పవన్... లోకేష్ ఎమ్మెల్యేలు కాలేరా...?

Update: 2022-09-21 03:54 GMT
ఆ ఇద్దరికీ ఏపీ అసెంబ్లీ లోపలికి అడుగుపెట్టే పరిస్థితి ఉందా. వాళ్ళను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వమని ఒక వైపు అధికార వైసీపీ గంభీరమైన ప్రకటనలతో గట్టి  ప్రతిజ్ఞలు చేస్తోంది. వారు ఎక్కడ నిలబడ్డా ఓడించి తీరుతామని కూడా శపధం చేస్తోంది. దానికి తగినట్లుగానే వైసీపీ యాక్షన్ ప్లాన్ కూడా ఉంటోంది. దాంతో ఏపీలో ఆ ఇద్దరు నాయకుల రాజకీయ భవిష్యత్తు ఏమిటి అన్న చర్చ ఉంది. పోనీ వాళ్ళు ఏమైనా సాదా సీదా నేతలా అంటే కానే కాదు. ఆ ఇద్దరూ ఒకరు ఏపీలో దిగ్గజ నేత చంద్రబాబు పుత్రరత్నం, టీడీపీ భావి వారసుడు లోకేష్ అయితే రెండవ వారు ప్రముఖ సినీ నటుడు. పవర్ స్టార్ బిరుదాంకితుడు, జనసేన అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్.

ఈ ఇద్దరూ 2024 తరువాత ఏర్పడే కొత్త అసెంబ్లీలో కనిపిస్తారా లేదా అన్నది హాట్ హాట్ డిస్కషన్ గా ఉంది. అయితే వీరి మీద వైసీపీ గురి మామూలుగా లేదు. ఇప్పటికే చంద్రబాబు కుప్పం మీద ఫుల్ ఫోకస్ పెట్టి భారీ ఎత్తున నిధులను విడుదల చేయడమే కాకుండా ముఖ్యమంత్రి జగన్ స్వయంగా అక్కడ టూర్ పెట్టుకున్నారు. కుప్పం టీడీపీలో ఉన్న బలమైన నేతలకు గేలం వేస్తున్నారు. ఆ విధంగా చంద్రబాబుకు గట్టి పోటీ ఇచ్చేలా ఆ సీటుని రెడీ చేసి పెడుతున్నారు.

ఇక మరో వైపు చూస్తే మంగళగిరిలో నిన్నటిదాకా తమకు అంతా అనుకూలం అని టీడీపీ అనుకుంది. లోకేష్ కూడా చీటికి మాటికీ అక్కడికి వెళ్ళి తన కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చారు. ఈసారి తన గెలుపు ఖాయమని కూడా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు. అయితే వైసీపీ మంగళగిరి మీద గురి పెట్టేసింది. అక్కడ టీడీపీలో పాతుకుపోయిన నాయకుడు 2014లో టీడీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేసి పెద్ద ఎత్తు ఓట్లు తెచ్చుకుని అతి తెక్కువ మెజారిటీతో ఓడిన గంజి చిరంజీవిని తెచ్చి తమ పార్టీలో కలిపేసుకుంది.

ఇక ఆయనకు వైసీపీ చేనేత విభాగం ప్రెసిడెంట్ పదవి ఇచ్చి మరీ సమాదరించింది. వచ్చే ఎన్నికల్లో ఆయన్నే పోటీ పెట్టాలని చూస్తోంది. ఇప్పటికే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే మురుగుడు హనుమంతరావుని వైసీపీలోకి లాగేశారు. ఆయన్ని ఎమ్మెల్సీ చేశారు. ఆయన కూడా బీసీ నేత. ఇలా కీలకమైన నేతలు అంతా వైసీపీలో ఉన్నారు. పైగా అక్కడ చేనేత సామాజిక వర్గం పెద్ద ఎత్తున ఉంది.

లోకేష్ వర్సెస్ గంజి చిరంజీవి అంటే సహజంగానే లోకల్ మొగ్గు ఉంటుంది. పైగా ఒకసారి గెలుపు దగ్గరదాకా వచ్చి ఓడిన చిరంజీవి మీద సానుభూతి కూడా ఉంటుంది. దీనికి తోడు ఇపుడు అక్కడ పెద్ద ఎత్తున నిధులను కుమ్మరిస్తూ వైసీపీ మంగళగిరిలో మరోమారు గెలుపు బావుటా ఎగరేయాలని చేస్తోంది. దీంతో అక్కడ నుంచి లోకేష్ పోటీ చేస్తారా లేదా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇపుడు పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ఆయన 2024లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఇంకా తెలియదు, ఆయన విశాఖ జిల్లా గాజువాక నుంచి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. ఈసారి ఆయన తూర్పు గోదావరికి షిఫ్ట్ అవుతారని అంటున్నారు. అలాగే పిఠాపురం నుంచి పోటీ చేస్తారని కొందరు అంటే లేదు కాకినాడ రూరల్ నుంచి పోటీలో ఉంటారని అంటున్నారు. కాదు నర్సాపురం నుంచి బరిలో ఉంటారని వార్తలు వస్తే ఇవేమీ కాదు భీమవరం నుంచే ఆయన పోటీకి దిగుతారు అని చెబుతున్నారు.

ఇదిలా ఉండగా పవన్ పోటీ చేసే సీటు విషయం కూడా తొందరగా తెలిస్తే అక్కడ కూడా విపక్షాన్ని వీక్ చేయాలని వైసీపీ అనుకుంటోంది. ఆ సీట్లో తమ పార్టీ ఎమ్మెల్యేని బలోపేతం చేసి అక్కడ  కూడా నిధుల వరద పారించి ప్రత్యర్ధి వైపున ఉన్న  బలమైన నేతలను తమ వైపు లాక్కేళ్లే కార్యక్రమానికి కూడా రంగం సిద్ధం చేస్తోంది. మరి ఇవన్నీ తెలిసే తెలివిగా వ్యూహాత్మకంగా జనసేన తమ అధినాయకుడు పోటీ చేసే సీటుని గోప్యంగా ఉంచుతోంది అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఈసారి వైసీపీ టార్గెట్ గా పెట్టుకుంది చంద్రబాబు, లోకేష్, పవన్ లని ఓడించి తీరుతామని అంటోంది. బాబు విషయం పక్కన పెట్టినా లోకేష్, పవన్ని ఈసారి అసెంబ్లీ లోకి రానీయరా వారిని ఎమ్మెల్యేలుగా గెలవనీయరా అంటే వైసీపీ ప్లాన్ అదే అని అంటున్నారు. అయితే ఇక్కడ ఎవరు గెలవాలి అన్నా లేక ఓడాలీ అన్నా ప్రజల ఆదరణ ముఖ్యమని అంటున్నారు.

ప్రజలు కనుక తాము ఓటేస్తామని అనుకుంటే ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా కుదిరే పనే కాదని అంటున్నారు. అందువల్ల వైసీపీ అనుకున్నంత మాత్రాన పవన్ లోకేష్ అసెంబ్లీకి రాలేరు అనుకుంటే పొరపాటే అని కూడా అంటున్నారు. మొత్తానికి చూస్తే గతంలో ఎన్నడూ చూడని కొత్త రాజకీయం ఏపీలో సాగుతోంది. దానికి తెర తీసింది మాత్రం కచ్చితంగా వైసీపీయే అని చెబుతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News