టాటా మోటార్స్ పై జికా వైరస్ ప్రభావం

Update: 2016-02-05 09:11 GMT
దక్షిణ అమెరికా దేశాలను వణికిస్తూ ప్రపంచానికి ప్రమాద సంకేతాలు పంపిస్తున్న ప్రమాదకర వైరస్ జికా అదృష్టవశాత్తు ఇంతవరకు ఇండియాలో ప్రవేశించలేదు. కానీ, ఆ ప్రభావం మాత్రం ఇండియాపై పడింది. ఇండియాలో తొలిసారి జికా వైరస్ ప్రభావానికి గురైంది వ్యక్తులెవరూ కాదు... ఒక సంస్థ... అవును.. భారత దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్ పై జికా వైరస్ ప్రభావం పడింది. జికా వైరస్ దెబ్బకు ఆ సంస్థ తాను తయారుచేస్తున్న ఓ కారు పేరును మార్చుకుంది.  జికా వైరస్ ప్రాచుర్యంలోకి రాకముందే టాటా మోటార్స్ ''టాటా జికా'' అనే కారును అనౌన్స్ చేసింది. దీనికి విస్తృతంగా ప్రచారం కూడా చేసింది. అయితే... జికా వైరస్ ప్రపంచాన్ని వణికించడం మొదలుపెట్టిన తరువాత టాటా మోటార్స్ తన ఆలోచన మార్చుకుంది. ఆ పేరు ఉంటే అది దుష్ఫలితాలు ఇవ్వొచ్చని భయపడి ఇప్పుడు ఆ కారు పేరును మారుస్తోంది. కొత్త పేరు ఏంటనేది ఇంకా ఖరారు చేయనప్పటికీ జికా అన్న పేరును మాత్రం మార్చేయడం గ్యారంటీ అని టాటా మోటార్స్ ప్రకటించింది.

జిప్పీ కార్ అనే అర్థం వచ్చేలా దానికి షార్ట్ ఫార్మ్ గా టాటా జికా అనే ఈ పేరును ఎంచుకుంది. అయితే.. దురదృష్టవశాత్తు అదే పేరుతో ప్రమాదకర వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించడంతో ఆ పేరుపై తన ఆలోచనను మార్చుకుంది. తాజాగా ఆటో ఎక్స్ పో లో టాటా జికాను ప్రదర్శించినా కొత్త పేరు మాత్రం ఇంకా మార్చలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఈ వైరస్ పేరును ఉంచడం ఏమాత్రం భావ్యం కాదని... ప్రజలకు దాన్ని గుర్తు చేయడం తమకు ఇష్టం లేదని, సామాజిక బాధ్యతగా ఆ పేరును మారుస్తున్నామని టాటా కంపెనీ చెబుతోంది. కొద్ది రోజుల్లో కొత్త పేరును ప్రకటిస్తారు.

Tags:    

Similar News