మా దారి మాదే : సర్వేలపైన వైసీపీలో గరం గరం...?

Update: 2022-07-29 15:30 GMT
సర్వే అన్నది ఒక బ్రహ్మ పదార్ధం. దాని మీద పూర్తి అధికారిక నిరూపితమైన  వివరాలు ఎపుడూ రావు. ఇలా అనుకుంటున్నారు అలా ఆలోచిస్తున్నారు  అని మాత్రమే  చెబుతారు. ఎవరు అనుకుంటున్నారు అన్నది చేసే వారి బట్టి ఉంటుంది. ఈ సర్వేలను ఎలాగైనా తిప్పవచ్చు. ఏ విధంగా అయినా ట్విస్ట్ చేయవచ్చు. అందువల్ల సర్వేల లోగుట్టు చేసే సర్వేశ్వరులకే తప్ప ఆ దేవుడికి కూడా తెలియవంటే అతిశయోక్తి కాదేమో

ఇంతకీ మ్యాటరేంటి అంటే ఏపీలో అధికార పార్టీలో సర్వేల గొడవ రాజుకుంటోంది. వరసబెట్టి చేయిస్తున్న సర్వేలు అందులో వస్తున్న ర్యాంకుల మీద పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఈ సర్వేలకు ఉన్న విశ్వసనీయత ఏంటి అని కూడా వైసీపీ నాయకులు ప్రశ్నించే స్థాయికి పరిస్థితి వచ్చింది అంటే పార్టీ మీద అధినాయకత్వం మీద వారికి ఉన్న విశ్వాసం సన్నగిల్లుతోందా అన్న అనుమానాలు వస్తున్నాయి.

నిజానికి ఈ సర్వేలను చూపించే అధినాయకత్వం కొరడా ఝలిపిస్తోంది. మీ పనితీరు బాగులేదు అంటోంది, మెరుగుపరచుకోవాలని కూడా అంటోంది. ఇంతకీ ఎవరు చేశారు, ఎవరు చేయిస్తున్నారు ఈ సర్వేలు అన్నది మాత్రం లీడర్లకు అర్ధం కావడం లేదుట. దాంతో మా దారి మేము చూసుకుంటాం మహా ప్రభో అనే వారు కూడా రోజురోజుకూ పెరుగుతున్నారని అంటున్నారు.

ఇక సర్వేల గురించి చెప్పుకుంటే గడప గడప కార్యక్రమం మీదనే అధినాయకత్వం సర్వేలు కొన్ని చేయించింది. అయితే ఈ కార్య్రక్రమానికి చాలా మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొడుతున్నరు. పైగా వారు అంతగా ఆసక్తిని కూడా చూపించడంలేదని చెబుతున్నారు.  ఎందుకంటే  చాలా మందికి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ముందే తెలుసు కాబట్టి జాగ్రత్తపడ్డారని అంటున్నారు.

ఇక కేవలం పదిహేను మంది మాత్రమే సీరియస్ గా ఈ కార్యర్కమాన్ని తెసుకున్నారు అంటే 151లో అది ఎన్నో వంతో అర్ధం చేసుకోవాలి. ఇక మరో యాభై మంది దాకా అసలు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లడమే లేదని తేలింది. మిగిలిన వారు అయితే కొందరు మొక్కుబడి తంతుగా ఇలా వెళ్ళి అలా వస్తున్నారని కూడా సర్వేలు చెబుతున్న  వైనం.

ఇక వైసీపీ అధినాయకత్వం  గడప గడపకు కార్యక్రమం మీద మూడు రకాలైన సర్వేలు ఉంచుకుంది అంటున్నారు. ఐప్యాక్ సర్వే తో పాటు ఇంటెలిజెన్స్ సర్వే మొరో ప్రైవేట్ సర్వే కూడా పెద్దల వద్ద ఉంది. దాని ప్రకారం చూస్తే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, నాయకుల తీరు చూసినా గ్రామాల నుంచి మండలాలు, నియోజకవర్గం స్థాయి దాకా వైసీపీ నేతలు ఎవరూ యాక్టివ్ గా లేరని అంటున్నారు.

ఈ రకమైన నివేదికలను చూసిన మీదటనే వైసీపీ నాయకులు మండుతున్నారు. అసలు ఈ సర్వేలేమిటి ఈ గోల ఏమిటి అని కూడా కొందరు అంటున్నారు. తమ ప్రభుత్వం వచ్చి మూడేళ్ళే అయింది. ఇంకా ఏమైనా తప్పులు సరిచేసుకోవడానికి రెండేళ్ళ వ్యవధి ఉంది కదా అని అంటున్నారు. ఈ మధ్యలో గోల ఏంటి అని కూడా వారు చెబుతున్నారు. పైగా ఇపుడు వచ్చిన సర్వే ఫలితాలే ఫైనల్ కావు కదా అని కూడా కొందరు అంటున్నారు.

అసలు ఈ గోల అంతా కాకుండా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారో ఇవ్వరో తేల్చేస్తే మా దోవ మేము చూసుకుంటామని చెబుతున్న వారి సంఖ్య కూడా పార్టీలో పెరుగుతోందిట. మొత్తానికి అతి మరీ ఎక్కువై సర్వేలతో వైసీపీ లో ముసలం మొదలవుతోందా అన్న చర్చ అయితే సాగుతోంది మరి.
Tags:    

Similar News