పాలేరుపై ష‌ర్మిల క‌న్ను అందుకేనా?

Update: 2022-06-20 01:30 GMT
వైఎస్సార్ తెలంగాణ పార్టీ  అధ్యక్షురాలు షర్మిలకు ప్ర‌జ‌ల నుంచి ఎంత ఆద‌ర‌ణ ఉందో తెలియ‌దు కానీ.. ఆమెకు మాత్రం ముఖ్య‌మంత్రి పీఠంపై మాత్రం ఎడ‌తెగ‌ని మోజు క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్ర‌మంలో ముఖ్య‌మంత్రి అవ్వ‌క‌పోయినా.. అసెంబ్లీలోకి అడుగు పెట్టేందుకు మాత్రం ఆమె చాలా వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నార‌ని అంటున్నారు.  వచ్చే ఎన్నికల్లో పాలేరు నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగుతానని ష‌ర్మిల‌ ప్రకటించారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ  జైత్రయాత్ర, జెండా పాలేరు నుంచే ఎగరాలని అన్నారు. వైఎస్సార్ అంటే ఎక్కువగా అభిమానించే వారంతా పాలేరులోనే ఉన్నారని.. అందుకే ఇక్కడి నుంచి పోటీకి దిగుతున్నట్లు వెల్లడించారు.

ఖమ్మం జిల్లా  నేలకొండపల్లిలో జరిగిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాలేరు నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటిం చారు. అయితే.. త‌న అభిమ‌తాన్ని ప్ర‌జ‌లపైకి నెట్టేసిన ష‌ర్మిల‌.. ఖమ్మం జిల్లా పాలేరు నుంచే పోటీ చేయాలనేది ప్రజల కోరిక. వారి కోరిక మేరకు పాలేరు నుంచి పోటీ చేస్తా. వైఎస్ఆర్‌ సంక్షేమ పాలన పాలేరు నుంచే మొదలు కావాలి. చరిత్రలో ఎన్నడూ లేని మెజారిటీ కోసం పని చేద్దాం. పాలేరు నియోజకవర్గం దిశా -నిర్దేశం కావాలి. ఎక్కడ అవసరం అయితే అక్కడ పోరాటం చేయాలి. అని ష‌ర్మిల వ్యాఖ్యానించారు.

ప‌క్కా లెక్క‌తోనే!

అయితే.. ష‌ర్మిల ప‌క్కా లెక్క‌తోనే ఉన్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. పాలేరులో రెడ్డి సామాజిక వ‌ర్గం ఎక్కువ‌గా ఉంది. అదేస‌మ‌యంలో క‌మ్మ వ‌ర్గం కూడా 20 శాతం వ‌ర‌కు ఉంది. త‌నే చెప్పుకొన్న‌ట్టుగా.. ఇక్క‌డ వైఎస్ అభిమానులు కూడా ఉన్న మాట వాస్త‌వ‌మే. వైఎస్ చొర‌వ‌తోనే రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన వారు కూడా ఉన్నారు. పైగా.. రెడ్డి వ‌ర్గం.. అటు ఏపీకి, ఇటు తెలంగాణ‌కు కూడా చేరువగా ఉన్న ప్రాంతం ఇది. అంటే.. మొత్తానికి రెడ్డి వ‌ర్గం త‌న‌ను గెలిపిస్తుంద‌నే భావ‌న‌తోనే ష‌ర్మిల ఉన్నార‌నేది ప‌రిశీల‌కుల అంచ‌నా.

టీఆర్ ఎస్ వ‌ర్గ‌పోరుపై ఆశ‌లు!

మ‌రోవైపు.. టీఆర్ ఎస్‌లో నెల‌కొన్న వ‌ర్గ పోరుపై కూడా ష‌ర్మిల దృష్టి పెట్టారు. 2014లో ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ విజ‌యం సాధించింది. అప్ప‌ట్లో రామిరెడ్డి వెంక‌ట రెడ్డి విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. అనారోగ్యంతో ఆయ‌న హ‌ఠాన్మ‌ర‌ణం చెంద‌డంతో టీడీపీ నుంచి టీఆర్ ఎస్‌లోకి వ‌చ్చిన తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు.. 2016లో జ‌రిగిన ఉప ఎన్నిక‌లో టీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆయ‌న‌కు కేసీఆర్ మంత్రి ప‌ద‌వి కూడా ఇచ్చారు. అయితే.. గ‌త 2018 ఎన్నిక‌ల్లో తుమ్మ‌ల ఇక్క‌డ నుంచి ఓడిపోయారు.

అయితే.. ఇక్క‌డ నుంచి కాంగ్రెస్ త‌ర‌ఫున గెలిచిన కందాల‌ ఉపేంద‌ర్‌రెడ్డి  త‌ర్వాత ప‌రిణామాల్లో కాంగ్రెస్‌ను వ‌దిలేసి.. టీఆర్ ఎస్‌లోకి చేరిపోయారు. దీంతో ఇప్పుడు టీఆర్ ఎస్‌లో తుమ్మ‌ల వ‌ర్సెస్ కందాల మ‌ధ్య టికెట్ పోరు అంత‌ర్గ‌తంగా సాగుతోంది. కేసీఆర్ ఈ టికెట్ ఎవ‌రికి ఇస్తార‌నేది ఇప్ప‌టికీ తేల్చ‌లేదు. దీంతో టీఆర్ ఎస్‌లో వ‌ర్గ పోరు తారస్థాయికి చేరింది. దీంతో రెడ్డి సామాజిక వ‌ర్గం.. త‌ల‌ప‌ట్టుకుంది. దీనిని గ‌మ‌నించిన ష‌ర్మిల‌.. వైఎస్ పేరుతో ఇక్క‌డ సెంటిమెంటును రాజేసి.. త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నార‌నే విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి.

టీఆర్ ఎస్ అటు తుమ్మ‌ల‌కు ఇచ్చినా.. ఇటు కందాల‌కు ఇచ్చినా.. ఒక‌రిపై ఒక‌రు పైచేయి సాధించేందుకు వారిలో వారే.. ఓట‌మికి ప్ర‌య‌త్నిస్తే.. అది త‌న‌కు ప‌రోప‌కారంగా మారుతుంద‌నేది ష‌ర్మిల వ్యూహం. మొత్తానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుతో కాకుండా.. వైఎస్ సెంటిమెంటు, అధికార పార్టీలో ఏర్ప‌డిన లుక‌లుక‌ల‌ను అడ్డు పెట్టుకుని గెల‌వాల‌నేది ష‌ర్మిల వ్యూహంగా క‌నిపిస్తోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే ఏరికోరి పాలేరును ఎంచుకున్న‌ద‌నేది వీరి విశ్లేష‌ణ‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.
Tags:    

Similar News