తిరుమల దర్శనం.. సామన్యులకు గొప్ప ఊరట!

Update: 2019-07-14 04:54 GMT
అఖిలాండ కోటి బ్రాహ్మాండ నాయకుడి దర్శనం కోసం దేశ ప్రధాని నుంచి సామాన్యుడి దాకా అందరూ తెగ ఆరాటపడుతారు. ఇక దైవభక్తి ఉన్న మన గవర్నర్ నరసింహన్ లాంటి వాళ్లు రెండు, మూడు సార్లు కూడా ఏడాదికి వచ్చి దర్శించుకుంటారు. గవర్నర్ అంటే ఏమీ చేయలేం కానీ ఇక వీఐపీల పేరుతో ఏడాదికి నాలుగైదు సార్లు వస్తూ సామాన్య భక్తులకు దర్శనం భాగ్యం జాప్యం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వీఐపీలపై  వైసీపీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.

టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి గద్దెనెక్కగానే తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలోనే ఎల్1 - ఎల్2 - ఎల్ 3 - బ్రేక్ దర్శనాల రద్దు దిశగా నిర్ణయించారని సమాచారం. అలాగే వీవీఐపీ బ్రేక్ దర్శనాలకు బ్రేక్ పడబోతోంది.వీఐపీలు ఏడాదికి ఒక్కసారి వస్తేనే మంచిదని.. ఒకేసారి దర్శనం కల్పిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు సమాచారం.

దేశవ్యాప్తంగా తిరుమలకు సామాన్యులు పోటెత్తుతారు. వివిధ రాష్ట్రాల నుంచి రోజూ లక్షల సంఖ్యలో వస్తారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమల క్యూలైన్లో రోజంతా నిలబడుతారు. భారీ రద్దీతో కిటకిటలాడే తిరుమలలో శ్రీవారి దర్శనం సులువుగా అయ్యేలా ఏర్పాటు చేయడమే లక్ష్యమని వైవీ సుబ్బారెడ్డి ప్రకటించినట్టు తెలిసింది. ఇక వీఐపీ దర్శనాలకు ప్రత్యామ్మాయం ఆలోచిస్తామని వైవీ సుబ్బారెడ్డి చెప్పినట్టు తెలిసింది.

ఈ నిర్ణయం ప్రకారం వీఐపీలు ఇక రోజూ తిరుమల శ్రీవారిని దర్శించుకునే అవకాశం ఉండదు. రాష్ట్రంలో అవినీతి, అక్రమాలకు తావు లేకుండా జగన్ సుపరిపాలన అందిస్తున్నారని.. ఆ కోవలోనే తాము టీటీడీలో ప్రక్షాళన చేస్తున్నామని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.


Tags:    

Similar News