కారం తిన్నాం కాబట్టే పోరాటం చేస్తున్నాం

Update: 2016-09-13 05:46 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఆకాంక్ష‌ల కోసం పోరాడేందుకు త‌గిన పౌరుషం రావాలంటే... ఎంపీలు ఒంటికి కారం పూసుకోవాలన్న జ‌న‌సేన అధ్య‌క్ష‌డు పవన్ వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఘాటుగా స్పందించారు. కారం తిన్నాం కాబ‌ట్టే ప్రత్యేక హోదా కోసం తాము పోరాటం చేస్తున్నామని సుబ్బారెడ్డి స్ప‌ష్టం చేశారు. ప‌వ‌న్ దయాదాక్షిణ్యాల మీద వైసీపీ ఎంపీలు గెలవలేదని విష‌యం ఆయన గ‌మ‌నించుకోవాల‌న్నారు.  ఇత‌రుల‌కు నీతులు చెప్పే ముందు పవన్ కళ్యాణ్ త‌ను ఊరూరు తిరిగి గెలిపించిన టీడీపీ - బీజేపీ ఎంపీలు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కోసం ఏం చేస్తున్నారో ప్ర‌శ్నించుకోవాల‌ని సుబ్బారెడ్డి కోరారు. గెలిచిన ఆ మిత్ర‌ప‌క్షాల‌ ఎంపీలు వ్యాపారాల్లో మునిగిపోయి ఆంధ్రుల ఆకాంక్ష‌ల‌ను వ‌దిలేసిన విష‌యం ప‌వ‌న్ త‌ప్ప ప్ర‌జ‌లంతా గ‌మనిస్తున్నార‌ని సుబ్బారెడ్డి మండిప‌డ్డారు.

ప్ర‌త్యేక హోదాకు కేంద్ర ప్ర‌భుత్వం మొండి చేయి చూపిన త‌ర్వాత పోరాటానికి పిలుపు నిచ్చింది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీయే త‌ప్ప ప‌వ‌న్ గెలిపించిన టీడీపీ-బీజేపీలు కాద‌ని సుబ్బారెడ్డి తెలిపారు. పోరాటానికి సిద్ధం కాక‌పోయినా క‌నీసం ప్ర‌జాభిప్రాయం మేర‌కు ధ‌ర్నాల్లో కూడా ఆయా పార్టీల నేత‌లు పాల్గొన‌లేదని సుబ్బారెడ్డి తెలిపారు. కారం తిన్న వారు పోరాటం చేస్తున్నారని... కారం తిన‌క‌పోవ‌డమో లేక‌పోతే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను వ‌దిలిపెట్ట‌డ‌మో చేసిన అధికార పార్టీ నాయ‌కులు ఎక్క‌డ ఉన్నారో ప‌వ‌న్ ముందుగా వెతుక్కోవాల‌ని సుబ్బారెడ్డి ఎద్దేవా చేశారు. ఏపీలో చంద్రబాబునాయుడు అవినీతి పాలన నడుస్తోందని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ప్రజాగ్రహా న్ని అణచివేయలేరని, ఏనాటికైనా అది బ‌య‌ట‌ప‌డ‌టం ఖాయ‌మ‌ని హెచ్చ‌రించారు.
Tags:    

Similar News