వైసీపీ సోష‌ల్ మీడియా అతి!... పార్టీకి దెబ్బ త‌ప్ప‌దా?

Update: 2019-01-26 13:23 GMT
ఎన్నిక‌ల‌కు స‌మ‌యం స‌మీపిస్తున్న స‌మ‌యం ఏ పార్టీకైనా చాలా కీల‌క‌మ‌నే చెప్పాలి. విప‌క్షానికైతే ఇంకెంత ప్రాధాన్య‌మో చెప్పాల్సిన ప‌ని లేదు. ఎందుకంటే... అధికారంలో ఉన్న త‌న వైరి వ‌ర్గం త‌ను ఎక్క‌డ దొరుకుతుందా? అని కాసుక్కూర్చుని ఉంటుంది. ఏమాత్రం త‌ప్పు దొరికినా... విప‌క్షాన్ని ఉతికి పారేస్తుంది. అధికారం, అధికారుల అండ‌దండ‌లు, మీడియా వ‌న్ సైడెడ్ మూవ్‌మెంట్... ఇవ‌న్నీ అధికార ప‌క్ష పార్టీకి ఉన్న‌ప్పుడు విప‌క్షం ఎంత జాగ్ర‌త్త‌గా మ‌స‌లుకోవాలి. అతి జాగ‌రూక‌త‌తో మ‌స‌లుకోవాల్సిందే. మ‌రి ఏపీలో ప‌రిస్థితి ఎలా ఉందంటే... ప్ర‌తి చిన్న విష‌యాన్ని కూడా హైలెట్ చేసుకుంటూ పోతున్న విప‌క్షం వైసీపీ... త‌న‌ను తాను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసుకునే దిశ‌గా ఆ పార్టీ నేత‌లు వెళుతున్నారు. నేత‌ల మాట అలా ఉంచితే... ప్ర‌స్తుత ఎల‌క్ష‌న్స్ లో పార్టీ నేత‌ల కంటే పార్టీ త‌ర‌ఫున ప‌నిచేసే సోష‌ల్ మీడియా మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల్సి ఉంది. మ‌రి వైసీపీలో అందుకు విరుద్ధంగా జ‌రుగుతోందా? అంటే...అవున‌నే చెప్పాలి. అస‌లు పార్టీ నేత‌ల కంటే కూడా సోష‌ల్ మీడియా చేస్తున్న అతి కార‌ణంగా ఏకంగా పార్టీ డిఫెన్సివ్ మోడ్ లో ప‌డిపోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింద‌ని ఇప్పుడు పార్టీ అగ్ర నేత‌ల్లోనే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఇందుకు ఉదాహ‌ర‌ణే... టీడీపీ సీనియ‌ర్ నేత‌, అనంత‌పురం ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డిపైకి మీసం మెలేసి నాలుక కోసేస్తానంటూ మీడియా సాక్షిగా హ‌ల్ చ‌ల్ చేసిన క‌దిరి మాజీ సీఐ గోరంట్ల మాధ‌వ్... పార్టీలో చేరిన సంద‌ర్భంగా వైసీపీ సోష‌ల్ మీడియా చేసిన వీర విహార ప్ర‌చారం. సాధార‌ణ సీఐగా ప‌నిచేసిన గోరంట్ల మాధ‌వ్‌... ఎన్నిక‌ల్లో పోటీ చేసేది, లేనిది ఇంకా స్ప‌ష్టం కానే లేదు. ఏదో జేసీపై ఓ రేంజీలో విరుచుకుప‌డితేనే... అసెంబ్లీ, లేదంటే ఎంపీ టికెట్ ఇచ్చేస్తారా? ఇవేవీ పట్ట‌ని వైసీపీ సోష‌ల్ మీడియా విభాగం... గోరంట్ల మాధ‌వ్‌ను ఓ హీరోను చేసేసింది. ఆయ‌న చేరిక‌తో పార్టీకి ఏదో పెద్ద మైలేజీ వ‌చ్చేసిన‌ట్టేన‌ని క‌థ‌నాలు అల్లేసింది. హిందూపురం పార్ల‌మెంటు సీటు ఆయ‌న‌కే ద‌క్కే అవ‌కాశాలున్నాయ‌ని కూడా పరోక్షంగా క‌థ‌నాలు రాసి పారేసింది. ఏళ్ల త‌ర‌బ‌డి పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నేత‌ల‌కే ఇప్ప‌టిదాకా టికెట్లు క‌న్ఫార్మ్ కాలేదు. ఇప్ప‌టికిప్పుడు వచ్చిన గోరంట్ల మాధ‌వ్‌ కు టికెట్ క‌న్ఫార్మ్ అయ్యింద‌ని ఊద‌ర‌గొడితే ఎలా?

అయినా ప్ర‌స్తుతం జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో నిల‌బ‌డాలంటే ఆర్థికంగా చాలా బ‌లంగా ఉన్న నేత‌లే ఒక‌టికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. ఎన్నిక‌ల్లో గెలిస్తే స‌రేస‌రి.... లేదంటే ఉన్న‌దంతా ఊడ‌గొట్టుకుని బికారులం కావాల్సిందేన‌ని కాక‌లు తీరిన రాజ‌కీయ నేత‌లే వెనుకా ముందు ఆలోచిస్తున్న ప‌రిస్థితి. ఇలాంటి నేప‌థ్యంలో ఓ కానిస్టేబుల్‌గా వృత్తి జీవితం ప్రారంభించిన గోరంట్ల మాధ‌వ్‌... ప్ర‌మోష‌న్‌పై సీఐగా పనిచేశారు. అలాంటి సామాన్య ఉద్యోగి వ‌ద్ద ఎన్నిక‌ల్లో పోటీ చేసేంత మేర ఆర్థిక స్తోమ‌త ఉంటుందా? అన్న విషయాన్ని కూడా ప‌ట్టించుకోకుండా ఆయ‌నేదో పెద్ద నేత అంటూ సోష‌ల్ మీడియా విభాగం అతి చేస్తోంద‌న్న‌ది వైసీపీ నేత‌ల ఆందోళ‌న‌. మ‌రి ఈ త‌ర‌హా అతి చేయ‌కుండా ఇక‌నైనా సోష‌ల్ మీడియా విభాగానికి ముకుతాడు వేయ‌క‌పోతే... మున్ముందు మ‌రింత ఇబ్బంది ప‌డ‌తామ‌న్న నేత‌ల వాద‌న‌ను పార్టీ అధినేత ఏ మేర‌కు ప‌రిశీలిస్తారో చూడాలి.

Tags:    

Similar News