చతురతకు ఓ నిదర్శనం. మొదటి నుంచీ జగన్ విధానాలను ఎండగడుతూ పవన్ తనదైన శైలిలో విమర్శలు గుప్పిస్తూ చంద్రబాబుకు సపోర్ట్ గా నిలుస్తూ వస్తున్నారు. గత ఎన్నికల పరాభవాలను గుర్తెరిగి ఈ సారి ఎన్నికల్లో కలిసి వెళ్తామంటూ అంతర్గతంగా సంకేతాలు పంపుతున్నారు. పవన్, చంద్రబాబు కలవకూడదనే భావనతో మరో వైపు వైసీపీ సవల్ చేస్తూ ఒక్కడివే ఎన్నికల్లో దిగాలంటూ రెచ్చగొడుతూ వస్తోంది. ఇలాంటి సమయంలో కందుకూరు ఘటన పవన్ స్టాండ్ ఏమిటనేది తేల్చి చెబుతోంది.. చంద్రబాబు వెంటే పవన్ ఉంటారంటూ ఈ ఘటన రుజువు చేస్తోంది.

-ఆచితూచి...

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని మట్టికరిపించాలనే తలంపుతో ఉన్న పవన్ బాలరిష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. సోషల్ మీడియాను వేదిక చేసుకుని అభ్యంతరకంగా విపక్షాలు విమర్శలకు దిగుతున్నప్పటికీ జనసైన్యం వేచిచూసే ధోరణిలో వ్యవహరిస్తోంది. ఏదైనా పొరపాటు జరిగితే వైసీపీపై దుమ్మెత్తి పోసే పవన్ మరి టీడీపీ విషయంలో ఎందుకు కామ్ గా ఉంటున్నారంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పవన్ టీడీపీతో పొత్తుకు క్లియర్ కట్ ఇయ్యకపోయినప్పటికీ దీనిని వైసీపీ మాత్రం పొత్తుకు మార్గం సుగుమం అయినట్టే అని భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తారనడానికి బలమైన సంకేతం ఇచ్చినట్టయింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News